3 లక్షల మందితో సీఎం కప్‌‌‌‌‌‌‌‌..డిసెంబర్ 7 నుంచి 36 క్రీడల్లో పోటీలు

  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది క్రీడాకారులతో సీఎం కప్ క్రీడోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్‌‌‌‌‌‌‌‌ శివసేనా రెడ్డి చెప్పారు. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు 36 క్రీడాంశాల్లో మూడు దశల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి సీఎం కప్‌‌‌‌‌‌‌‌ జరుగుతుందన్నారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసిందని ఎల్బీ స్టేడియంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. 

శనివారం నుంచి ప్రారంభం అయిన ఆన్ లైన్ ప్రక్రియలో ఉత్సాహంగా గ్రామీణ క్రీడాకారులు తమ సమాచారాన్ని పొందుపరుస్తున్నారన్నారు. 7, 8వ తేదీల్లో తొలి దశలో గ్రామ స్థాయిలో పోటీలు,  10–12వ తేదీల్లో మండల స్థాయి, 16–21 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తన సమాచారాన్ని ఆన్ లైన్ లో పొందుపరిచేలా, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌, మొబైల్ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ‘ఒక ఏడాది కాలంలోనే అన్ని రంగాల మాదిరిగానే క్రీడారంగంలో సమూల మార్పులు సాధిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 

పలు అంతర్జాతీయ పోటీలతోపాటు గ్రామీణ క్రీడారంగానికి ఊతమిచ్చేలా సీఎం కప్ నిర్వహిస్తాం. ఈసారి సీఎం కప్ పోటీల నిర్వహణలో గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం( జీఎంఎస్ ) ద్వారా క్రీడా పోటీల సమాచార సమాహారాన్ని పొందుపరుస్తాం. దీనిద్వారా ప్రస్తుత పోటీల నిర్వహణ మాత్రమే కాకుండా భవిష్యత్తు అవసరాలకు క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం’ అని శివసేనా రెడ్డి తెలిపారు.