జమిలికి బాట పడేది విధ్వంసాలతోనే!

ఇది ఒక పెద్ద సవాల్.. పీపుల్స్​ పల్స్​ రీసెర్చ్​ సంస్థ

జమిలి ఎన్నికల నిర్ణయం ఒక సవాల్‌‌ అయితే నిర్వహణ అంతకన్నా పెద్ద సవాల్‌‌!  లోక్‌‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపించడం మౌలికంగా తప్పులా కనిపించదు. పైగా ఎన్నికలన్నీ ఒకేసారి జరపటం వల్ల నిర్వహణ శ్రమ తగ్గి, ఆర్థిక,-మానవ వనరులు కలిసొస్తాయంటే ఇంక చెప్పేదేముంది? కానీ, దాని కోసం రాజ్యాంగాన్ని పలు విధాలుగా సవరించాలి. చట్టాలు మార్చాలి. ఎన్నో నిర్బంధ విధానాలు అమలు చేయాలి.

 ప్రజాభీష్టానికి పలు పరిమితుల సంకెళ్లు విధించాలి. సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగి, నియంతృత్వ పోకడలు బలపడే ప్రమాద సంకేతాలున్నాయి. అస్తిత్వాలతో ముడివడ్డ ప్రాంతీయ మనోభావాలకిదొక గొడ్డలిపెట్టు!  బీజేపీ నేతృత్వపు పాలక ఎన్డీఏ జమిలికి పట్టుదలగా ఉంటే, విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ముందడుగెలా ఉంటుంది? ఇదంతా సజావుగా జరిగేనా? సాధ్యపడకపోతే... ఇదొక, తెలిసిచేస్తున్న దృష్టి మళ్లింపు ఎత్తుగడే అనుకోవాలా?

‘చెప్పుల జోడు మార్చడం లేదు, ఒక పట్టీ తెగింది. దాన్ని సరిచేసుకొని... సాఫీగా ముందుకుసాగడం లాంటిది ఉపఎన్నిక. దీంతో ఈ ప్రభుత్వమేమీ మారదు. కాకపోతే, మనం ఇక్కడ ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ప్రభుత్వం సరైన దారిలో నడిచేందుకు పనికొస్తుంది, పాలకపక్ష అభ్యర్థిని గెలిపిస్తే.. ఏమీ ఉపయోగం ఉండదు, సర్కారు నడక మారదు’ ఈ మాటలన్నది 1992 లో బీజేపీ ఆధునికతరం నాయకుల్లో ప్రభావవంతుడైన, దివంగత నేత ప్రమోద్‌‌ మహాజన్‌‌!  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లోని హిమాయత్‌‌నగర్‌‌ (హైదరాబాద్‌‌) అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారసభలో మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థి ఆలె నరేంద్రను గెలిపించమని ఓటర్లను కోరి ఆయనీమాటలన్నారు. 

ఎన్నికలు అయిదారు మాసాల్లోనో, ఏడాదిలోనో ఉంటే డీజిల్‌‌, -పెట్రోలు ధరలు పెరగవు. బస్‌‌,-  విద్యుత్‌‌ చార్జీల పెంపుండదు, అదనపు పన్నులు విధించరు.  పోలింగ్‌‌ ముగిసిన సాయంత్రమే పెంపు ఉత్తర్వులొస్తాయి.  ఇది మనం ఎన్నిమార్లు చూడలేదు? ఇక అయిదేండ్లదాకా ఏ ఎన్నికలూ ఉండవంటే పాలకుల విచ్చలవిడితనం ఏ స్థాయికి వెళుతుందో?  ఉపఎన్నికలుంటేనే.. సదరు నియోజకవర్గానికి వేల కోట్ల  పెండింగ్‌‌ నిధులు విడుదలై, కొత్త హామీలు వెల్లువెత్తే సంస్కృతి బలపడ్డ యుగం మనది.  ఎన్నికైన ప్రతినిధులో, ప్రభుత్వమో దారితప్పుతుంటే వెనక్కి రప్పించే హక్కు (రైట్‌‌ టు రీకాల్‌‌) కోరుతున్న జమానాలో ఎన్నికల్ని  స్థిరపరుస్తున్నామా?  పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కర్కశంగా కాలరాస్తున్నామా? పార్టీ మార్పిళ్ల (నిరోధక) చట్టాన్ని మరింత నగుబాటు చేస్తున్నామా? ఇవన్నీ ప్రశ్నలే!

సమూల మార్పులే సాధనం

‘ఒక దేశం - ఒకే ఎన్నిక’ అనేది నినాదమంత తేలికైన వ్యవహారం కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు, నిర్వహించొచ్చు! కానీ, అందర్నీ ఒక తాటిపైకి తెచ్చి, పూర్వరంగాన్ని సజావుగా సిద్ధపరచి నిర్వహించడానికి ఎంతో ‘వ్యవహారం’ నడపాల్సి ఉంటుంది.  ఈ క్రమంలో ఎన్నో ప్రజాస్వామ్య పద్ధతులు,  సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువల విధ్వంసం ఖాయం!  సమాఖ్య స్ఫూర్తి సన్నగిల్లి అధ్యక్ష తరహా నియంతృత్వ పాలనాపద్ధతివైపు అడుగులు పడే ప్రమాదముంది. 

 ఏడు దేశాల్లో అధ్యయనం చేశామంటున్నారు. అందులో మెజారిటీ అధ్యక్షతరహా పాలన ఉన్న దేశాలే!  మార్పుల్లో భాగంగా మొదట.. కొన్ని శాసనసభల జీవనకాలాన్ని పొడిగించాలి. మరికొన్నిటి కాలపరిమితిని కుదించాలి. దానికొక ఆమోదయోగ్య పద్ధతి ఖరారు చేయాలి.  వీటన్నిటి కోసం రాజ్యాంగంలోని వివిధ అధికరణాల (83, 85(2)బి, 172(1), 174(2), 324, 356 ) కింది 18 అంశాలను సవరించడంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఇతర చట్టాలనూ మార్చాలి. 

 ఒకసారి అలా ఏకీకృత (జమిలి) ఎన్నికలు జరిపాక, ఆ షెడ్యూల్‌‌ క్రమం అలా భవిష్యత్తులో కొనసాగించాలంటేనే ఇబ్బందులు.  జమిలి ఎన్నికల ప్రక్రియ ముగిసి, లోక్‌‌సభ సమావేశమైన తొలి రోజును ‘అపాయింటెడ్‌‌ డే’ గా రాష్ట్రపతి గుర్తించడంతో, అన్ని అసెంబ్లీలకు అయిదేండ్ల పదవీ కాలాన్ని ఆ రోజు నుంచి పరిగణిస్తారు.  ఏమో? ఏ రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించలేం.  ప్రజాతీర్పు అస్పష్టమై హంగ్‌‌ ఏర్పడ్డపుడో,  పార్టీ మార్పిళ్లతో  ఏర్పడే రాజకీయ అనిశ్చితి వల్లో,  అవిశ్వాస తీర్మానాలు నెగ్గడం కారణంగానో ఆయా సభలకు అర్ధాంతరంగా కాలం చెల్లితే మళ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.  అప్పుడు  ఏర్పడే ప్రభుత్వాలు... మిగిలిపోయిన సభా కాలానికే  పనిచేయాలంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగమే! 

గత అనుభవాల పాఠం

లోక్‌‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలం (జమిలి) ఎన్నికలు మనకు కొత్త కాదు. స్వాతంత్రపు తొలి రెండు దశాబ్దాల్లో 1951–-52, 1957, 1962, 1967 నిర్వహించిన నాలుగు ఎన్నికలు జమిలిగానే జరిగాయి. అలా జరుగుతున్న క్రమంలో వివిధ అనివార్య పరిణామాల వల్ల పరిస్థితులు మారుతూవచ్చాయి.  కొత్త రాష్ట్రాలు ఏర్పడటం, రాష్ట్రపతి పాలన విధింపు, రాజకీయ అనిశ్చితి వల్ల కొన్ని ప్రభుత్వాలు అర్ధంతరంగా కూలిపోవడమో, స్వీయ లేదా  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో కొన్ని ప్రభుత్వాలు రద్దవడమో వంటివి జరిగి ఆయా రాష్ట్రాల్లో మధ్యలోనే  ఎన్నికలు జరపాల్సి వచ్చింది.

 అసెంబ్లీల అయిదేండ్ల షెడ్యూల్‌‌ లోక్‌‌సభ ఎన్నికలతో పొసగక విడివడింది. ఆ మార్పుతో వచ్చిన బేధం అలా కొనసాగి, ఆయా రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు కాస్తా విడివిడి ఎన్నికలయ్యాయి. మార్పులకు కారణమైన పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయి. అందులో మంచి ఉంది, చెడూ ఉంది. వాటన్నిటినీ మార్చి, ఇప్పుడు మళ్లీ జమిలి జరపాలనే వాదన ముందుకువస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పడి, నివేదిక ఇచ్చింది. ఆ సిఫారసులను  కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది.  జమిలి నిర్వహణతో  ఒనగూరే ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. ఏకకాలంలో అన్ని ఎన్నికల నిర్వహణ వల్ల సమయం ఆదాతోపాటు శ్రమ, మానవ, ఆర్థిక వనరుల వ్యయం తగ్గుతుంది. 

తొలగని భయాలు

‘జమిలి’పై పలు పార్టీలకు, వేర్వేరు భావజాలాల వారికీ కొన్ని సందేహాలున్నాయి. బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలుండాలనే సమాఖ్య స్ఫూర్తి మనది. జమిలి వల్ల సమాఖ్యతత్వానికి ప్రమాదమనే అభిప్రాయముంది. జాతీయ స్రవంతితో సాగే ‘జమిలి’ ప్రచార ప్రవాహంలో.. ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, ప్రయోజనాలు కొట్టుకుపోతాయని మరో భయం. ఎన్నికల ఫలితాలను ఇది ప్రభావితం చేస్తుంది. 

లోక్‌‌సభ అసెంబ్లీలకు ఎన్నికలు కలిసి, విడివిడిగా జరిగినపుడు జాతీయ పార్టీలు పొందే ఓటువాటా వ్యత్యాసాలు ఈ విషయాన్ని పలుమార్లు ధృవీకరించాయి.  జాతీయపార్టీలు లేవనెత్తే అంశాలే ఎజెండా అయి, స్థానికాంశాలు మరుగున పడిపోయే ఆస్కారముంది. హర్యానా, జమ్ము-కశ్మీర్‌‌ ఎన్నికలకు మహారాష్ట్ర ఎన్నికల్ని కలిపి నిర్వహించలేనివారు లాజిస్టిక్స్‌‌ పరంగా ‘జమిలి’ఎలా జరుపగలరనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. బీజేపీ- ఆరెస్సెస్‌‌ ఎజెండా అమలులో భాగంగా జమిలికి పట్టుపడుతున్న పాలకులు రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడు’ అన్నా ఆశ్చర్యం లేదు. జమిలి జాతర ఎక్కడ ముగిసేనో?! 

విస్తృత ఏకాభిప్రాయం సాధించాలి!

‘ఒక దేశం ఒకే ఎన్నిక’ బిల్లును, లోక్‌‌సభ వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ముందు విస్తృత ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామని కేంద్రం ప్రకటించింది. రాజకీయ పార్టీలతోనేకాక పౌరసంస్థలు, మేధావులు, విద్యావేత్తలు తదితరులతో చర్చిస్తామంటున్నారు.  పార్లమెంటులో  సదరు బిల్లు ఆమోదం పొందడానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.  

అంటే,  లోక్‌‌సభలో  బిల్లు నెగ్గడానికి కావాల్సిన సంఖ్యాబలం 362 అయితే ఎన్డీఏ పక్షాలకున్నది 293 మాత్రమే! రాజ్యసభలో కావాల్సింది 164 కాగా,  ఎన్డీఏ పక్షాలకున్న బలం 121. కోవింద్‌‌ కమిటీ,  నేరుగా అభిప్రాయం కోరిన 60 రాజకీయ పార్టీల్లో స్పందించినవి 47.  అనుకూలమంటున్న 32 పార్టీల బలం లోక్‌‌సభలో 271 మాత్రమే!  15 పార్టీలు బహిరంగంగా దీన్ని వ్యతిరేకిస్తుంటే, కొన్ని తటస్థంగా ఉన్నాయి. 

ఇది కాకుండా కొన్ని అంశాల్లో పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ మద్దతుకు తోడు సగానికి పైగా రాష్ట్రాల మద్దతు అవసరమవుతుంది. బిల్లు ఆమోదానికి కనీసం 14 రాష్ట్రాల మద్దతు అవసరమైనచోట, ఎన్డీఏ కూటమి చేతిలో 19 రాష్ట్రాలున్నాయి కనుక ఈ విషయంలో ఇబ్బంది రాకపోవచ్చు.   రేపు లాకమిషన్‌‌, ఎల్లుండి పార్లమెంటరీ కమిటీ కూడా జమిలికి సానుకూలంగా నివేదికలు ఇచ్చే ఆస్కారముంది.

- దిలీప్‌‌రెడ్డి, పీపుల్స్​ పల్స్​ రీసెర్చ్​ సంస్థ