సమగ్ర కుటుంబ సర్వేకు అంతా రెడీ

  • నేటి నుంచి ఫీల్డ్‌‌‌‌లోకి ఎన్యూమరేటర్లు 
  • కులం, ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలు నమోదు 
  • 75 ప్రశ్నలకు సమాధానాల సేకరణ 
  • సర్వేకు ముందు ఇళ్లకు స్టిక్కరింగ్

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు బుధవారం నుంచి ఇంటింటికి వెళ్లనున్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఈ సర్వేలో సేకరించనున్నారు. సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్వే క్వశ్చనీర్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం రెండు భాగాలుగా రూపొందించింది. 

పార్ట్-1లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, చదువులాంటి వ్యక్తిగత వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ - 2లో కుటుంబ వివరాలు అంటే ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సర్వే ప్రక్రియలో భాగంగా తొలుత ఇళ్లకు స్టిక్కరింగ్ 
వేయనున్నారు. 

కరీంనగర్ లో 1,964 మంది ఎన్యూమరేటర్లు

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ ను నియమించారు. వీరిలో మెజార్టీగా ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ల టీచర్లు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు ఉన్నారు. సర్వేలో పాల్గొనే టీచర్లు ఆదివారంతోపాటు ఇతర సెలవు రోజుల్లోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొత్తం మూడు వారాల పాటు ఈ సర్వే జరగనుంది.  కరీంనగర్ జిల్లాలో సుమారు 2.94 లక్షల ఇళ్లు ఉండగా 1,964 మంది ఎన్యూమరేటర్లకు సర్వే బాధ్యతలు అప్పగించారు. 

వీరిని పర్యవేక్షించేందుకు 207 మంది సూపర్ వైజర్లను నియమించారు. పెద్దపల్లి జిల్లాలో 2,47,976 ఇళ్లు ఉండగా 1,800 మంది ఎన్యూమరేటర్లను నియమించగా.. 200 మంది సూపర్ వైజర్లను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.90లక్షల ఇళ్లు ఉండగా1,400 మంది ఎన్యూమరేటర్లు వీరిని పర్యవేక్షించేందుకు 140 మంది సూపర్ వైజర్లు, జగిత్యాల జిల్లాలో 3.16 లక్షల ఇళ్లు ఉండగా.. 2,110 మంది ఎన్యుమరేటర్లు.. 211 మంది సూపర్ వైజర్లను నియమించారు. 

కాగా డ్యూటీలో ఉన్న సూపర్​వైజర్లు ప్రతిరోజూ10 శాతం ఇండ్లను తప్పక సందర్శించాల్సి ఉంటుంది. ఎన్యుమరేటర్లు సేకరించిన సర్వే సమాచారాన్ని వెనువెంటనే కంప్యూటర్ లో నమోదు చేయాలి. ఇందుకోసం ఎంపీడీవోలు, అధికారులు కంప్యూటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను సమకూర్చుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. 

ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలి

సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఇళ్ల జాబితా తయారీని పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుంచి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సర్వే ఏర్పాట్లపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లు వారికి కేటాయించిన విధులకు గైర్హాజరయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.