అమెరికాలోకి వలసలపై.. మస్క్, ట్రంప్​ సపోర్టర్ల మధ్య లొల్లి

న్యూఢిల్లీ: ఇమ్మిగ్రెంట్ల అంశం అమెరికా ప్రెసిడెంట్‎గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు.. ఎలాన్ మస్క్ మధ్య చిచ్చు రేపుతున్నది. అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉండాలని.. ఇమ్మిగ్రెంట్స్‎కు అడ్డుకట్టవేయాలని మాగా(మేక్​ అమెరికా గ్రేట్ ఎగైన్) క్యాంప్ వాదిస్తున్నది. అయితే టాలెంట్​ఉన్న ఇమ్మిగ్రెంట్స్‏ను అమెరికా రానివ్వకపోతే సాంకేతికంగా వెనకబడతామని మస్క్​అంటున్నారు. మస్క్‎కు రిపబ్లికన్ లీడర్​వివేక్​రామస్వామి, ఇతర టెక్ కంపెనీల నుంచి సపోర్ట్‎గా దక్కుతున్నది.

శ్రీరామ్​ కృష్ణన్​ఎంపికపై వివాదం

జనవరి 20న ప్రెసిడెంట్​గా ప్రమాణం చేయనున్న ట్రంప్ తన కార్యవర్గాన్ని నియమించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు ఇండియన్ అమెరికన్లకు కీలకమైన బాధ్యతలు దక్కాయి.  ఏఐ పాలసీ అడ్వైజర్​గా మస్క్​స్నేహితుడు, వెంచర్​ క్యాప్టలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్​ను ట్రంప్ నియమించారు. స్కిల్స్ కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డ్‌‌‌‌‌‌‌‌లపై ఉన్న పరిమితిని తొలగించాలంటూ గతంలో కృష్ణన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నియామకంపై ట్రంప్​కు బలమైన సపోర్టర్స్ అయిన మాగా క్యాంప్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హెచ్1బీ వీసాపై దక్షిణాఫ్రికా నుంచి అమెరికా వలస వచ్చిన మస్క్ మాగా క్యాంప్​ తీరును వ్యతిరేకిస్తున్నారు. అత్యుత్తమ టాలెంట్‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలో ఎక్కడున్న తీసుకోవాలని చెప్తున్నారు. 

‘‘మీ టీమ్​ విజయం సాధించాలని కోరుకుంటే టాప్ టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉన్న వారు ఎక్కడున్నా రిక్రూట్ చేసుకోవాలి’’ అని మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. మస్క్‌‌‌‌‌‌‌‌ వాదనను వివేక్ రామస్వామి సమర్థించారు. అమెరికా కల్చర్​లో ఉన్న లోటుపాట్లను చూపిస్తూ ‘ఎక్స్’​లో మెసేజ్ పోస్ట్ చేశారు. అమెరికన్ కల్చర్ బెస్ట్ ఇంజినీర్లను తయారుచేయడం లేదని.. అందుకే ప్రముఖ కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభ, స్కిల్క్ ఉన్న వారిని నియమించకుంటున్నాయని తెలిపారు. అయితే వివేక్​ కామెంట్లను అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఖండించారు. అమెరికాలో చాలా టాలెంట్​ ఉందని.. దానిపై పెట్టుబడులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.