యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్​లో.. ఓరుగల్లుకు ప్రయారిటీ

  • మొదటి దఫా 28 లో ఉమ్మడి వరంగల్​కు అత్యధికంగా 6 స్కూల్స్​
  • వరంగల్​, నర్సంపేట, పరకాల, ములుగు, భూపాలపల్లి, స్టేషన్​ ఘన్​పూర్​
  • మూడింటికి శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు

వరంగల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్​ కేటాయింపులో ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో స్కూల్ నిర్మాణం చేపట్టి, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దఫాలో 28 నియోజకవర్గాల్లో వీటి నిర్మాణం చేపట్టనున్నది. ఇందులో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా 6 నియోజకవర్గాల్లో స్కూళ్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు. శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో స్కూల్స్​నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. 

మూడుచోట్ల శంకుస్థాపనలు.. మరో 3 పెండింగ్​ ఉమ్మడి వరంగల్​జిల్లాలో గత శుక్రవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం పనులకు మూడు చోట్ల ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. వరంగల్ తూర్పులో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రంగశాయిపేట్ పరిధి ఉర్సు గుట్ట మైదానం వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లా ఇంచర్లలో పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క, భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం వద్ద వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ స్కూల్ బిల్డింగ్​ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

పరకాలలో స్థానిక ఎమ్మెల్యే స్కూల్ నిర్మాణానికి అవసరమైన భూముల కోసం విలీన గ్రామాలైన రాజ్​పేట ఏరియాలో పరిశీలించారు. నర్సంపేట స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్​లో ఏర్పాటు చేసేలా స్థల పరిశీలన చేశారు. పరకాల, నర్సంపేట స్కూల్ శంకుస్థాపనలు జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చేతులమీదుగా చేసేందుకు ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారు. స్టేషన్ ఘన్​పూర్ స్కూల్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్​రెడ్డితో శంకుస్థాపన చేయించనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.180 కోట్లు..

కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్​తో నిర్మించనున్న ఒక్కో ఇంటిగ్రేటెడ్​ స్కూల్ కోసం దాదాపు రూ.180 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వ పెద్దలు తెలిపారు. మొదటి ఏడాదిలో వీటి నిర్మాణానికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో మన రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో నిర్మంచే ఈ స్కూళ్లల్లో కుల, మతాలకు అతీతంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. 4 నుంచి 12 తరగతి వరకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్లాసులు ఉండగా,  అత్యధునిక డిజిటల్​ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ సెంటర్లు, స్కూల్ లైబ్రరీలో 5 వేలకుపైగా బుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించేలా కోర్టులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఒక్కో స్కూల్ నిర్మాణానికి 25 ఎకరాల స్థలం ఎంపిక చేస్తున్నారు.