లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..

లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఇవాళ ( డిసెంబర్ 17, 2024 ) లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు. వన్ నేషన్ –వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రన్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అనంతరం  సంయుక్త పార్లమెంటరీ స్థాయి  సంఘానికి సిఫారసు చేయాల్సిందిగా స్పీకర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. మరో వైపు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని ఎంపీ మనీష్ తివారి అన్నారు.

జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినేట్ ఆమోదించింది.  రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాలసవరణ బిల్లు-2024ను కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు. ఇది ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. ఏదైన అసెంబ్లీకి ఎన్నికలను లోక్ సభతో పాటు నిర్వహించలేకపోతే..ఆతర్వాత  వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి.  ఏదైన ఒక అసెంబ్లీకి  ఎన్నికలు నిర్వహించలేమని  ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు..వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2క్లాజ్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు.

ALSO READ : శ్రీలంకకు ఎల్‎ఎన్​జీ సరఫరా చేస్తాం: ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే.. జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. 1967వరకు లోక్ సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పలు కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి.