ముంపు భూముల్లో అక్రమ షెడ్లపై ఎంక్వైరీ చేయట్లే

  • గ్రామ స్థాయి లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్ల కుమ్మక్కు
  • భూముల విలువ కన్నా షెడ్లకే పరిహారం ఎక్కువ ఇచ్చేందుకు రెడీ
  • రైతులతో అగ్రిమెంట్​ చేసుకొని పరిహారం కొట్టేసేందుకు దళారుల స్కెచ్

గద్వాల, వెలుగు: ముంపు భూముల్లో పరిహారం కొట్టేసేందుకు కొన్నేండ్ల కింద రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణాన్ని చేపట్టి పెద్ద ఎత్తున పరిహారం కొట్టేసేందుకు స్కెచ్  వేశారు. వాటిపై ఎంక్వైరీ చేయాల్సిన ఆఫీసర్లు కింది స్థాయి లీడర్లతో కుమ్మక్కై పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే ఆరోపణలున్నాయి. లోయర్  జూరాల పరిధిలోని ముంపు భూముల్లో పెద్ద ఎత్తున షెడ్లు వేసి లక్షల్లో పరిహారాన్ని కొట్టేసేందుకు దళారులు ప్లాన్​ చేశారు. వీరికి గ్రామ స్థాయి లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్లు సపోర్ట్  చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

ఇదీ అసలు స్టోరీ..

కృష్ణా నదిపై జూరాల ప్రాజెక్టు దిగువన నిర్మించిన లోయర్  జూరాల ప్రాజెక్టు పై భాగంలో వరద ఎక్కువగా వస్తున్న టైమ్​లో లోయర్  జూరాల ప్రాజెక్టు పరిధిలోని చుట్టుపక్కల భూములు ముంపునకు గురవుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే సమయంలో పెద్ద ఎత్తున రైతుల పొలాలు మునిగిపోతున్నాయి. గతంలో లోయర్ జూరాల కట్టే టైమ్​లో 299 లెవెల్  వరకు ఉన్న భూములకు మాత్రమే పరిహారం చెల్లించారు. ఆ లెవెల్  కన్నా నీళ్లు ఎక్కువగా వస్తుండంతో ధరూర్  మండలంలోని పెద్ద చింతరేవుల, గద్వాల మండలంలోని రేకులపల్లి గ్రామాలకు చెందిన కొంతమంది రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. 

గతంలో మూడు సార్లు ఇలా ముంపునకు గురైన భూములకు  తెలంగాణ స్టేట్  జెన్ కో నుంచి రైతులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున పరిహారం కూడా ఇచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్  చేయడంతో 299 మీటర్ల నుంచి 301 మీటర్ల లెవెల్  పరిసర ప్రాంతాల్లోని 70 ఎకరాలను కూడా ముంపు ప్రాంతంగా గుర్తించి వాటికి పరిహారం ఇచ్చేందుకు జెన్​కో ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు.

అసలు కథ ఇక్కడే స్టార్ట్..

301 మీటర్ల లెవెల్  వరకు భూములు తీసుకునేందుకు పర్మిషన్  రావడంతో 226, 227, 228, 235,238 సర్వే నంబర్  నుంచి 270 సర్వే నంబర్  వరకు 70 ఎకరాల భూమికి పరిహారం ఇచ్చేందుకు ముందుకువచ్చారు. నదీ తీర ప్రాంతంలో ఉండే ఆ పొలాల్లో కేవలం వరి మాత్రమే పండుతుంది. కానీ పండ్ల తోటలు ఉన్నట్లు పెద్ద షెడ్లు ఉన్నట్లు సృష్టించి పరిహారం కొట్టేసేందుకు స్కెచ్  వేశారు. భూముల ధర కన్నా ప్రస్తుతం పండ్ల తోటలలోని చెట్లకు, సెట్టింగ్  చేసిన షెడ్లకు ఎక్కువ పరిహారం ఇచ్చేలా గతంలో నివేదికలు రూపొందించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం దానికి అనుగుణంగానే పరిహారం ఇస్తున్నారని, ఈ వ్యవహారంలో ఆఫీసర్లకు పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

దళారులే నడిపిస్తున్రు..

ముంపు భూముల వ్యవహారంలో దళారులు ఎంట్రీ ఇచ్చి రైతులతో మాట్లాడుకుని వారి పొలాలలో షెడ్లు వేస్తున్నారనే విమర్శలున్నాయి. పొలాల్లో వేసిన షెడ్లకు వచ్చిన పరిహారంలో కొంత డబ్బులు రైతులకు ఇచ్చి, మిగతా పరిహారాన్ని దళారులు తీసుకునేలా అగ్రిమెంట్  చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దళారులకు రెవెన్యూ ఆఫీసర్లు సపోర్ట్  చేస్తుండడంతో షెడ్లకు కూడా అవార్డ్  జరిగిపోతోంది. మొదటి విడతలో భూములకు, రెండో విడతలో షెడ్లకు, పండ్ల తోటలకు పరిహారం తీసుకునేలా ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా జెన్ కో నుంచి రూ.4.32 కోట్ల పరిహారం రిలీజ్  అయినట్లు చెబుతున్నారు. జెన్ కో నుంచి వచ్చిన పరిహారం డబ్బులు ఆర్డీవో అకౌంట్ లో జమ చేయగా, వాటిని రైతులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ALSO READ : ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నడు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

అసలైన రైతులకు మొండి చెయ్యి..

దళారులతో కుమ్మక్కైన ఆఫీసర్లు, నిజంగా నష్టపోతున్న రైతులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలున్నాయి. 301 మీటర్ల లెవెల్  వరకు వచ్చే మరో 20 నుంచి 30 ఎకరాల భూమిని తీసుకోవాల్సి ఉండగా.. రైతులు అప్పుడు నివేదిక తయారు చేసే ఆఫీసర్లకు మామూళ్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో ముంపు భూమిగా ప్రకటించకుండా మొండి చేయి చూపారనే విమర్శలున్నాయి. గ్రామ లీడర్లు ఎవరు పేరు చెబితే వారి పేర్లు రాసుకొని ముంపునకు గురి కాని పొలాలు కూడా మునుగుతున్నట్లు రిపోర్ట్​ ఇచ్చారని అంటున్నారు. ముంపునకు గురవుతున్న పొలాలు మునగడం లేదని రిపోర్ట్  ఇచ్చి తమకు అన్యాయం చేశారని వాపోతున్నారు.

గత నివేదిక ఆధారంగానే..

ముంపు భూముల్లో అక్రమంగా షెడ్లు వేయడానికి వీల్లేదు. గత నివేదిక ఆధారంగానే అవార్డ్​ చేస్తున్నాం. గతంలో జరిగిన అవకతవకలు నా దృష్టికి రాలేదు.

రాంచందర్, ఆర్డీవో, గద్వాల