కోయ భాషలో పాఠాలు

  • ఐటీడీఏ పరిధిలో పట్టాలెక్కుతున్న ‘కోయభారతి’
  • 219 స్కూళ్లు ఎంపిక.. 1 నుంచి 3 క్లాసులకు బుక్స్ రెడీ 
  • 4,690 మంది స్టూడెంట్స్​​కు కోయభాషలో బోధనకు యాక్షన్ ప్లాన్
  • స్వయంగా కోయభాష నేర్చుకుంటున్న పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు : గిరిజన గ్రామాల్లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు, గిరిబిడ్డలను బడికి ఇష్టంగా రప్పించేందుకు ఐటీడీఏ కోయ భాషలో పాఠాలు చెబుతోంది. మధ్యలో నిలిచిపోయిన కోయభారతి పథకాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్నారు. ఐటీడీఏ పీవో బిరాహుల్​ స్వయంగా కోయభాషను నేర్చుకుంటున్నారు. ఇటీవల ఆయన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ కోయభాషలో ప్రసంగించడం అందరినీ ఆకర్షించింది. 

ఆదివాసీలకు చేరువయ్యేందుకు వారి భాషనే వారధిగా మలుచుకోవడం ఏకైక లక్ష్యంగా ఐటీడీఏ పీవో కసరత్తు చేస్తున్నారు. టీసీఆర్​ అండ్ టీఐ( ట్రైబల్​ కల్చర్​ రీసెర్చ్ అండ్​ ట్రైనింగ్​ ఇనిస్టిట్యూట్​) 2024-–25 విద్యాసంవత్సరం నుంచి 1, 2 తరగతుల విద్యార్థులకు కోయ భారతి పుస్తకాలను సిద్ధం చేశారు. 3వ తరగతి వారికి సైతం వర్క్ షాపు నిర్వహించి పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. త్వరలో పుస్తకాలు భద్రాచలం చేరుకుంటాయి. 

వర్క్​ షాపులో పాల్గొన్న టీమ్..​

గతనెల17 నుంచి 20 వరకు హైదరాబాద్​లో కోయభారతి ప్రాజెక్టు పై వర్క్ షాపు జరిగింది. ఈ వర్క్ షాపునకు ముగ్గురు రైటర్స్ పాయం వెంకటరత్నం, రాధకృష్ణమూర్తి, కన్నయ్య, ఆర్టిస్టు లక్ష్మీనర్సింహమూర్తి హాజరయ్యారు. 3వ తరగతికి చెందిన కోయవాచకం 100 రోజులకు సరిపడా పాఠ్యాంశాలను తయారు చేశారు. గతంలోనే 219 స్కూళ్లను ఎంపిక చేశారు. ప్రైమరీ ఎడ్యుకేషన్​లో భాగంగా 4,690 మందికి కోయభాషలో బోధన చేసేందుకు యాక్షన్​ ప్లాన్​ తయారైంది. కొన్ని అన్నివార్య కారణాల వల్ల అది ఆగింది. ఇప్పుడు మళ్లీ కోయభారతి ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. గిరిజన విద్య బలోపేతం కోసం పీవో బి.రాహుల్​ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రాజెక్టుకు ఊపిరి పోశారు. 

ఆదివాసీలతో మమేకమవుతున్న పీవో

ఆదివాసీలతో మమేకం కావాలంటే వారి సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలి. గిరిజన గూడేల్లో బెరుకు బెరుకుగా ఉండే చిన్నారులతో వారి భాషలో మాట్లాడితే దగ్గరవుతారు. ఐటీడీఏకు వచ్చే ఆదివాసీల అసలు సమస్యలు తెలుసుకునేందుకు కూడా ఈ భాష ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో ఐటీడీఏ పీవో రాహుల్​ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే కోయ భాషపై దృష్టి సారించారు. నేర్చుకోవడమే కాదు ఏకంగా భాషలో మాట్లాడుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. మిగిలిన ఆఫీసర్లు కూడా పీవో బాటలో నడిస్తే ఏజెన్సీ ఏరియాలో సమస్యలకు పరిష్కారం దొరికినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

బుక్స్ ముద్రణ జరుగుతోంది

కోయభారతి పుస్తకాల ముద్రణ జరుగుతోంది. త్వరలో అవి వస్తాయి. మూడో తరగతికి సంబంధించి కూడా వర్క్ షాపు ఇటీవల ముగిసింది. కోయభాషలో విద్యాబోధన వల్ల డ్రాపౌట్స్ తగ్గి, పిల్లలు బడికి రప్పించడానికి ఎంతో ఉపయోగపడుతంది.- రమణయ్య, పీఎంఆర్సీ, ఐటీడీఏ