అనురాగ్ ‘కుల’ వ్యాఖ్యలపై.. లోక్ సభలో రెండో రోజూ లొల్లి

  • క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాల ఆందోళన
  • అనురాగ్ స్పీచ్ వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ 
  • ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ 

న్యూఢిల్లీ: కులం విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు లోక్ సభలో దుమారం రేపాయి. అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశాయి. మరోవైపు కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనపైనా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. 

ఈ క్రమంలో లోక్ సభ బుధవారం పలుమార్లు వాయిదా పడింది. మొదట క్వశ్చన్ అవర్ ప్రారంభం కాగా, అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా నిరాకరించడంతో.. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, శివసేన (యూబీటీ) ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తమ కులమేంటో తెలియనివారు కులగణనకు డిమాండ్ చేస్తున్నారని రాహుల్​ను ఉద్దేశించి ఠాకూర్ కామెంట్ చేశారు. మరోవైపు, అనురాగ్ ఠాకూర్ స్పీచ్ బాగుందంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు. 

అది తప్పకుండా వినాలంటూ ఆ వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఇండియా కూటమి డర్టీ పాలిటిక్స్ ను బయటపెడుతూ.. నిజాలు, హ్యాస్యాన్ని కలగలిపి అనురాగ్ మాట్లాడారని అందులో పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనురాగ్‌ను మోదీ మెచ్చుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు ప్రధానిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ చరణ్ జిత్ సింగ్​ చన్నీ ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు. 

రాజ్యసభలో ఖర్గే భావోద్వేగం.. 

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బుధవారం రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ జీవితానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వాటిని రికార్డుల్లో నుంచి తొలగించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో తివారీ మాట్లాడుతూ.. ‘‘ఖర్గే కుటుంబమంతా రాజకీయాల్లో ఉన్నది” అని కామెంట్ చేశారు.

 అయితే దీనిపై బుధవారం ఖర్గే మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబంలో నేనే మొదటితరం రాజకీయ నాయకుడిని. కాంగ్రెస్ లో చేరడంతో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. నా తండ్రి 85 ఏండ్ల వయసులో చనిపోయారు” అని ఎమోషనల్ అయ్యారు. కాగా, తివారీ చేసిన వ్యాఖ్యల్లో తప్పుగా ఏమీ అనిపించడం లేదని.. వాటిని మళ్లీ పరిశీలించి, అలాంటివి ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తామని ధన్ ఖడ్ హామీ ఇచ్చారు.