ఎస్సారెస్పీ 41 గేట్లు ఖుల్లా  

  • ఎగువ నుంచి భారీగా వరద
  • దిగువకు 3.30 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
  • కందకుర్తి మీదుగా మహారాష్ట్ర వెళ్లే ఇంటర్​ స్టేట్​ రోడ్​ క్లోజ్​

బాల్కొండ/నిజామాబాద్, వెలుగు: ఎగువ గోదావరి నుంచి భారీ వరద రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నిండుకుండలా మారింది. దీంతో అధికారులు సోమవారం రాత్రి  41 గేట్లను పైకెత్తి 3.30 లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి  వదులుతున్నారు. ఎస్సారెస్పీకి ఆదివారం ఉదయం గోదావరి నుంచి 24,380 క్యూసెక్కుల నీటి ఇన్​ఫ్లో మాత్రమే ఉంది. తర్వాత పరిస్థితి క్రమంగా మారిపోయింది. ఆదివారం రాత్రి నుంచి మంజీరా, హరిద్రా నదుల్లో భారీ నీటి ప్రవాహం వచ్చి గోదావరిలో కలుస్తున్నది. ఎస్సారెస్పీ నీటి మట్టం గంటగంటకూ పెరుగుతున్నది. సోమవారం ఉదయం  ఎగువ నుంచి ప్రాజెక్ట్​లోకి 1,95,767 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. మొత్తం 42 గేట్లలో మొదట 8 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కులు, ఆ తర్వాత 16 గేట్ల నుంచి 50 వేల క్యూసెక్కులు, మధ్యాహ్నం 26 గేట్లు తెరిచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Also Read:-శంకర్​పల్లి మోకిలాలో నీట మునిగిన విల్లాలు

సాయంత్రానికి 40 గేట్లు ఓపెన్​ చేశారు. రాత్రి 8 గంటలకు 41 గేట్లు ఖుల్లా పెట్టారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా.. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,088.90 అడుగులు (72.99 టీఎంసీల) వరకు నీరు చేరినట్టు  ప్రాజెక్ట్ ఆఫీసర్లు చెప్పారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదను బట్టి ఔట్​ ఫ్లో ఉంటుందని ప్రాజెక్టు ఇన్​చార్జ్​ ఎస్ఈ శ్రీనివాస్ రావు గుప్తా తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి 2.65 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది. 

కాలువలకు నీటి విడుదల

ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, వరద కాలువ హెడ్ రెగ్యులేటరీ ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  కాకతీయ కాలువకు నీటి విడుదల చేయడంతో జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగు టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి  ప్రారంభమైందని  జెన్ కో ఆఫీసర్లు చెప్పారు. కాగా, ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి  నీటిని వదలడంతో చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. ఆఫీసర్లు హెచ్చరికలు చేసినా కొందరు అవేమీ పట్టనట్లు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

అలర్ట్​ ప్రకటించిన ఆఫీసర్లు

భారీ వరదల కారణంగా గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలడంతో రాష్ట్ర విత్తనాభిభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రాజెక్టును సందర్శించారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద, నీటి నిల్వ, ఔట్ ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆఫీసర్లకు వారు సూచించారు. ప్రాజెక్టుకు వచ్చే సందర్శకుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

మహారాష్ట్ర రోడ్​ క్లోజ్​

రెంజల్​ మండలం కందకుర్తి మీదుగా మహారాష్ట్ర వెళ్లే ఇంటర్​ స్టేట్​ రోడ్​ సోమవారం సాయంత్రం క్లోజ్​ చేశారు. గోదావరి నదిపై కందకుర్తి దగ్గర నిర్మించిన బ్రిడ్జికి కేవలం ఒక ఫీట్​ తేడాతో వరద కొనసాగుతున్నది. ఏ క్షణమైన వంతెన మీదుగా నీరు ప్రవహించే సూచనలు ఉన్నందున రాకపోకలు నిలిపేస్తూ రెంజల్​ ఇన్​చార్జ్​  తహసీల్దార్​ శ్రావణ్​ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంజీరా, హరిద్రా నదులు కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తాయి.