త్వరలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆన్​లైన్​ ఓపీ

  • త్వరలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆన్​లైన్​ ఓపీ
  •  వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు సర్కారు చర్యలు
  • పైలట్​ప్రాజెక్టు కింద పలు దవాఖాన్లలో  అమలు 
  • తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్​చేసే యోచన 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గవర్నమెంట్ ​హాస్పిటళ్లలో పేషెంట్ల వెయిటింగ్ సమయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓపీ కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించడాన్ని గుర్తించిన ప్రభుత్వం దానికి చెక్​ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. త్వరలో ఆన్​లైన్ ​ఓపీ సేవలు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. యాప్ ​లేదా వెబ్​సైట్​క్రియేట్ ​చేసి పేషెంట్లు ఇంటి నుంచే ఆన్​లైన్ లో ఓపీ బుక్​చేసుకుని వెళ్లేలా ప్లాన్​ చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా సిటీలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్​తదితర హాస్పిటళ్లలో అమలు చేయనుంది. తర్వాత రాష్ట్రమంతటా విస్తరించనుంది. అయితే, చదువుకోని, ఫోన్లు లేని పేద ప్రజల సంగతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తడంతో సాధారణ ఓపీ క్యూలైన్లను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 

ఇప్పటికే అభ యాప్​తో...

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిటీలోని పలు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఆన్​లైన్​ఓపీ కోసం అభ యాప్​తీసుకొచ్చింది. దీని ద్వారా దవాఖానల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్​ కోడ్​ స్కాన్ ​చేస్తే ఓపీ నంబర్​వస్తుంది. దీన్ని అటెండర్లకు చూపిస్తే జనరల్​ లైన్లలో కాకుండా సెపరేట్​ లైన్ల ద్వారా డాక్టర్​దగ్గరకు పంపిస్తున్నారు. అయితే, హాస్పిటల్​కు వచ్చి స్కాన్​చేయాల్సి రావడం, చాలా మందికి తెలియకపోవడం వల్ల ఉపయోగం అంతంత మాత్రంగానే ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నుంచే ఆన్​లైన్ ఓపీ సౌకర్యాన్ని తీసుకురాబోతుండంతో అనూహ్య స్పందన వస్తుందని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు భావిస్తున్నారు.  

రోజూ వేలల్లోనే ఓపీ.. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్​తదితర ప్రధాన హాస్పిటళ్లకు రోజూ వేల సంఖ్యలో పేషెంట్లు​వస్తుంటారు. సాధారణ రోజుల్లో ఆయా దవాఖానల్లో వెయ్యికి పైనే ఓపీ నమోదవుతూ ఉంటుంది.  సీజనల్​ టైమ్​లో ఈ సంఖ్య రెండు వేల వరకూ వెళ్తుంది. చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఉదయం 6 గంటలకే వచ్చి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. 9 అయితే కానీ ఓపీ కౌంటర్లు ఓపెన్​ కావు. దీంతో జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గంటల తరబడి లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిరీక్షణ, ఇబ్బందులకు ఆన్​లైన్ ఓపీ చెక్​పెట్టనుంది. ఆన్​లైన్​ ఓపీతో ఇంటి నుంచే ఓపీ తీసుకొని, ఇచ్చిన నంబర్​ఆధారంగా ఆ సమయానికి హాస్పిటల్ కు వచ్చి డాక్టర్​ను కన్సల్ట్​అయ్యే వెలుసుబాటు ఉంటుంది.  

టెస్టులు ఒకే రోజులో పూర్తయ్యేలా..

చిన్న చిన్న సమస్యలతో హాస్పిటళ్లకు వచ్చేవారిని ఒకే రోజులో పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సాధారణంగా ఓపీ తీసుకొని డాక్టర్లను కన్సల్ట్​ కావడానికి మధ్యాహ్నం దాటుతోంది. ఒకవేళ డాక్టర్లు టెస్టులు రాస్తే శాంపిల్ కలెక్షన్​కు ఒకరోజు, టెస్టు రిజల్ట్​కు మరో రోజు, చిన్న చిన్న టెస్టులకు కూడా రెండు మూడు రోజులు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఎంఆర్ఐ లాంటి స్కానింగ్ కు వారాలు, నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వీటన్నిటికి త్వరలో చెక్​ పెట్టేలా ప్రభుత్వం ప్లాన్లు సిద్ధం చేసింది. బ్లడ్,యూరిన్, ఇతర టెస్టులు ప్రైవేట్​హాస్పిటళ్లలో మాదిరి గంటల్లో పూర్తయ్యేలా ల్యాబుల్లో కొత్త ఎక్విప్​మెంట్ తీసుకురావడంతో పాటు, మ్యాన్​ పవర్​ కూడా పెంచేలా చర్యలు తీసుకోబోతున్నారు. మధ్యాహ్నంలోపు టెస్టులు పూర్తయి, ఈవెనింగ్ ఓపీలో​మళ్లీ డాక్టర్లను కన్సల్ట్​ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.