గడువు దాటితే వాతే..!వాలిడిటీ లేని వాహనాలపై ఫోకస్​

  • జిల్లాలో గడువు ముగిసిన వాహనాలు సుమారు ఐదు వేలు 
  • పాత బండ్లు రోడ్డెక్కితే జరిమానాలు
  • రెన్యువల్​ చేసుకోవాలని ఆఫీసర్ల ఆదేశాలు

జనగామ, వెలుగు : రిజిస్ట్రేషన్ వాలిడిటీ ముగిసిన వాహనాలపై అధికారులు ఫోకస్​ పెట్టారు. పాత బండ్లు రోడ్డెక్కితే ఫైన్​ విధించేందుకు సిద్ధమవుతున్నారు. జనగామ జిల్లాలో రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ గడువు ముగిసినా వాహనదారులు పట్టించుకోకుండా రోడ్డెక్కేస్తున్నారు. జిల్లా పరిధిలో పెండింగ్ వాహనాల రెన్యువల్స్​ ద్వారా రూ.కోటీ 70లక్షల ఆదాయం సమకూరనున్నట్లు అంచనాలు ఉండగా, ఆ దిశగా రవాణా శాఖ ఆఫీసర్లు దృష్టి సారించారు. 

గడువు ముగిసిన వాహనాలు సుమారు ఐదు వేలు

జనగామ జిల్లాలో 4,804 వాహనాలకు పైగా రిజిస్ట్రేషన్ వాలిడిటీ గడువు ముగిసింది. ఇందులో మోటర్ సైకిల్స్ 2,922 ఉండగా, కార్లు​ 628 ఉన్నాయి. వ్యవసాయ పనులకు వాడుతున్న ట్రాక్టర్లు 1,109, ఓమ్ని బస్సులు 55,  హార్వెస్టర్ వాహనాలు 68 ఉన్నట్లు రోడ్డు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు కన్స్ ట్రక్షన్ కు వాడే వాహనాలు, మోపెడ్​లు తదితర రకాల వెహికిల్స్ ఉన్నాయంటున్నారు. వ్యవసాయానికి వాడుకునే ట్రాక్టర్లు రోడ్డెక్కే అవకాశం తక్కువ కావడంతో వాహన యజమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, టూ వీలర్లు, కార్లు మాత్రం రోడ్డెక్కక తప్పని పరిస్థితి. వీటిపై అధికారులు తనిఖీలకు సిద్ధం అవుతున్నారు. 

తప్పని జరిమానాలు..

రిజిస్ట్రేషన్​ వాలిడిటీ గడువు దాటితే జరిమానా మోత మోగేలా చట్టాలున్నాయి. కార్లకు నిర్ణీత గడువులోగా రెన్యువల్ కు స్లాట్ బుక్ చేసుకుంటే గ్రీన్ ట్యాక్స్ రూ 5 వేలు, వాలిడిటీ పెంపు ఫీ రూ.5,435 మొత్తంగా రూ.10, 435 గా ఉంది. కాగా, గడువు దాటితే ప్రతీ నెల రూ.500లు జరిమానా పడనుంది. ఎన్ని నెలలు గడిస్తే అన్ని రూ.500 ఎక్స్​ట్రా అమౌంట్ చెల్లించేలా నిబంధనలున్నాయి. టూ వీల్లర్లకు నిర్ణీత గడువులోగా అయితే గ్రీన్ ట్యాక్స్ రూ.వెయ్యి, వాలిడిటీ పెంపు ఫీ రూ.2435 మొత్తంగా రూ.3,435గా ఉంది. గడువు దాటితే వీటికి నెలకు రూ.300ల చొప్పున ఫైన్ పడనుంది. 

భారీగా బకాయిలు..

జిల్లాలో 4804 వాహనాల వాలిడిటీ ముగియగా వీటి రెన్యువల్స్ జరిగితే సుమారు రూ.కోటీ 70 లక్షల ఆదాయం సమకూరనుంది. దీంతో అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే వాహనదారులను హెచ్చరిస్తున్నారు. రోడ్డెక్కి పట్టుబడితే భారీగా జరిమానాలు, బండి సీజ్​ తప్పదని చెబుతున్నారు. రెన్యువల్ చెల్లింపులు ఆన్​లైన్ పద్ధతిలోనే కొనేసాగుతుండగా

మీ సేవ కేంద్రాలు లేదా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని రెన్యువల్స్​ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ తేదీ రోజు సదరు వెహికిల్ ను జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ ఆఫీస్​కు తీసుకువస్తే సరిచూసి వాలిడిటీని పెంచనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.