పామాయిల్ ఫ్యాక్టరీ ఏమాయె?

  • ఆయిల్​పామ్ సాగు మొదలై నాలుగేండ్లవుతున్నా అడ్రస్ లేని ఇండస్ట్రీ
  • 71 ఎకరాల ప్రాణహిత భూములు కేటాయింపు
  • ఎకరానికి రూ.15లక్షలుగా నిర్ణయం.. పైసలు కట్టని మ్యాట్రిక్స్ కంపెనీ
  • మరో చోట భూసేకరణకు ప్రయత్నాలు 
  • జిల్లాలో మొదలైన దిగుబడులు.. ఆందోళనలో రైతులు

మంచిర్యాల, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఆయిల్​పామ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుడు అక్టోబర్​లో అప్పటి ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ మందమర్రి మండలం సారంగపల్లి వద్ద పామాయిల్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ దానికి మోక్షం కలగలేదు. జిల్లాలో నాలుగేండ్ల క్రితం ఆయిల్​పామ్ సాగును ప్రారంభించారు. గతేడాది నుంచి దిగుబడులు చేతికొస్తున్నాయి. దీంతో పామాయిల్ ఇండస్ట్రీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. 

శంకుస్థాపన చేసి ఏడాది కావస్తున్నా.. 

మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆయిల్​పామ్ సాగును ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ సర్కారు మందమర్రి మండలం సారంగపల్లి వద్ద పామాయిల్ ఇండస్ట్రీ నిర్మాణానికి పూనుకుంది. దానిని హైదరాబాద్​కు చెందిన మ్యాట్రిక్స్ పామాయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్​కు అప్పగించింది. పామాయిల్ మిల్, రిఫైనరీ, ఫ్రాక్షనేషన్, ప్యాకింగ్ యూనిట్ల కోసం సారంగపల్లి శివారులోని ప్రాణహిత ప్రాజెక్టుకు చెందిన 71.05 ఎకరాలను కేటాయించింది. మార్కెట్ వ్యాల్యూ ఎకరానికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.10 కోట్ల 66 లక్షల 87 వేలుగా నిర్ణయిస్తూ సీసీఎల్ఏ 2023 జనవరి 2న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. 

ఆ పైసలు కట్టకముందే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయిల్​పామ్ రైతుల ఓట్ల కోసం బీఆర్ఎస్ సర్కారు హడావుడి చేసింది. నిరుడు అక్టోబర్ 1న కేటీఆర్ ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి దొరుకుతుందని ప్రకటించారు. ఏడాది కావస్తున్నా అడుగు ముందుకు పడలేదు. పామాయిల్ ఫ్యాక్టరీ కోసం ప్రాణహిత ప్రాజెక్టు భూములను కేటాయించడం వివాదాస్పదం కావడంతో మ్యాట్రిక్స్ కంపెనీ మరో చోట భూసేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

సాగుకు వెనుకాడుతున్న రైతులు

జిల్లాలో 2020లో ప్రయోగాత్మకంగా ఆయిల్​పామ్ సాగును ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 3వేల ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. 2024–25 సంవత్సరానికి గానూ1800 ఎకరాల విస్తీర్ణంలో తోటలు పెంచాలని టార్గెట్​ పెట్టుకోగా.. 475 ఎకరాలకు మాత్రమే పరిపాలన అనుమతులు లభించాయి. ఇందులో 900 ఎకరాలకు డ్రిప్ యూనిట్ల లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 113 ఎకరాలకే అనుమతులు వచ్చాయి. గత ప్రభుత్వం ఆయిల్​పామ్ రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను పెద్ద ఎత్తున పెండింగ్ పెట్టింది. మరోవైపు ఫ్యాక్టరీ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. దీంతో జిల్లాలో ఆయిల్​పామ్ సాగుకు రైతులు వెనుకాడుతున్నారు.

క్వింటాల్​కు 20 కిలోల కోత

జిల్లాలో ఆయిల్​పామ్ సాగు ప్రారంభించి నాలుగేండ్లు కావస్తుండగా నిరుటినుంచే దిగుబడులు వస్తున్నాయి. రిఫైనరీ అందుబాటులోకి రాకున్నా ఆందోళన చెందవద్దని, మద్దతు ధరకు పంట కొనుగోలు చేస్తామని మ్యాట్రిక్స్ కంపెనీ ప్రకటించింది. కానీ కొనుగోళ్లలో ఆలస్యమవుతోందని, క్వింటాలుకు 20 కిలోల వరకు కటింగ్ పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మార్త బుచ్చయ్య నాలుగు ఎకరాల్లో ఆయిల్​పామ్ వేశాడు. ఇటీవల గెలలు తెంపేసరికి పట్టించుకోవడం లేదని, కాంటా పెట్టేటప్పుడు క్వింటాలుకు 20 కిలోలు కట్ చేశారని, కంపెనీ ప్రతినిధులకు చెప్పినా స్పందించలేదని వాపోయాడు. 

తాను ఆయిల్​పామ్ పెట్టి నష్టపోయాయని, రైతులు మ్యాట్రిక్స్ కంపెనీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆవేదన చెందుతూ ఇటీవల సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఈ పంట సాగు పేరిట గత ప్రభుత్వం తమను ఆగం చేసిందని రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు స్పందించి పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.