నిజామాబాద్ లో ఆస్తి​పన్నుల రీసర్వే

  • మాజీ ఆర్వో నరేందర్ అవినీతితో మున్సిపాలిటీకి  భారీ నష్టం
  • నిజామాబాద్ నగరంలో  ట్యాక్స్​ తేడాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు 
  • టౌన్​ ప్లానింగ్​, రెవెన్యూ సెక్షన్​ ప్రక్షాళన షురూ

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్​రీసర్వేకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.  ఇన్​ఛార్జ్​ రెవెన్యూ ఆఫీసర్​ దాసరి నరేందర్​అక్రమాలు వెలుగులోకి వచ్చాక కమిషనర్​ యువ ఐఏఎస్​ఆఫీసర్​ మంద మకరంద్​ ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇన్నాళ్లు  నగర పాలన ఖజానాకు గండిపెట్టారని గుర్తించి బిల్డింగ్​ ట్యాక్స్​లు రీసర్వే చేయించేందుకు సిద్ధమయ్యారు. దీంట్లో భాగంగా టౌన్​ ప్లానింగ్, రెవెన్యూ శాఖల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. 

కమర్షియల్​ ఏరియాలపై దృష్టి

నగరంలో  మొత్తం 60 డివిజన్‌‌‌‌ల పరిధిలోని కార్పొరేషన్‌‌‌‌లో 81,604  భవనాలకు ట్యాక్స్​లు వసూలు చేస్తున్నారు. ఇందులో 70,928 రెసిడెన్షియల్​ కాగా నాన్​ రెసిడెన్షియల్​ ఆస్తులు5,376 ఉన్నాయి. ఈ రెండింటి పరిధిలోకి రాని భవనాలు  5,300, రాష్ట్ర గవర్నమెంట్​ బిల్డింగ్​లు 234, సెంట్రల్​ గవర్నమెంట్​కు చెందిన ఆస్తులు ఏడు ఉన్నాయి.  ఏటా రూ.84 కోట్లు వీటి నుంచి ట్యాక్స్​ల రూపంలో వస్తోంది.  బిల్డింగ్​ కొలతల ప్రకారం ట్యాక్స్ విధిస్తారు. కమర్షియల్ కాంప్లెక్స్‌‌‌‌ల నుంచి అధిక ట్యాక్స్​వస్తోంది. 

టీఎస్​బీపాస్​ ద్వారా బిల్డింగ్​ పర్మిషన్​లు, ట్యాక్స్​ ఫిక్సేషన్  టౌన్​ ప్లానింగ్​, రెవెన్యూశాఖలు చూస్తాయి.  వ్యాపార, వాణిజ్య సంస్థలు అధిక సంఖ్యలో ఉన్న ఖలీల్​వాడీ, సరస్వతీనగర్​, గాంధీ చౌక్​, ఓల్డ్​, న్యూబస్టాండ్​, వినాయక్​నగర్​, ఆర్యనగర్​, ఆర్మూర్​ రోడ్​లోని షాప్​ల నుంచి తక్కువ ట్యాక్స్​వస్తున్నట్లు తేల్చారు. భవనాల కొలతలు తక్కువ నమోదు చేయడం, కమర్షియల్​కింద పరిగణించాల్సిన ప్రైవేట్​హాస్పిటల్స్​ను  మిక్స్​డ్​ కింద నోట్​ చేసినట్లు గుర్తించారు. ఒక భవనం నుంచి ఏడాదికి రూ.30 వేలు ట్యాక్స్ వసూలు అవుతుంటే..  పక్కనే ఉన్న మరో బిల్డింగ్​ నుంచి రూ.3 లక్షల ఆస్తి పన్ను వసూలవుతున్న తీరును గమనించారు.

పాలనలో ప్రక్షాళన

కొత్తగా బిల్డింగ్​ కొలతల బాధ్యతలను ఔట్​సోర్సింగ్​ఎంప్లాయిస్​ నుంచి తీసేశారు. కమర్షియల్​ బిల్డింగ్‌‌‌‌లను ఐడెంటీఫై చేసి వాటిని రీసర్వే చేయించాలని నిర్ణయించారు. టౌన్​ ప్లానింగ్​, రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో ఏండ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగుల బాధ్యతలు మార్చారు. కొత్తగా వచ్చిన ఎంప్లాయిస్​కు ఈ రెండు వింగ్​లపై ట్రైనింగ్​ ప్రొగ్రాం నిర్ణయించారు. బిల్డింగ్​ పర్మిషన్​ల కోసం పర్సనల్​గా దరఖాస్తుదారులు రావొద్దని టీఎస్​బీపాస్​ద్వారానే సేవలు పొందాలని ఆదేశాలు జారీ చేశారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిటిజన్స్​కు అందుబాటులో ఉండాలనే కమిషనర్​ మకరంద్​నిర్ణయంతో యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది.