సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

  •     ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు
  •     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు
  •     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు
  •     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు

గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యారేజెస్  బాధితులను ఆదుకునేందుకు గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సఖి సెంటర్  వారికి భరోసా ఇవ్వడం లేదు. పది నెలలుగా సెంటర్ కు వచ్చే బాధితులకు కిట్లు కూడా ఇవ్వడం లేదు.  కౌన్సిలింగ్  ఇవ్వడంతో పాటు లీగల్ గా సపోర్ట్​ చేసేందుకు సెంటర్​లో కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే సెంటర్​ను నడుపుతున్నారు.

ఇక్కడ పని చేసే సీఏ(సెంట్రల్ అడ్మిన్) సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లీవులు ఇవ్వడం లేదని, వీక్లీ ఆఫ్​లు అడిగితే తిడుతున్నారని అంటున్నారు. ఇక సిబ్బంది లేకున్నా ఉన్నట్లు చూపించి డబ్బులు దండుకోవడం, సెంటర్​ను నిర్వహించాల్సిన ఎన్జీవో అడ్రస్  లేకుండా పోవడంతో సఖి సెంటర్  నిర్వహణ అధ్వానంగా మారిందనే విమర్శలున్నాయి. 

సిబ్బంది లేకున్నా జీతాలు..

ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖి సెంటర్ ను నిర్వహిస్తున్నాయి. సీఏ, ముగ్గురు మల్టీపర్పస్  వర్కర్లు, ఒక పారా మెడికల్  ఆఫీసర్, ఇద్దరు కేస్  వర్కర్లు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఐటీ విభాగం చూసుకునేందుకు ఒకరిని నియమించారు. వీరితో పాటు బాధితులకు భరోసా ఇచ్చేందుకు మెంటల్ గా, ఫిజికల్ గా ధైర్యం చెప్పేందుకు ఒక కౌన్సిలర్, న్యాయపరంగా వారికి అండగా ఉండేందుకు లీగల్  అడ్వైజర్ ను నియమించారు.

అయితే కొంతకాలంగా గద్వాల సెంటర్ లో కౌన్సిలర్, లీగల్ అడ్వైజర్​ పని చేయడం లేదు. అయితే వారు పని చేస్తున్నట్లు జీతాలు మాత్రం తీసుకుంటున్నారనే 
ఆరోపణలున్నాయి.

కిట్లు ఇస్తలేరు..

బాధిత మహిళలు కట్టుబట్టలతో సెంటర్ కు వస్తుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా రెండు చీరలు, ఒక నైటీ, నూనె, దువ్వెన, అద్దంతో పాటు మహిళలకు ఉపయోగపడే కొన్ని వస్తువులతో కూడిన కిట్​ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని నెలలుగా ఇక్కడికి వచ్చే వారికి కిట్లు ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు.

ఆఫీసర్లు, సఖి సెంటర్  నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తమకు కిట్లు అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కౌన్సిలింగ్  ఇవ్వడం లేదని, న్యాయపరంగా ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బందిపై సీఏ వేధింపులు..

తమను సీఏ వేధిస్తున్నారని సిబ్బంది వాపోయారు. సెలవులు పెట్టినా ఇవ్వడం లేదని, వీక్లీ ఆఫ్  అడిగితే బూతులు తిడుతున్నారని, వేధింపులు భరించలేక ఇటీవల ఆఫీసర్లకు కంప్లైంట్  చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. సఖి సెంటర్ లోని అన్ని రూమ్ లలో సీసీ కెమెరాలు పెట్టారని, సీఏ రూమ్ లో మాత్రం సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నించారు.

పట్టించుకోని ఎన్జీవో..

గద్వాల సఖి సెంటర్  శ్రామిక వికాస కేంద్రం అనే ఎన్జీవో నిర్వహిస్తోంది. సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ, బాధితులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంటుంది. అయితే ఎన్జీవో ప్రతినిధులు నాలుగు నెలల నుంచి సెంటర్  వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదిలాఉంటే సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే..

సఖి సెంటర్ లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నాలుగు నెలల నుంచి ఎన్జీవో రావడం లేదు. సిబ్బందిని సీఏ వేధిస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. లిఖితపూర్వకంగా కంప్లైంట్  చేస్తే చర్యలు తీసుకుంటాం. సఖి సెంటర్ పనితీరుపై ఎంక్వైరీ చేసి కలెక్టర్ కి పంపిస్తాను. 

సుధారాణి, డీడబ్ల్యూవో