ఉక్రెయిన్​పై ఒకేరోజు.. 200 మిసైళ్లు, డ్రోన్లతో అటాక్

కీవ్/మాస్కో:  ఉక్రెయిన్​పై రష్యా మరో భారీ దాడి చేసింది. రెండు రోజుల కిందటే వంద డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడిన రష్యన్ ఆర్మీ.. గురువారం ఉక్రెయిన్​లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా 200 మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల పవర్ గ్రిడ్ దెబ్బతిని దాదాపు 10 లక్షల ఇండ్లకు కరెంట్ కట్ అయింది. చాలాచోట్ల ప్రజలు తాగునీటికి సైతం అల్లాడిపోయే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల విద్యుత్ సరఫరా బంద్ అయిందని, అందుకే  ఎమర్జెన్సీ పవర్ ఔటేజెస్​ను అమలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.  

ALSO READ : హెజ్బొల్లా గ్రూప్​తో కాల్పుల విరమణ షురూ.. 14 నెలల పోరాటానికి ఇజ్రాయెల్ ముగింపు

చలికాలం మొదలవుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి, ఆయుధాల తయారీకి ఆటంకం కలిగించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్నదే రష్యా కుట్ర అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యా గురువారం కాలిబర్ క్రూయిజ్ మిసైల్స్​ను ప్రయోగించిందని, వాటిలో క్లస్టర్ బాంబులను ఉపయోగించడంతో ప్రజల ఆవాసాలపై కూడా బాంబులు పడ్డాయన్నారు. దీనిని నేరుగా అమాయక ప్రజలపై జరిగిన దాడిగానే పరిగణించాలన్నారు. రష్యా గగనతల దాడులను అడ్డుకునేందుకు తమకు తగిన రక్షణ వ్యవస్థలను వెంటనే అందించాలని పశ్చిమ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రష్యా దాడులతో రివ్నే ప్రాంతంలో దాదాపు 2.80 లక్షల ఇండ్లకు, వోలిన్ రీజియన్​లో 2.15 లక్షల ఇండ్లకు కరెంట్ సరఫరా నిలిచిందని, తాగునీటి సరఫరా కూడా ఆగిపోయిందని రీజినల్ గవర్నర్ తెలిపారు.  

90 మిసైల్స్, 100 డ్రోన్లు ప్రయోగించాం: పుతిన్ 

ఉక్రెయిన్ లోని మిలిటరీ స్థావరాలు సహా17 టార్గెట్లపై తమ బలగాలు గురువారం దాడులు చేశాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ దాడుల్లో 100 డ్రోన్లు, 90 మిసైల్స్ ను వినియోగించినట్టు తెలిపారు. గత రెండు రోజుల్లో తమ బలగాలు మొత్తం 100 మిసైల్స్, 466 డ్రోన్లతో దాడులు చేశాయన్నారు. అమెరికా అందించిన లాంగ్ రేంజ్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడి చేసినందుకే తాము ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నామన్నారు. అయితే, రష్యా గురువారం 76 క్రూయిజ్ మిసైల్స్ ను, 32 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. మరో 62 డ్రోన్ల జాడ తెలియలేదని, వాటిని తమ 
బలగాలు జామ్ చేసి ఉంటాయని పేర్కొంది.