ఆన్​లైన్​ బెట్టింగ్​తో  పోతున్న ప్రాణాలు .. అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు ఆగం

  • రోజుకో 4 కొత్త యాప్స్.. నిషేధమున్నా అమలు ఉత్తిమాటే
  • యువకులతోపాటు ఉద్యోగులు,పోలీసుల్లోనూ వ్యసనం
  • ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు.. అధిక వడ్డీకి యాప్​లో లోన్లు
  • బెట్టింగ్, గేమ్స్​లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకల్లోతు కష్టాల్లోకి..
  • వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు
  • పిల్లలు చేసే అప్పులకుతల్లిదండ్రులూ సూసైడ్

వరంగల్, వెలుగు: ఆన్​లైన్​ బెట్టింగ్​యాప్​లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. నిషేధమున్నా ఫోన్​లో రోజుకో 4 కొత్త బెట్టింగ్​యాప్స్​పుట్టుకురావడంతో..యువకులతోపాటు ఉద్యోగులు, పోలీసులు వాటి బారినపడుతున్నారు. అదేపనిగా బెట్టింగ్​చేస్తూ..ఆన్​లైన్​గేమ్స్​ఆడుతూ.. ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆస్తులు తాకట్టుపెట్టి, లోన్​యాప్​లలో అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు, లోన్లు ఇచ్చినోళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలను బలితీసుకుంటున్న సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇంట్లో ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతున్నది.  మొబైల్​ఫోన్​ఓపెన్​ చేస్తే చాలు..‘‘వన్ ఎక్స్​బెట్, మెగాపరి, మోస్ట్​బెట్, పరిపేస, పరిమ్యాచ్, 10 సీఆర్ఐసీ, మెల్​బెట్, మేట్​బెట్, 1ఎక్స్​ బెట్, బీసీ డాట్​ గేమ్​, 22  బెట్​, రాజా బెట్స్​, బెట్​ 365, స్టేక్​ డాట్​ కమ్​, డఫ్పా బెట్” లాంటి వందలాది అఫీషియల్, అన్​అఫీషియల్​ఆన్​లైన్​బెట్టింగ్​యాప్స్​ కనిపిస్తున్నాయి. యూట్యూబ్, సోషల్​మీడియా, వెబ్​సైట్లలో వంద రూపాయలు పెడితే రూ. వెయ్యి ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్​యాడ్స్​దర్శనమిస్తున్నాయి.

చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో రూ. వందకు రూ. రెండొందలు.. రూ. వెయ్యికి రెండు వేలు, మూడు వేలు ఇస్తూ మెల్లిగా ఊబిలోకి లాగుతున్నారు. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు, వ్యసనాల బారిన పడి ఇంకొందరు.. పగలు, రాత్రి తేడా లేకుండా 24  నాలుగు గంటలూ ఆన్​లైన్​ బెట్టింగ్​గేమ్స్​లో మునిగితేలుతున్నారు.గతంలో ఈ వ్యసనం కొంతమంది యువత వరకే పరిమితమవగా..ఇప్పుడది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్​వేర్​ఇంజినీర్లు, బ్యాంకర్లు..అనే తేడా లేకుండా ప్రతి రంగానికి చేరింది. అయితే..ఈ బెట్టింగ్​ఆడే ప్రతి వంద మందిలో దాదాపు 95 శాతం మంది చేతులు కాల్చుకుని, ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బుల కోసం కొందరు అడ్డదారి తొక్కుతుండగా..అవమానంగా భావించేవారు తమ ప్రాణాలతోపాటు కుటుంబ సభ్యుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.

అప్పులు తీర్చే దారి లేక కుటుంబమే బలి

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఎడపల్లి మండలం వడ్డపల్లిలో ఆన్​లైన్ బెట్టింగ్​ఊబిలో చిక్కుకుని రంగణవేణి హరీశ్​(25) ​ రూ.18 లక్షలు అప్పు చేశాడు.  అవి తీర్చే దారి లేక తల్లిదండ్రులకు చెప్పాడు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం కావడంతో వేరే దారి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. హరీశ్​తోపాటు అతడి తండ్రి సురేశ్, తల్లి హేమలత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

బెట్టింగ్ యాప్స్​కుబలైన కలెక్టర్ ​గన్​మెన్​ కుటుంబం 

సిద్దిపేట జిల్లాలో నిరుడు డిసెంబర్​ 15న ఏకంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌వద్ద గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌.. భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి తాను సూసైడ్​ చేసుకున్నాడు. చిన్నకోడూరు మండలం రామునిపట్లకుచెందిన ఏఆర్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ ఆకుల నరేశ్‌‌‌‌‌‌‌‌ ఐదేండ్లుగా సిద్దిపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వద్ద గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. నరేశ్‌‌‌‌‌‌‌‌కు భార్య చైతన్య , కొడుకు రేవంత్‌‌‌‌‌‌‌‌ (6),  కూతరు రిషిత (5) ఉన్నారు. నరేశ్​ రెండేండ్లుగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడ్డాడు. ఆట మైకంలో మొదట్లో వందలు, వేలల్లో ఉన్న అప్పు దాదాపు రూ.80 లక్షలకు చేరింది. వ్యవసాయ భూమిని అమ్మినా సగం అప్పు కూడా తీరలేదు. దీంతో రివాల్వర్​తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు.

భార్య, బిడ్డకు విషమిచ్చి.. భర్త సూసైడ్​

హైదరాబాద్ ​రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ రాధానగర్ ఫేజ్​–2, యమునా అపార్ట్​మెంట్​లో ఉండే ఆనంద్​ఈ ఏడాది ఏప్రిల్​8న  భార్య, బిడ్డను చంపి తాను సూసైడ్​చేసుకున్నాడు. పాల వ్యాపారం చేసే ఆనంద్​ ఆన్​లైన్​లో గేమ్స్, బెట్టింగ్​వల్ల రూ.15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థికంగా నష్టపోయి బంగారం, కారు సైతం అమ్మాడు. అప్పులిచ్చినోళ్ల వేధింపులు పెరగడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. చివరకు ఆనంద్ తన భార్య ఇందిరతోపాటు నాలుగేండ్ల కొడుకు శ్రేయాన్స్ ను చంపి, తాను ఉరి వేసుకుని తనువు చాలించాడు. 

ఫ్యామిలీలోని నలుగురు బలి

హైదరాబాద్​జీడిమెట్ల పీఎస్​పరిధిలోని గాజుల రామారానికి చెందిన సాఫ్ట్​వేర్​ఇంజినీర్ ఇప్ప వెంకటేశ్, భార్య వర్షిణి.. కొడుకు రిషికాంత్ (11),  విహాంత్​(3)కు విషమిచ్చి.. ఆపై వారు ఉరేసుకొన్నారు. ఆర్థిక సమస్యలతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో వెంకటేశ్​ చెప్పాడు. సూసైడ్​చేసుకుంటున్న విషయాన్ని మంచిర్యాల జిల్లాలో ఉండే తండ్రి కొమురయ్యకు ఫోన్​లో తెలిపాడు.  

గాజుల రామారం బాలాజీ లే అవుట్​సహస్ర అపార్ట్​మెంట్​లో మూడేండ్లుగా ఉంటున్న వెంకటేశ్​ఆన్​లైన్​ బెట్టింగ్, ఆన్​లైన్​ట్రేడింగ్​చేస్తూ రూ.20 లక్షలకు పైగా నష్టపోవడమే కాక.. యాప్​లోన్ల ద్వారా ఇన్​స్టంట్​లోన్లు తీసుకున్నట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. భార్యా, పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతో పిల్లలకు విషం ఇచ్చి అతడు, భార్య చీరతో ఫ్యాన్​కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.  

బెట్టింగ్​ కోసం 50 లక్షల అప్పు .. ఉరేసుకున్న సీఏ

నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన శశాంక్ (35) హైదరాబాద్​లో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఆన్​లైన్​ గేమ్స్ మొదలుపెట్టాడు. బెట్టింగ్ స్థాయికి చేరి, లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. వాటిని తిరిగి రాబట్టుకోవడానికి అప్పులమీద అప్పులు చేయడంతో అది దాదాపు రూ.50 లక్షలకు చేరింది. మనోవేదనకు గురైన శశాంక్ మే నెల 27న ఊరికి వచ్చి కొత్త కుంటపల్లిలోని మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

4 రోజుల్లో  12 లక్షలు పోవడంతో..

కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన నాగుల పృథ్వీ(25) బీటెక్ పూర్తిచేసి, యూపీలోని నోయిడాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ఆన్ లైన్ గేమ్స్​ఆడుతూ రూ.12 లక్షల వరకు అప్పు చేశాడు. 4 రోజుల్లోనే  మొత్తం డబ్బులు పోవడంతో మానసికంగా కుంగిపోయాడు. జాబ్ కి వెళ్లకుండా 15 రోజులు ఒంటరిగా ఉన్నాడు. అప్పులు తీర్చలేక మే 4న  ఆత్మహత్య చేసుకున్నడు.

రైలు కిందపడి..  రైల్వే ఉద్యోగి సూసైడ్​ 

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన దేవర రాజు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.  కొన్ని రోజులుగా రాజు ఆన్ లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. అందులో తేడా రావడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు.  అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు.  జులై 15న రఘునాథపల్లి రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

బెట్టింగ్​ కోసం రూ.10లక్షల అప్పు..విషం తాగి సూసైడ్​

సిద్దిపేట జిల్లా భూంపల్లి  అక్బర్ పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈదరి నవీన్ (27) ఫర్టిలైజర్ షాప్​ నడిపిస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసయ్యాడు.  తన స్థాయికి మించి రూ.10 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

నిషేధమున్నా ఆగని ఆన్​లైన్ ​జూదం 

రాష్ట్రంలో ఆన్​లైన్​బెట్టింగ్​యాప్స్​పై నిషేధమున్నా కొత్తగా రోజుకో 4  బెట్టింగ్​యాప్స్​పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్​, సోషల్​మీడియా, వెబ్​సైట్లు ఓపెన్​చేయడమే ఆలస్యం బెట్టింగ్​యాప్స్ యాడ్స్​ కనిపిస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన.. లేదంటే కుటుంబ సభ్యులు వీటి బారినపడి బలైన చోట మాత్రమే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్పందిస్తున్నారు. లేదంటే ఇది తమ పనికాదన్నట్టు లైట్​తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఆన్​లైన్​బెట్టింగ్​నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఒక్కరే వివిధ పేర్లతో బిజినెస్​నడిపిస్తున్నారు. కొత్త కస్టమర్లను పరిచయం చేసే రెగ్యులర్​కస్టమర్లకు డబ్బుల రూపంలో కమీషన్​ ఇస్తుండడంతో ఒకరిద్వారా మరొకరు రోజుకు వందలు, వేల సంఖ్యలో కొత్తగా ఆన్​లైన్​బెట్టింగ్స్​, గేమ్స్​ఆడేందుకు రెడీ అవుతున్నారు. 

ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు..

ఆన్​లైన్​ బెట్టింగుల కోసం ఇంటి పేపర్లు, కార్లు, భూములు వంటి ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారు. ఎక్కడా డబ్బులు పుట్టకపోతే లోన్​యాప్స్​లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు అప్పులు చేసినోళ్లు కూడా ఉన్నారు. సమయానికి అసలు, కిస్తీలు కట్టకపోవడంతో అప్పులు ఇచ్చినోళ్లు, లోన్ యాప్​ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇంట్లో వాళ్లకు చెప్తామని, చుట్టుపక్కల వాళ్లకు చెప్తామని, కోర్టులకు లాగుతామని బెదిరిస్తుండడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

ఆన్​లైన్ ​​బెట్టింగుల కోసం దొంగతనాలు

ఆన్​లైన్​బెట్టింగ్ కు అలవాటుపడి అప్పులు పుట్టకపోవడంతో డబ్బుల కోసం ముగ్గురు యువకులు ఏకంగా దొంగతనాలు చేసి, పోలీసులకు చిక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వర్ధవెళ్లికి చెందిన మందల సాయి, వెంకటేశ్​, వంశీ ఆన్​లైన్​ బెట్టింగ్​కు అలవాటు పడ్డారు. ఈ ముగ్గురూ డబ్బులు సరిపోక రాజన్నపేటకు చెందిన ఈడుగు కనుకయ్య.. తన పొలంలో పెట్టిన ట్రాక్టర్, దానికున్న కల్టివేటర్​తో సహా దొంగిలించారు. ఆపై బాధితుడు కేసు పెట్టడంతో పోలీసులకు దొరికిపోయారు.  

బెట్టింగ్ ​మానట్లేదని కొడుకును హత్య చేసిన తండ్రి 

ఆన్​లైన్​ బెట్టింగ్​లు, జల్సాలకు అలవాటు పడి కోట్లాది రూపాయలు పోగొట్టడమే కాకుండా ఆస్తులను అమ్ముతూ మాట వినడంలేదని రైల్వే ఉద్యోగి సత్యనారాయణ... తన కొడుకు ముఖేశ్​ కుమార్​ను చంపేశాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం భాగిర్తిపల్లిలో మే 12న  ఈ ఘటన జరిగింది. క్రికెట్​బెట్టింగ్ లో ముఖేశ్​​పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి, నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు మేడ్చల్​లోని ఇండ్లు, ప్లాట్​అమ్మేశాడు. ఇప్పటికైనా బెట్టింగ్ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ హెచ్చరించాడు. అయినా ముఖేశ్​​ తీరు మార్చుకోలేదు. అప్పటికే అతడి తీరు నచ్చక భార్య సైతం వెళ్లిపోయింది. డబ్బుల కోసం మరో ఇంటిని అమ్మాలని కొడుకు గొడవ చేయడంతో తండ్రి సత్యనారాయణ.. తన కన్నకొడుకునే కొట్టి చంపాడు. 

రూ. 10 వడ్డీకి అప్పు తెచ్చి..

ఆన్​లైన్ ​బెట్టింగ్, గేమ్స్​మాయలో పడ్డవారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియడంలేదు. ఇందులో నష్టపోయినవారిని గమనిస్తే.. మొదట్లో వందల రూపాయలతో మొదలు పెట్టే బెట్టింగ్​..తర్వాత రూ.వేలు, లక్షల వరకు వెళ్తున్నది. ఒకట్రెండుసార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో...అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్​పెట్టి అప్పుల పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్​ ఊబిలో చిక్కడంతో మామూలుగా బయట రూ.2 రూపాయల చొప్పున వడ్డీ నడిచేచోట రూ.5 నుంచి రూ.10 రూపాయల వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనకాడడం లేదు.