కాటన్​ సీడ్ రైతుల గోస .. లూజ్ విత్తనాలపై క్లారిటీ ఇవ్వని ఆఫీసర్లు

  • ఫెయిల్‌‌‌‌‌‌‌‌ సీడ్ పై క్లారిటీ లేకపోవడంతో తిప్పలు
  • తప్పించుకుంటున్న వ్యాపారులు, విత్తన కంపెనీలు

గద్వాల, వెలుగు: కష్టపడి పండించిన సీడ్  పత్తి విత్తనాలు ఫెయిల్  అయితే రైతు నిండా మునగాల్సిందే. ఫెయిల్  అయిన విత్తనాలను ఏం చేయాలనే విషయంపై అగ్రికల్చర్  ఆఫీసర్లు, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కాటన్ సీడ్ కు పెట్టింది పేరు. వానాకాలం సీజన్ లో గద్వాల నియోజకవర్గంలోని ప్రతీ రైతు తనకున్న పొలంలో ఎకరం, అర ఎకరం సీడ్​ పత్తి సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎకరా సాగు చేయడానికి రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. సీడ్​ జర్మినేషన్ లో పాస్  అయితే రైతుకు ఎకరాపై ఖర్చులు పోను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు మిగులుతాయి. ఫెయిల్  అయితే రూపాయి కూడా రాదు. ఇక ఫెయిల్  అయిన కాటన్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌పై క్లారిటీ లేకపోవడంతో గతంలో రైతులు ఇండ్లల్లో ఉంచుకునేవారు. వాటిని పట్టుకొని అప్పట్లో కేసులు కూడా పెట్టారు. 

ఫెయిల్ సీడ్‌‌‌‌‌‌‌‌పై నో క్లారిటీ..

గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో 40 వేల ఎకరాలకు పైగా సీడ్‌‌‌‌‌‌‌‌ పత్తిని సాగు చేస్తారు. ఇందులో 80 శాతానికి పైగా జర్మినేషన్‌‌‌‌‌‌‌‌ వచ్చిన విత్తనాలను కంపెనీలు తీసుకుంటాయి. 80 శాతం కన్నా తక్కువ జర్మినేషన్ వస్తే ఫెయిల్  సీడ్‌‌‌‌‌‌‌‌ కింద పరిగణించి రైతులకే అప్పజెప్తారు. వీటిని ఏం చేయాలో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఆఫీసర్లు చెప్పడం లేదు. సర్కారు నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేవు. 

ఈ విత్తనాలు నాటితే పెద్దగా నష్టం ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదిలాఉంటే కొందరు ఆర్గనైజర్లు, సీడ్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులు రైతుల నుంచి వీటిని కొని యాసిడ్‌‌‌‌‌‌‌‌ ట్రీట్మెంట్  చేసి కలర్ అద్ది వివిధ కంపెనీల పేరిట ప్యాక్‌‌‌‌‌‌‌‌ చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 400 గ్రామలు ప్యాకెట్ రూ.800 నుంచి  రూ. వెయ్యికి అమ్ముతున్నారు. అదే ఫెయిల్  సీడ్ ను ఇతర రైతులకు అమ్మినా, ఇంట్లో పెట్టుకున్నా కేసులు పెడుతున్నారు. ఫెయిల్  సీడ్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు తీసుకోకపోతే తామేం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కంపెనీలదే పెత్తనం..

రైతు కాటన్​ సీడ్  పండించిన తర్వాత శాంపిల్  తీసుకెళ్లి వారి కంపెనీలోనే ఫాస్, ఫెయిల్  నిర్ధారిస్తారు. ఇందులో కంపెనీలు చెప్పిందే వేదం. జర్మినేషన్ లో పాస్  అని వస్తే రైతుకు నాలుగు రూపాయలు వస్తాయి. లేదంటే ఒక్క రూపాయి కూడా రాదు. ఆర్గనైజర్లు రైతుకు అప్పుగా ఇచ్చిన డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తారు. దీనిపై ఎలాంటి అగ్రిమెంట్​ ఉండదు. ఈ వ్యవహారం అంతా తెల్ల కాగితం పైనే నడుస్తోంది. తనకు న్యాయం చేయాలని రైతు కోరేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఊరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్  అయిన విత్తనాలను రైతులకు ఇవ్వడం లేదు. ఫెయిల్  అయిన సీడ్  విత్తనాలు రైతులకే ఇవ్వాలి, లేదంటే రీ జర్మినేషన్  చేయించుకునే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కార్, అగ్రికల్చర్  ఆఫీసర్లు సీడ్​ కంపెనీలకు వత్తాసు పలికేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

రీ జర్మినేషన్ కు ఒప్పుకోవట్లే..

రైతులు పండించిన సీడ్  పంటపై గుత్తాధిపత్యం ఉండవద్దనే ఉద్దేశంతో రైతుల కమిటీలో జర్మినేషన్​ చేయించాలనే ప్రపోజల్​ను సీడ్  కంపెనీలు అంగీకరించడం లేదు. రైతు కమిటీ ఆధ్వర్యంలో రీ జర్మినేషన్  చేయాలని ఆఫీసర్లు చెబుతున్నా, దానికి కంపెనీలు ఒప్పుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కొన్ని కంపెనీలు మార్కెట్​లో డిమాండ్  ఉంటే సీడ్  మొత్తాన్ని పాస్ చేస్తారని, డిమాండ్  లేకపోతే రైతులకు డబ్బు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో ఫెయిల్  చేసే అవకాశాలు ఉంటాయని పలువురు సైంటిస్టులు చెబుతున్నారు. దీని నుంచి రైతులు బయటపడాలంటే రీ జర్మినేషన్ కు రైతులతో కమిటీలు వేయడమే ఏకైక మార్గమని చెబుతున్నారు. రూ. వేల కోట్లలో జరిగే ఈ దందాపై ఆఫీసర్లు దృష్టి సారించి రైతులకు మేలు జరిగేలా రీ జర్మినేషన్ పై నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్  చేస్తున్నారు.

 రైతులకు నష్టం జరిగితే ఊరుకోం..

 నకిలీ సీడ్‌‌‌‌‌‌‌‌ వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. రైతులకు నష్టం జరిగితే ఊరుకోం. ఫెయిల్  సీడ్ ను రైతులు కట్  చేసి పెట్టుకోవాలి. ఫెయిల్  సీడ్ ను రైతులకు ఇవ్వవద్దని కంపెనీలకు కమిషనర్  నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రీ జర్మినేషన్  కోసం ప్రయత్నం చేస్తున్నాం.

గోవింద్​నాయక్, డీఏవో, గద్వాల