- ప్లాన్ ప్రకటించిన కలెక్టర్
- రూ. 6,412 కోట్లు రుణ లక్ష్యం
- పంట లోన్ల విషయంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహారించాలి
కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లాకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను అధికారులు బుధవారం ఖరారు చేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లు, ఆయా శాఖల ఆఫీసర్లతో కలెక్టరేట్ సమావేశం నిర్వహించి ప్రణాళికను రిలీజ్ చేశారు. మొత్తం రూ. 6,412 కోట్ల రుణ ప్రణాళిక ఉండగా.. ఇందులో ప్రయార్టీ రంగాలకు రూ.5,610. 28 కోట్లు ( 87.48 శాతం), ఇతర రంగాలకు రూ.802 కోట్లు ( 12.51శాతం) కేటాయించారు.
ప్రయార్టీ రంగాల్లో ముఖ్యంగా పంట లోన్లకు రూ.3,425. 85 కోట్లు , రూ.732 కోట్లు టర్మ్ లోన్లు, రూ.537 .73 కోట్లు అగ్రికల్చర్ పనిముట్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ అనుబంధ సాంకేతిక రంగాలకు కేటాయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.700. 94 కోట్లు కేటాయించారు. విద్య, గృహా, ఇతర మౌలిక సదుపాయాలకు, పునరుత్పాదక శక్తికి రూ.213 . 38 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
100 శాతం లక్ష్యాన్ని సాధించాలి
బ్యాంకర్లు, ఆయా శాఖల ఆఫీసర్లు కో అర్డినేషన్తో పని చేస్తూ 100 శాతం లోన్ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష లో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5569 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా కాగా, 78.60 శాతం మాత్రమే లోన్లు ఇవ్వటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 శాతం లోన్ టార్గెట్‌ను సాధించేందుకు పని చేయాలన్నారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్స్ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇస్తున్నందున వీటి నిర్మాణానికి పెద్ద రైతులు ముందుకు వచ్చేలా ప్రొత్సహించాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్‌కు సూచించారు.
మహిళ సంఘాలకు 100 శాతం లోన్లు ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మంజూరై, పెండింగ్‌లో ఉన్న యూనిట్లను ఆలస్యం లేకుండా గ్రౌడింగ్ చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్‌కార్డు స్కీమ్ కింద పాడి రైతులు, గొర్రెల పెంపకం దారులకు మార్టిగేజ్ లేకుండా లోన్లు శాంక్షన్ చేయాలన్నారు. రైతులకు రుణాలు ఇవ్వటంతో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహారించాలన్నారు.
వివిధ స్కీమ్‌ల కింద వచ్చిన అప్లికేషన్లను త్వరగా పరిశీలించి గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. మహిళ పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీశక్తి పోగ్రాంను చేపట్టిందని, ఈ స్కీమ్ కింద ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా రూ. 2 కోట్ల వరకు లోన్లు ఇవ్వవచ్చన్నారు. దీనికి ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు ఉపాధి కల్పించవచ్చన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మెనేజర్ రెహమాన్, ఎస్బీఐ రీజినల్ మెనేజర్ శ్రీనివాస్, కెనరా బ్యాంక్ డీఎం తోరణ్, ఆయా బ్యాంకు ఆఫీసర్లు, ఆయా శాఖల జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.