కల్తీగాళ్లకు శిక్షపడేనా .. కఠిన చట్టాలతోనే అక్రమ దందాకు చెక్‌‌‌‌

  • ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ సేఫ్టీ చట్టాల్లో లొసుగులు
  • పెద్ద నేరానికి కూడా ఫైన్లు, సాధారణ శిక్షలే
  • జైలుకు పోయి దర్జాగా  బయటకు వస్తున్న నేరస్తులు
  • అధికారుల రిపోర్టు కూడా అదే...

హైదరాబాద్, వెలుగు: నకిలీ, నాసిరకం మెడిసిన్ల తయారీ, ఆహార కల్తీ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న చట్టాలతో అది సాధ్యమయ్యే పని కాదని అధికారులు చెబుతున్నారు. ఆ దందాలకు చెక్  పెట్టాలంటే కఠిన చట్టాలు ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని నేరస్తులు ఈజీగా బయటపడుతున్నారని, మళ్లీ మళ్లీ అలాంటి నేరాలకే పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఆహార కల్తీ, నాసిరకం మెడిసిన్ల తయారీ గ్యాంగులను నడుపుతున్న వారిలో చాలా మంది పాత నేరస్తులే ఉన్నారని, ఇందుకు కారణం ఆయా నేరాలకు కఠిన శిక్షలు లేకపోవడమేనని చెబుతున్నారు. 

ప్రస్తుతం ఉన్న ఫుడ్ సేఫ్టీ యాక్ట్, డ్రగ్ కంట్రోల్ యాక్ట్‌‌‌‌‌‌‌‌తో జరిమానాలు విధించే సెక్షన్లు, బెయిలబుల్ కేసులు పెట్టే సెక్షన్లు, తక్కువ కాలం శిక్షపడే సెక్షన్లే ఉన్నాయని, దీంతో నేరస్తులు సులువుగా బయటపడి మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తున్నారని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చట్టంలో మార్పులు చేయమని కోరాలని ప్రభుత్వానికి నివేదించారు.

ఒక్కరికీ శిక్ష పడలే..

ప్రజలకు నాణ్యమైన ఆహారం, నాణ్యమైన మెడిసిన్ అందించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీల్లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు..హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగాల అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. రోజూ ఏదో చోట కల్తీ కేటుగాళ్లను పట్టుకుంటున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత వారికి శిక్షలు వేయించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇందుకు కారణం ప్రస్తుతమున్న చట్టాల్లో పస లేకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 ఫుడ్ సేఫ్టీ యాక్ట్  ప్రకారం కల్తీ ఆహారం అని తేలితేనే క్రిమినల్ కేసు బుక్ చేయాలి. నాసిరకం(సబ్ స్టాండర్డ్‌‌‌‌) అని తేలితే జాయింట్ కలెక్టర్ వద్ద నేరస్తుడిని ప్రవేశపెట్టి జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష వేసేందుకే అవకాశం ఉంది. సబ్ స్టాండర్డ్ కేసుల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా చెల్లించి నేరస్తులు బయటపడుతున్నారు. ఇక క్రిమినల్ కేసులు నమోదైన వారికి గరిష్టంగా రెండేండ్ల జైలుశిక్ష విధించే అవకాశమే ఉంది. ఒకవేళ కల్తీ ఆహారం తినిఎవరైనా చనిపోయినట్లు నిరూపించగలిగితే గరిష్టంగా ఏడేండ్ల శిక్ష విధించేందుకు చట్టంలో సెక్షన్లున్నాయి. 

అయితే, ఇటీవలి కాలంలో ఒక్క కేసులోనూ ఇలా నిరూపించిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు..రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని బుద్వేల్‌‌‌‌లో ఏకంగా 73 క్వింటాళ్ల కల్తీ అల్లం పేస్టును  పోలీసులు పట్టుకున్నారు. యాసిడ్, రకరకాల కెమికల్స్‌‌‌‌తో కల్తీ అల్లం పేస్టును తయారుచేసి ఏడాది కాలంగా ఈ ముఠా అమ్ముతోంది. ఈ దందాకు  పాల్పడుతున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

వీరికి గరిష్టంగా రెండేండ్ల శిక్ష మాత్రమే పడే అవకాశం ఉందని, ఆ శిక్ష వేయించడానికి కూడా ఏండ్ల కొద్దీ  సమయం పడుతుందని ఫుడ్  సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. వీరు తయారు చేసిన అల్లం పేస్ట్  తినడం వల్ల ఎవరైనా చనిపోయినట్టు నిరూపిస్తేనే వారికి గరిష్టంగా ఏడేండ్ల శిక్ష వేయించగలమంటున్నారు. గడిచిన ఏడు నెలల్లో తాము బుక్  చేసిన ఒక్క కేసులోనూ నేరస్తులకు శిక్ష పడలేదని, అన్ని కేసుల్లోనూ ట్రయల్  కొనసాగుతోందని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’ కు తెలిపారు.

కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధికారులు

నాసిరకం మెడిసిన్ తయారీ, అమ్మకాలపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉక్కుపాదం మోపుతోంది. డీసీఏ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్‌‌‌‌ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ వేల సంఖ్యలో సోదాలు జరిగాయి. నాసిరకం మెడిసిన్ తయారు చేస్తున్న 40 కంపెనీలను సీజ్  చేశారు. రూ.వందల కోట్ల విలువైన మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌‌‌‌ ఇండియా నుంచి నకిలీ మెడిసిన్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌కు దిగుమతి చేస్తున్న ముఠాలను పట్టుకున్నారు. ఏడు నెలల్లో వందకుపైగా కేసులు బుక్  చేశారు. ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు వేయించేందుకు డ్రగ్ ఇన్‌‌‌‌స్పెక్టర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

తాము ఎంత పకడ్బందీగా కేసు నమోదు చేసినా..మినిమమ్ పనిష్‌‌‌‌మెంట్‌‌‌‌తోనే నిందితులు బయటపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. దీనికి కారణం డ్రగ్ కంట్రోల్ యాక్ట్​లో ఉన్న లోపాలతో పాటు, ప్రభుత్వం నుంచి సరిపడా లాయర్లు లేకపోవడం కూడా ఓ కారణమని ఓ మహిళా అధికారి తెలిపారు. డ్రగ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్ల కొరత ఉందని, నేరస్తులను పట్టుకోవడం కంటే కోర్టుల చుట్టూ తిరగడం కష్టంగా మారిందని వాపోయారు. నాసిరకం మెడిసిన్‌‌‌‌తో ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నా, అవి తయారుచేసి కోట్లు సంపాదిస్తున్న వారు లక్షల్లో ఫైన్లు కట్టడం శిక్ష ఎలా అవుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఫుడ్, డ్రగ్స్ చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వానికి విన్నవించారు.