యాదాద్రి జిల్లాలో తేలిన  ‘పరిహారం’ లెక్క

  • జిల్లాలో ఇటీవల వానలకు పాక్షికంగా దెబ్బతిన్న 60 ఇండ్లు.. 6 స్కూళ్లు 
  • డ్యామేజైన ఆర్ అండ్ బీ, పీఆర్ రోడ్లు మరమ్మతులు, నిర్మాణాలకు రూ.86 లక్షల ఖర్చు
  • డిపార్ట్​మెంట్లవారీగా రిపోర్టు రెడీ చేసిన ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలకు యాదాద్రి జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో కురిసింది ముసురే అయినా నష్టం మిగిల్చింది. సీఎం రేవంత్ ​రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఆఫీసర్లు జరిగిన నష్టం వివరాలను సేకరించారు. ఇండ్లు, స్కూల్స్​పాక్షికంగా దెబ్బతిన్నాయని తేలింది. పలుచోట్ల రోడ్లు డ్యామెజీ అయ్యాయి. వీటి మరమ్మతులు కోసం ఎంత ఖర్చు అవుతుందో అధికారులు లెక్కలు వేశారు. దీంతో ప్రభుత్వం ఫండ్స్ కేటాయించింది.  

జిల్లాకు  రూ.3 కోట్లు..

అల్పపీడనం కారణంగా ఆగస్టు నెలాఖరు నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వానలు కురిశాయి. యాదాద్రి జిల్లాలో మాత్రం దాదాపు వారం రోజులపాటు విడవకుండా ముసురు పడింది. ఇందులో రెండ్రోజులు మోస్తారుకు మించిన వాన కురిసింది. విడకుండా కురిసిన వర్షం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నష్టం జరిగింది. దీంతో వరద సాయం కింద ప్రభుత్వం రూ.3 కోట్లు శాంక్షన్​  చేసింది. 

యాదాద్రిలో నష్టం వివరాలు..

సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో జిల్లా ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. డిపార్ట్​మెంట్లవారీగా ఏ మేరకు నష్టం జరిగిందో రిపోర్ట్ తెప్పించారు. వాన నీటిలో జారిపడడం వల్ల అడ్డగూడురు మండలం మానాయికుంటకు చెందిన ఐలమ్మ (80) మృతి చెందిందని ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారు. భువనగిరిలో ఆవు మరణించింది. విడవకుండా ముసురు కురియడంతో జిల్లాలోని పలుచోట్ల 60 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వలిగొండ మండలం వేములకొండలో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయింది.

జిల్లాలోని ఆరు స్కూల్స్​లో ప్రహరీలు కూలిపోవడంతోపాటు కొన్నింటిలో స్లాబ్​దెబ్బతిన్నది. ఆర్​అండ్​బీకి చెందిన స్టేట్ రోడ్స్ 12.75 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25.35 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి. వివిధ గ్రామాల్లోని పంచాయతీరాజ్​కు చెందిన 10.8 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఒక కుంటకట్ట తెగిపోయింది. ట్రాన్స్​కోకు సంబంధించి 158 స్తంభాలు, 4 ట్రాన్స్​ఫార్మర్లు కూలిపోయాయి. అయితే వరి, పత్తి పంటలు కలిపి 49 మంది రైతులకు చెందిన 80 ఎకరాల్లో పంట భూమిపై వాలిపోయింది. అయితే 33 శాతానికి కంటే తగ్గడం వల్ల ఇది నష్టం కిందకు రాదని అధికారులు రిపోర్ట్​లో పేర్కొన్నారు. 

రూ. 86 లక్షల నష్టం..

వర్షం కారణంగా ప్రభుత్వ సంస్థలకు రూ.86 లక్షలు నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఆర్​అండ్ బీ రోడ్లకు రూ.28.50 లక్షలు, ఆరుచోట్ల దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్ల​కు 9.50 లక్షలు ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. ట్రాన్స్​కో డిపార్ట్​మెంట్​కు రూ.25 లక్షలు, ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​కు రూ.11 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు రూ.10 లక్షలు, ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​కు రూ.2 లక్షలు ఖర్చు కానున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. 

డిజాస్టర్ మేనేజ్​మెంట్​కింద..

చనిపోయిన ఐలమ్మకు డిజాస్టర్​మేనేజ్​మెంట్ కింద రూ.5 లక్షలు అందనున్నాయి. అదే విధంగా ఆవుకు రూ.50 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి రూ.16,500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే కూలిపోయిన ఇంటికి రూ.1.30 లక్షలు అందనున్నాయి.