ఇటీవల కాలంలో పంట సాగు గిట్టుబాటు కాక ఆర్ధికంగా నష్టాల బారిన పడుతున్నారు. పంట పెట్టుబడి వ్యయంలో 50% పైగా రసాయనిక ఎరువులు .. పురుగుమందులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కొన్ని రకాల ద్రావణాలు,కాషాయాలను మొక్కలకు పిచికారి చేస్తే ఖర్చు తక్కువ అవడమే కాకుండా.. పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంతేకాక రసాయనిక ఎరువులు వాడకం వలన భూమిలోని సారం కూదా తగ్గుతుంది. పంటను తెగుళ్ల బారినుంచి కాపాడుకొనేందుకు సేంద్రీయ ఎరువులను.. కషాయాలను...మందులను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం....
పచ్చి మిర్చి... వేప వెల్లుల్లీ పొగాకు ద్రావణం: వేప ఆకులు – 2 కిలోలు, వెల్లుల్లి పాయలు -1 కిలో, ఆవు మూత్రం – 5 లీటర్, పొగాకు కాడలు – 1 కిలో, పచ్చి మిర్చి -1 కిలో ( ఒక ఎకరాకు)
తయారు చేసే విధానం:వేపాకులు, వెల్లులి పాయలు , పచ్చి మిరపకాయలను మెత్తగా పేస్ట్ చేసి ముద్ద చేయాలి. పొగాకు కాడను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. వీటిని 10 రోజుల పాటు 5 లీటర్ల ఆవు మూత్రంలో నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని 10 రోజుల తర్వాత వడపోసి.... దానికి 200 లీటర్ల నీరు కలిపి, ఒక ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. అయితే ఈ కషాయాన్ని 10 నుంచి 15 రోజుల్లోపు వాడాలి. దీనిని ఎక్కువ కాలం నిల్వ చేయరాదు.
ఉపయోగాలు: శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్ర గొంగళి పురుగు, కాయతొలిచే పురుగు, ఆకుముడత పురుగును నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది.
కుళ్ళిన పండ్లు ... కూరగాయలు మిశ్రమ ద్రావణం: కావలసిన పదార్ధాలు ( ఎకరాకు ),ఆవు పేడ 10 కిలోలు,కుళ్ళిన పండ్లు లేక కూరగాయలు -10 కిలోలు,నీరు 100 లీటర్లు. ( ఒక ఎకరాకు)
తయారు చేసే విధానం: ప్లాస్టిక్ డ్రమ్ములో ఆవుపేడ, కుళ్లిన పండ్లు, కూరగాయలు వేయాలి. ఆ తరువాత ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు పోసి మూత పెట్టి నీడలో 10 రోజుల వరకు ఉంచాలి. ఈ డ్రమ్ములో ఉన్న మిశ్రమాన్ని ప్రతిరోజు పెద్ద కర్రతో కింది నుంచి పైకి అందులోని పదార్దాలు కదిలేలా కదపాలి. పదిరోజుల తరువాత ఈ మిశ్రమాన్ని వడపోయాలి.ఈ ద్రావణాన్ని ఒక ఎకరా పొలంలో నీటి ద్వారా ఈ ద్రావణాన్ని పారించాలి. .
ఉపయోగాలు: ఈ ద్రావణం భూమిలో ఉండే సూక్ష్మ జీవులకు , వాన పాములకు ఆహారంగా ఉపయోగపడి పంటకు ఆరోగ్యవంతంగా పెరగడానికి తోడ్పడుతుంది.
తూటి కాడ కాషాయం:తూటి కాడ ఆకులు -10 కిలోలు,ఆవు మూత్రం -15 లీటర్లు ( ఒక ఎకరాకు)
తయారు చేసే విధానం: మొదట 10 కిలోల తూటి కాడ ఆకులను తీసుకొని బాగా మెత్తగా దంచాలి. ఇప్పుడు మెత్తగా దంచిన తూటి కాడ ఆకులకు15 లీటర్లు ఆవు ముత్రాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కుండలో పోసిఉడకపెట్టి.. ఆ తరువాత బాగా చల్లార్చాలి. . ఇప్పుడు ఈ మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి బాగా కలియబెట్టాలి.
ఉపయోగాలు: తూటి కాడ కాషాయం ముఖ్యంగా సుడి దోమ నివారణకు బాగా పనిచేస్తుంది.
ద్రవ జీవామృతం: ఆవు పేడ -10 కిలోలు, నల్ల బెల్లం – 2 కిలోలు, పప్పు దినుసుల పిండి – 2 కిలోలు, ఆవు మూత్రం -10 లీటర్ ( ఒక ఎకరాకు)
తయారు చేసే విధానం: ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీరు తీసుకోవాలి.ఈ నీటికి దాదాపు 10 కిలోల ఆవుపేడ కలిపి , కర్రతో బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంలో నల్ల బెల్లాన్ని మెత్తగా పొడి చేసి దీనితో పాటు శనగపిండిని కలపాలి. ఇందులో 10 లీటర్ల పశువుల మూత్రాన్ని... పావుకిలో మట్టిని వేసి కర్రతో బాగా కలియబెట్టాలి. ఆ తరువాత ఈ పాత్రపై గోనె సంచిని కప్పి ప్రతిరోజు 3 నుంచి 5 సార్లు కలియబెట్టాలి. ఈ విధంగా నాలుగు రోజులు పులిసేలా ఉంచాలి.. ఇలా తయారు చేసిన ద్రవజీవామృతాన్ని మూడు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.
ఉపయోగాలు: దీనిని అన్ని పంటలకు ఉపయోగించవచ్చు. పెరుగుదలకే కాకుండా చీడ పీడలు రానివ్వదు. పండ్ల తోటలకు, ప్రతి చెట్టుకు 2-5 లీటర్ల ద్రవ జీవామృతం భూమి పై చల్లాలి. చెట్టు చుట్టూ నీడ పడే పరధిలో చల్లుకోవాలి..
పసుపు దుంప కషాయం: పసుపు దుంపలు కిలో, 5 లీటర్ల ఆవుమూత్రం, 100 గ్రాముల సబ్బుపొడి ( ఒక ఎకరాకు)
తయారు చేసే విధానం: పసుపు దుంపలను మెత్తగా పొడి చేయాలి.ఈ పొడికి 5 లీటర్ల ఆవు మూత్రాన్ని కలపాలి. దీనికి ఒక కర్రతో కలియబెట్టాలి. ఈ ద్రావణాన్ని పలుచటి గుడ్డలో వడపోసి 100 గ్రాముల సబ్బు పొడిని కలపాలి. ఈ ద్రావణాన్ని 100 లీటర్లు నీటితో కలిపి ఒక ఎకరాకు సాయంత్రం పూట పిచికారీ చేయాలి.
ఉపయోగాలు: పంటల్లో వచ్చే బూడిద తెగులు నివారించబడుతుంది.