జీవో 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు త్వరగా న్యాయం చేయాలి

గత  ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక చీకటి జీవో.. త్రీ వన్ సెవెన్ జీవో. ఈ జీవో తీసుకువచ్చిన కష్టం ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. ఉద్యోగులు వారి స్థానికత కోల్పోయి మూడు నాలుగు జిల్లాలు దాటి పరాయి జిల్లాల్లో ఉద్యోగ జీవితం గడుపుతూ నా అన్నవాళ్లందరికీ దూరమై స్థానికతను, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సంతోషాన్ని కోల్పోయి  బిక్కుబిక్కుమంటూ  కాలం వెళ్లదీస్తున్నారు.

గత ప్రభుత్వం ఈ జీవో చాలా బాగుందని, ఇది చాలా మెరుగైందని,  దీని మించిన జీవో లేదని, ఈ జీవో తప్పు అని అన్నవారికి లాగులు పగులుతాయని హెచ్చరించింది. ఈ జీవో వల్ల జరిగిన అనర్ధం తెలపడానికి బాధితులు18 సార్లు  ప్రగతి భవన్ ను ముట్టడించడం జరిగింది.18సార్లు వారిని  గత ప్రభుత్వం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచింది. అయినా, మొక్కవోని ధైర్యంతో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.34 మంది జీవో 317 బాధితులు చనిపోయినా ఏ ఒక్క సంఘం,  ఏ ఒక్క నాయకుడు వీరి గురించి, వీరికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడకపోవడం శోచనీయం. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడతామని మాట ఇచ్చింది.

సబ్​ కమిటీ ఏర్పడి 200 రోజులు గడిచినా..
కాంగ్రెస్ నాయకుడు, పీఆర్​టీయూ  తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మా పోరాటానికి తోడుగా ఉండి కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో మంత్రి  శ్రీధర్ బాబును ఒప్పించి జీవో 317లో మార్పులు చేర్పులు చేసి స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు సమస్యను పరిష్కరిస్తామని చేర్చడం జరిగింది. ప్రభుత్వం పాలనలోకి రావడానికి ఈ ఉద్యోగులు వారి శాయశక్తులు ప్రదర్శించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను యుద్ధ ప్రాతిపదికన సెలవులు పెట్టుకొని మరీ ఓటు వేసి వారికోసం నిలబడతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఇది అక్షర సత్యం.

కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత 317 జీవో పై ఒక సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీకి మంత్రి దామోదర రాజనర్సింహ  చైర్మన్  గా,  శ్రీధర్ బాబు,  పొన్నం ప్రభాకర్  సభ్యులుగా నియమించింది. ఈ సబ్ కమిటీ ఏర్పడి 200 రోజులు గడిచినా ఇంకా 317 బాధితులు వారికి పరిష్కారం లభించక ఆరోగ్యాలు చెడి, ఆక్సిడెంట్ బారిన పడి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 

ఇంకను పరిష్కారం చూపించలేక మీనమేషాలు లెక్కబెడుతున్న ఈ తరుణంలో.. గత ప్రభుత్వపు వారసులు అనుయాయులు ఇది ఒక కాలయాపన కమిటీ అని వీరు ఎవ్వరికీ న్యాయం చేయలేరని , స్థానికత  కోల్పోయిన వారికి ఎలాంటి న్యాయం జరగబోదని మళ్లీ మ్యూచువల్, స్పౌస్ లు, మెడికల్ గ్రౌండ్స్ వారిని మాత్రమే  పంపిస్తారని అనునిత్యం వారి సందేశాలతో త్రీ వన్ సెవెన్ బాధితుల  మానసిక స్థైర్యంతో ఆట ఆడుకుంటున్నారు. మనోవేదనతో కాలం వెళ్లబుచ్చుకుంటూ ఇక ఇంతేనా మా బతుకు.. ఎవరు వచ్చినా ఇంతేనా?  మా సీనియర్ స్థానిక జిల్లాలోనే ఉంటారు ! మా జూనియర్ స్థానిక జిల్లాలోనే ఉంటారు ! మేం చేసిన పాపం  ఏంటో ? అని నిరంతరం వేదన చెందుతూ  దిక్కుతోచని స్థితిలో ఊగిసలాడుతున్నారు.

కమిటీ నివేదికపై ప్రకటన చేయాలి
సబ్ కమిటీకి ఒకటే నివేదించుకుంటున్నాం. కమిటీ రిపోర్ట్, నివేదికకు సంబంధించి ఒక అధికారిక పత్రికా ప్రకటన చేయగలరు. ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన జరగనందున ఎవరుపడితే వారు ఏదైనా సందేశాలు పంపుతున్నారు. మీరు ఇచ్చిన మాట మరువరని , సబ్ కమిటీ ఏర్పాటు చేసిందే  స్థానికత  కోల్పోయిన ఉద్యోగి కోసం అని మీరే చెప్పారు.  ఒకవేళ అది నిజం కాకపోతే మీరు చేతులెత్తేస్తే ఇది మీ ప్రతిష్టకు భంగం. మిమ్మల్ని మనసారా నమ్మి మీకోసం పాటుపడిన ప్రతి ఉద్యోగి నమ్మకం కోల్పోతారు. ఒక ఉద్యోగి మానసిక స్థైర్యంతో ఉద్యోగం, పూర్తి ఆరోగ్యంతో ఉద్యోగ నిర్వహణ చేయడం చాలా అవసరం.  ప్రభుత్వ ఉద్యోగి ఎంతో నిష్టతో పనిచేస్తేనే ప్రభుత్వం అన్ని రంగాల్లో, వ్యవస్థలలో అనూహ్యమైన విజయాలు దక్కించుకోగలుగుతుందని  గమనించగలరు. 

స్థానిక జిల్లాలకు పంపితే దేవుడవుతారు
ఈ దసరాకి 317 జీవో బాధితుల్ని వారి వారి స్థానిక జిల్లాలకు చేర్చితే వారు మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటారు. మీరు వారికి పునర్జన్మ ప్రసాదించిన భగవంతుడు అవుతారు. దయచేసి వీలైనంత తొందరలో పరిష్కారం చేయగలరు. ఎందుకంటే ఎంత ఆలస్యం అవుతుంటే అన్ని ప్రాణాలు గాల్లో దీపాలులాగ ఉన్నాయి. ప్రాణాలు పోయిన తర్వాత జరిగే న్యాయానికి ఏ విలువ ఉండదు. నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అందుకే 317 బాధితులు కాంగ్రెస్​ ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు. న్యాయం చేయండి. కాలయాపన వలన మరెన్నో  ప్రాణాలు పోకుండా చూడాలి. అందుకని ఈసారి ఆలస్యం జరగకుండా కుదిరినంత త్వరగా శుభ పరిష్కారాన్ని చేయగలరని మనవి.

రత్నమాల, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, 

317 జీవో బాధిత ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘం