21న డీసీసీబీ చైర్మన్​పై అవిశ్వాస తీర్మానం​

నిజామాబాద్, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంక్​(డీసీసీబీ) చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డిపై 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోరుతున్న నేపథ్యంలో ఈ నెల 21న ప్రత్యేకంగా మీటింగ్​ఏర్పాటు చేసినట్లు డీసీవో శ్రీనివాస్ వెల్లడించారు. ఉదయం 11 గంటలకు సభ్యులందరూ హాజరుకావాలని నోటీసులు పంపామన్నారు. పాలకవర్గంలో మొత్తం 20 మంది డైరెక్టర్లకు ఓటు హక్కు ఉండగా, అందులో 15 మంది అవిశ్వాసం కోరుతూ సంతకాలు చేసి లెటర్​ సమర్పించారన్నారు. అందరి సంతకాలను నిర్ధారించుకున్న తర్వాత 15 రోజులు గడువు ఇచ్చి మీటింగ్ ​నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్​ పాలకవర్గ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉందని స్పష్టం చేశారు. 

వైస్​ చైర్మన్​ క్యాంప్​లో డైరెక్టర్లు

చైర్మన్​ భాస్కర్​రెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాస రాజకీయానికి తెరలేపిన వైస్​ చైర్మన్​ కుంట రమేశ్​రెడ్డి క్యాంప్​లోనే 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. హైదరాబాద్​సమీపంలోని మేడ్చల్​ రిసార్ట్​లో వారికి బస ఏర్పాటు చేశారు. క్లాస్​–1 కాంట్రాక్టరయిన రమేశ్​రెడ్డి చైర్మన్​ పదవి ఆశించారు. అప్పటి జిల్లా మంత్రి ప్రశాంత్​రెడ్డి కూడా మద్దతు తెలిపారు. కానీ తన తండ్రి పలుకుబడితో భాస్కర్​రెడ్డి చైర్మన్​పదవి దక్కించుకున్నారు.

అనంతరం ఆయన వ్యవహరించిన తీరుపై మెజార్టీ డైరెక్టర్లలో అసమ్మతి నెలకొంది. రాష్ట్రంలో బీఆర్​ఎస్​అధికారంలో ఉండడంతో అంతా సైలెంట్​గా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం మారడంతో అసమ్మతి బయట పడింది. కాంగ్రెస్ ​పార్టీ నేతల గ్రీన్​సిగ్నల్​తో వైస్​చైర్మన్​ రమేశ్​రెడ్డి డీసీసీబీ అవిశ్వాస రాజకీయాలకు తెరలేపారు. బ్యాంక్​ను కాంగ్రెస్​ పరం చేయడానికి పావులు కదుపుతున్నారు.  

ఎంపీ టికెట్​కోసం భాస్కర్​రెడ్డి ఆరాటం

పోచారం భాస్కర్​రెడ్డి బీఆర్ఎస్​ నుంచి జహీరాబాద్​ఎంపీ టికెట్​ఆశిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్​ పదవి ఇప్పించినట్లే కొడుకును లోక్​సభ బరిలో దింపడానికి తండ్రి పోచారం శ్రీనివాస్​రెడ్డి ఆరాటపడుతున్నారు. సిట్టింగ్​ఎంపీ బీబీ పాటిల్​తో భాస్కర్​రెడ్డి టికెట్​అవకాశాలు దెబ్బతినొద్దనే ఉద్దేశంతో ఆయనే పార్టీ వీడేలా చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా అవిశ్వాసంతో భాస్కర్​రెడ్డికి పదవి గండం పొంచి ఉండడంతో తండ్రి పోచారం శ్రీనివాస్​రెడ్డి  ఎంపీ టికెట్​ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.