సైదాపురం ప్రభుత్వ స్కూల్ లో ఒకే టీచర్

యాదగిరిగుట్ట, వెలుగు : మండలంలోని సైదాపురం ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో ఐదుగురు టీచర్లకు గాను ఒకే ఒక్క టీచర్ విధులకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 71 మంది విద్యార్థులు చదువుతుండగా, ఐదుగురు టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం పాఠశాల సమయానికి ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే విధులకు హాజరై పిల్లలతో ప్రార్థన చేయించింది. మిగతా నలుగురు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను గ్రామస్తులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

విషయం తెలుసుకున్న ఇద్దరు ఉపాధ్యాయులు హుటాహుటిన సీఎల్ పెట్టుకున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై ఎంఈవో శరత్ యామినిని వివరణ కోరగా.. ఐదుగురు టీచర్లలో ఒకరు ఓసీఎల్, మరొకరు సీఎల్ లో ఉన్నారని, మిగతా ముగ్గురు విధులకు అటెండ్ అయ్యారని తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం ప్రతిరోజూ ఒకే టీచర్ విధుల్లో ఉంటున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లగా హెచ్ఎంను సంప్రదించి వాస్తవాలు తెలుసుకుంటానని చెప్పారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.