- గణేశ్ పూజకు మోదీ హాజరవడంపై ప్రతిపక్షాల మండిపాటు
- మన్మోహన్ ఇంట్లో ఇఫ్తార్ విందుకు అప్పటి సీజేఐ వెళ్లలేదా? అంటూ కాంగ్రెస్ కు బీజేపీ నేతల కౌంటర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన గణేశ్ పూజకు ప్రధాని మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది న్యాయవ్యవస్థ నిష్పక్షపాతం, పారదర్శకతపై అనుమానాలు రేకెత్తిస్తుందని విమర్శించాయి.
అయితే, గణేశ్ పూజకు సీజేఐ ఇంటికి వెళ్లడం నేరం కాదని.. న్యాయమూర్తులు, రాజకీయ నేతలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం సాధారణమేనని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బుధవారం రాత్రి సీజేఐ ఇంట్లో నిర్వహించిన గణేశ్ పూజకు మోదీ హాజరయ్యారు.
చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్ కలిసి ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. వినాయకుడి విగ్రహం ముందు మోదీ హారతి ఇచ్చి పూజలు చేశారు. ‘‘సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జీ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నాను.
భగవాన్ శ్రీ గణేశ్ మనందరికీ ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యం ప్రసాదించు గాక” అని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే అక్కడ పూజలో పాల్గొన్న, సీజేఐ ఫ్యామిలీ స్వాగతం పలుకుతున్న, వారితో సమావేశమైన ఫొటోలను కూడా షేర్ చేశారు.
ఆ కేసు విచారణ నుంచి సీజేఐ తప్పుకోవాలె..
సీజేఐ తన ఇంట్లో పూజకు ప్రధానిని ఆహ్వానించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. జడ్జిలు, రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి సంబంధాలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
శివసేన యూబీటీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య కేసును సీజేఐ బెంచ్ విచారిస్తున్నది. ఇలాంటి సమయంలో సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం అనుమానాలను రేకెత్తిస్తుందని తెలిపారు. అందుకే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసు నుంచి తప్పుకోవాలని రౌత్ సూచించారు.
‘‘ఇది గణపతి పండుగ.. ప్రధాని ఇప్పటివరకు ఎంత మంది ఇండ్లకు వెళ్లారో.. నాకు సమాచారం లేదు. ఢిల్లీలో చాలా చోట్ల గణేశ్ ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ ప్రధాని మాత్రం చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లారు. ప్రధాని, సీజేఐ కలిసి హారతి ఇచ్చారు.
రాజ్యాంగ పరిరక్షకులు ఈ విధంగా రాజకీయ నాయకులను కలుస్తుంటే, ప్రజలకు సందేహాలు కలుగుతాయి’’ అని రౌత్ అన్నారు. ‘‘ఉత్సవాల అనంతరం మహారాష్ట్ర రాజకీయ పార్టీల వివాదంలో విచారణను ముగించడంపై చీఫ్ జస్టిస్ దృష్టి పెడతారని ఆశిస్తున్నాను.
అంతెందుకు.. మహారాష్ట్ర ఎన్నికలు మూలన పడొచ్చు.. మరికొంత కాలం వాయిదా వేయొచ్చు” అని శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజలకు ఇది భిన్నమైన సందేశాన్ని పంపిస్తుందని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
‘‘గణపతి పూజ వ్యక్తిగత అంశం. కానీ మీరు కెమెరాల ముందు చేస్తున్నారు. ఆ ఫొటోలు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. అది ఇచ్చే సందేశం మరోరకంగా ఉంటుంది. సీజేఐ, ప్రధాన మంత్రి అంటే దేశంలో చాలా పెద్ద వ్యక్తులు.
అయితే వారే ఈ ఫొటోలను ప్రజలకు చూపిస్తే మనం ఏం అనగలం” అని అన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ అంశం తప్పుడు సందేశం ఇస్తుందని విమర్శించారు.
‘‘కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం, ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పని చేసేలా చూడాల్సిన బాధ్యత ఉన్న న్యాయవ్యవస్థకు ఇది చాలా చెడు సంకేతాన్ని పంపుతుంది’’ అని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.
ప్రతిపక్షాలవి రెండు నాల్కల ధోరణి: బీజేపీ
సీజేఐ ఇంట్లో గణేశ్ పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంపై ప్రతిపక్షాలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని బీజేపీ మండిపడింది. ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా గురువారం ట్విట్టర్ లో స్పందించారు.
‘‘2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఇంట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అది మాత్రం సెక్యులరిజం.
అప్పుడు న్యాయవ్యవస్థ పూర్తి సురక్షితంగా ఉంది. కానీ ఇప్పుడు సీజేఐ ఇంట్లో జరిగిన గణేశ్ పూజలో ప్రధాని మోదీ పాల్గొనేసరికి న్యాయవ్యవస్థ పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయా?” అని ఆయన ప్రశ్నించారు. నాడు మన్మోహన్ సింగ్ ఇంట్లో ఇఫ్తార్ పార్టీకి ప్రముఖులు హాజరైన ఫొటోలను ఈ సందర్భంగా పూనావాలా షేర్ చేశారు.