వామ్మో....ఆక్టోపస్​ జీవికి 8 చేతులకు ఒక్కో మెదడు..

ఆక్టోపస్‌.. దీని గురించి చెప్పాలంటే అన్ని ఆసక్తికరంగానే ఉంటాయి. ఆక్టోపస్‌ ఇతర జీవులకంటే భిన్నంగా ఉంటుంది. దీని శరీరం గురించి తెలిస్తే అన్ని ప్రత్యేకమే. ఆక్టోపస్ అంటే ఎనిమిది కాళ్లు వుండే జీవి. దీనికి వెన్నెముక లేదు. వెన్నెముక లేని జీవులలో కెల్లా ఆక్టోపస్ చాలా తెలివైనది. ఆక్టోపస్ శరీరం లోపల గానీ బయట గాని అస్తిపంజరం లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రదేశముల్లో కూడా చాలా సులువుగా దూరిపోతుంది. . ఇది ఎక్కువగా సముద్రాల్లో జీవిస్తుంది. కొన్ని ఆక్టోపస్‌లు ఆరు నెలలు మాత్రమే ప్రాణాలతో ఉంటాయి. మగ ఆక్టోపస్‌లు మేటింగ్ తర్వాత కొద్ది నెలలకే చనిపోతాయి. ఆక్టోపస్ శరీరంలో ఉండే రెండు ఆప్టిక్ గ్రంథుల నుంచి వెలువడే ఎండోక్రైన్ స్రావాల వల్ల జన్యుపరంగా ముందుగానే చనిపోతుంటాయి.

ఆక్టోపస్‌ చుట్టూ కదులుతూ ఉండే 8 చేతులకు ఒక్కో మెదడు చొప్పున ఉంటుంది. కంట్రోల్‌ మూవ్‌మెంట్‌ మధ్యలో ఉండే ప్రధాన మెదడు నియంత్రిస్తుంది. చేతులన్ని స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ ఒకే లక్షంతో కదులుతాయని జీవశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆక్టోపస్‌కు ఏకంగా మూడు గుండెలు ఉంటాయి. వీటిలోని రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటికంటే పెద్దగా ఉండే ప్రధాన గుండె మిగతా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లో కాపర్‌ అధికంగా ఉండే  హిమోసైనిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ చల్లని సముద్రం నీళ్లలో కూడా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఈ ఆక్టోపస్‌లో క్రొమటోఫోర్స్‌ అనే ప్రత్యేక ద్రవ్యం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడు రంగు, ఆకారాన్ని కూడా మార్చుకోగలవు.

ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్‌లను వేటాడేటప్పుడు తమని తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్మి, గందరగోళానికి గురిచేస్తాయి. ఆక్టోపస్‌ చేతులపై బొడిపెల్లాంటి పిలకలుంటాయి...  ఐతే ఆడ ఆక్టోపస్‌లకు ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్‌లకు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆడ ఆక్టోపస్‌లు సముద్రం అడుగు భాగంలో గుడ్లు పెట్టి, 7 నెలలు ఆహారం తీసుకోకుండా పొదుగుతాయి. పిల్లలు పుట్టగానే మరణిస్తాయి. 

ALSO READ :- మెట్రో విస్తరణకు కొంతమంది అడ్డుపడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణాన్ని పొందకపోతే అది విసుగు చెందుతుందట. ఆపై తన చేతులను తానే కొరుకుకోవడం ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్టోపస్‌ల నాడీ వ్యవస్థ కాస్త పెద్దగానే ఉంటుంది. సగటున ఒక్కో ఆక్టోపస్‌లో 50 కోట్ల నాడీ కణాలు లేదా మెదడు కణాలు ఉంటాయట. అయితే, శునకాలు, మనుషులు, ఇతర జీవులకు భిన్నంగా ఆక్టోపస్‌లలో ఎక్కువ నాడీకణాలు ‘టెంటకల్స్’ అంటే చేతుల్లో ఉంటాయి. నిజానికి మెదడులో కంటే వాటి టెంటకల్స్‌లోనే రెట్టింపు సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. ఆక్టోపస్ టెంటక్స్‌లోని ప్రతి బొడిపె మీద దాదాపు 10 వేల  నాడీకణాలు ఉంటాయి. ఇవి స్పర్శ, రుచికి తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.