యాదాద్రి జిల్లాలో చెరువుల సర్వేపై అధికారుల ఫోకస్​

  •     హెచ్​ఎండీఏ పరిధిలో ఐదు మండలాల్లో 267 చెరువులు 
  •     ఎఫ్టీఎల్, బఫర్​జోన్​నిర్థారణకు ఐదు టీమ్స్ ఏర్పాటు 
  •     190 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్స్​
  •     30 చెరువులకు ఫైనల్​నోటిఫికేషన్స్​

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో చెరువుల సర్వేపై అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువులు యధాస్థితిలోనే ఉన్నాయా.. కబ్జాకు గురయ్యాయా.? బఫర్​జోన్​లో పర్మినెంట్​నిర్మాణాలు చేశారా..? అన్నది తేల్చకోవడానికి జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ప్రతిరోజూ కనీసం రెండు చెరువులను సర్వే చేయాలన్న లక్ష్యంతో టీములు ముందుకు సాగుతున్నాయి. సర్వేకు సంబంధించి ఎప్పటికప్పుడు హెచ్​ఎండీఏకు వివరాలు పంపిస్తున్నారు. 

హైడ్రా ఏర్పాటు.. సీఎం ఆదేశాలతో..

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన హైడ్రా.. చెరువుల పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. ఆక్రమణల్లో ఎంతటి పెద్దవారున్నా వెనుకడుగు వేయకుండా తొలగించేందుకు ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెరువుల ఆక్రమణలపై కామెంట్స్​చేశారు. ఆక్రమణలో ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించమని, వాటిని తొలగిస్తామని ప్రకటించారు. దీంతోపాటు జిల్లాల్లోని చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, హైడ్రా తరహా వ్యవస్థను విస్తరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కలెక్టర్లు తమ జిల్లాల్లోని చెరువుల లెక్కలు తీయాలని ఆదేశించారు. రూల్స్​ప్రకారం 25 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలోని చెరువులు, కుంటలకు ఎఫ్టీఎల్ హద్దు నుంచి 30 మీటర్లు బఫర్ జోన్‌‌గా ఉంటుంది. 25 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలోని చెరువులు లేదా కుంటలకు ఎఫ్టీఎల్ హద్దు నుంచి 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్​ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణ కిందికే వస్తుంది. చెరువుల సర్వే మొదలు పెట్టడంతో అక్రమార్కులకు భయం పుట్టుకుంది. దీంతో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాల లెక్కలు తేలుతాయని ప్రజలు భావిస్తున్నారు. 

30 చెరువుల ఫైనల్​నోటిఫికేషన్..

యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాలు హెచ్​ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల్లోని 267 చెరువులను అధికారులు గతంలో సర్వే చేయడానికి ప్రయత్నాలు జరిగినా..? ముందుకు సాగలేదు. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోని భువనగిరి, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, చౌటుప్పల్, బొమ్మల రామారం మండలాల్లో పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.  హెచ్ఎండీఏ పరిధిలోని ఐదు మండలాల్లోని చెరువుల్లో సర్వే నిర్వహించడానికి ఐదు టీమ్స్​ను ఏర్పాటు చేశారు.

ఈ టీమ్స్ ఆగస్టులో రంగంలోకి దిగాయి. హెచ్ఎండీఏ పరిధిలోని ఐదు మండలాల్లోని 267 చెరువులను నవంబర్​చివరి వారం నాటికి పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ప్రతిరోజూ కనీసం రెండు చెరువులను సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్​ సర్వే స్టాఫ్​తో కూడిన టీమ్స్​కోడింగ్​మ్యాప్​లతో చెరువుల వద్దకు వెళ్తోంది. చెరువుల అసలు విస్తీర్ణం ఎంత..? ఫుల్​ట్యాంక్​ లెవల్​​(ఎఫ్​టీఎల్​) ఎంత..? చిన్న, పెద్ద చెరువుల బఫర్​జోన్ లెక్కలు చూస్తున్నారు. బఫర్​జోన్​లో నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా..? అని పరిశీలిస్తున్నారు.

చెరువు విస్తీర్ణం, ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​పరిధికి సంబంధించి మ్యాప్​రూపొందించడంతోపాటు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు హెచ్ఎండీఏకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు 190 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 30 చెరువులకు ఫైనల్​నోటిఫికేషన్​ ఇచ్చారు. అన్ని చెరువుల సర్వే పూర్తయిన తర్వాత ఆక్రమణకు గురైన చెరువుల విషయంలో చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

పెద్ద చెరువు ఆక్రమణ..?

భువనగిరి పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతోంది. ఈ చెరువు ఎఫ్ టీఎల్, బఫర్​జోన్​పరిధిలో తరచూ మట్టి పోస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఎఫ్​టీఎల్ పరిధిలోకి చొచ్చుకొచ్చి చదును చేస్తున్నారు. డీసీపీ కార్యాలయం వెనక ఉన్న కుంటకట్టు కాల్వ కొంత భాగాన్ని పూడ్చినట్టుగా తెలుస్తోంది. బీబీనగర్​చెరువులో కొన్ని నిర్మాణాలు కూడా చేశారు. మరికొన్ని చెరువుల్లో ఇదే తరహా ఆక్రమణలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువుల సర్వేతో ఆక్రమణల విషయం తేలుతుందని ప్రజలు భావిస్తున్నారు.