రూ.కోట్ల విలువైన భూమికి ఓఆర్సీ

  •     విచారణ చేయకుండా ఉత్తర్వులు ఇచ్చారంటున్న బాధితులు
  •     మాఫీ ఇనామ్​ పేరిట అన్యాయం చేస్తున్నారని ఆరోపణ
  •     పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే ఉత్తర్వులు ఇచ్చారని ఆవేదన

వనపర్తి, పెబ్బేరు, వెలుగు : విచారణ చేయకుండా రూ. కోట్లు విలువ చేసే భూమికి ముగ్గురు వ్యక్తులకు ఓఆర్సీ(ఆక్యుపెన్సీ రైట్​ సర్టిఫికెట్​) జారీ చేయడంతో భూ యజమానులు, ప్లాట్లు కొన్నవారు ఆందోళన చెందుతున్నారు. దీంతో వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులోని సర్వే నం. 458లో ప్లాట్లు కొన్న 250 మందికి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండాపోయింది. 3 సర్వే నంబర్ల(458లో 10.34 ఎకరాలు, 545లో 1.39 ఎకరాలు, 555లో 1.06 ఎకరాలు)లో కలిపి 13.39 ఎకరాల భూమి ఉంది. 458లో కొందరు కలిసి వేసిన రియల్​ ఎస్టేట్​ వెంచర్ లో 250 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు.

హైదరాబాద్​కు చెందిన ముగ్గురు వ్యక్తులు 1954–-55 సంవత్సరంలో కాస్రాలో తమ పేర్లు ఉన్నాయని.. అది మాఫీ ఇనాం అంటూ ఓఆర్సీ కోసం వనపర్తి ఆర్డీవో దగ్గర అప్పీల్ చేశారు. దీనిపై వనపర్తి ఆర్డీవో విచారణ చేయకుండా, మోకా పైకి వెళ్లకుండా ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్  కాపీని ఈ నెల 3న జారీ చేశారని వెంచర్లు వేసిన వారితో పాటు ప్లాట్ల యజమమానులు ఆరోపిస్తున్నారు. ప్లాట్లు, భూ యజమానుల వద్ద పూర్తి సమాచారం తీసుకోకుండా ఏకపక్షంగా వారికి ఓఆర్సీ(No. B/490/2022) జారీ చేయాలని పెబ్బేరు తహసీల్దార్​కు ఫార్వర్డ్  చేశారని బాధితులు వాపోతున్నారు.

ఈ నెల14న రాత్రి భూములు, ప్లాట్ల యజమానులు పెబ్బేరు తహసీల్దార్​ ఆఫీస్​ వద్ద ఆందోళన చేపట్టారు. అడిషనల్  కలెక్టర్​కు అప్పీల్​ చేసుకునేందుకు వీలు లేకుండా తహసీల్దార్​కు పంపించడంపై 80 ఏండ్ల నుంచి  భూమిపై హక్కు ఉన్న యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వనపర్తి జిల్లాలో చర్చానీయాంశమైంది.   

అంతా వివాదాస్పదమే..

సర్వే నంబర్​ 458లో పీజేపీ(జారాల)కెనాల్ కు 0.26 గుంటల భూమి 2002లో అవార్డు కాపీ అయిందని, 2006 లో హైవే 44కు 1.24 ఎకరాలు అవార్డు అయింది. ఆ భూమి యజమానులకు పైకం కూడా అప్పట్లోనే ముట్టింది. 2008లో 4 ఎకరాల్లో గ్రామ పంచాయతీ ప్లాట్లు వేసుకోవడానికి పర్మిషన్  ఇచ్చిందని బాధితులు తెలిపారు. 2014లో 0.34 గుంటలకు నాలా పర్మిషన్, ప్లాట్లకు కూడా అనుమతి ఇచ్చారని చెబుతున్నారు.  ప్రభుత్వం నుంచి పరిహారం ఇచ్చి సేకరించిన భూములకు సైతం వనపర్తి ఆర్డీవో ఓఆర్సీ జారీ చేయడం ఏమిటని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓఆర్సీని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. తాము కొన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేశారని, ఇప్పుడు ఓఆర్సీ ఇస్తున్నారని తెలిపారు. ఓఆర్సీ మీద అభ్యంతరాలుంటే అప్పీల్​ చేసుకోవాలని, ఆధారాలు అందజేస్తే స్టే ఇచ్చే అవకాశం ఉంటుందని అడిషనల్​ కలెక్టర్​  చెప్పినట్లు బాధితులు తెలిపారు. నేషనల్​ హైవేను ఆనుకుని ఉండడంతో ఎకరాకు రూ.5 కోట్ల దాకా ధర పలుకుతోంది. దీంతో కబ్జాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు.

ఆధారాలు చూపలేదు..

ఇనామ్​ భూములను వెంచర్లు వేసి అమ్మిన వారు అది తమదేనంటూ ఎలాంటి రికార్డులు, ఆధారాలు చూపించలేదు. హియరింగ్స్​కు వచ్చినప్పుడు తమ వద్ద ఎలాంటి పేపర్లు లేవని, తాత ముత్తాతల నుంచి అనుభవిస్తూ వస్తున్నందున వెంచర్లు వేశామని రాసి సంతకాలు చేశారు. ధరణిలోనూ వారి పేర్లు లేవు. బాధితుల ఆందోళన దృష్ట్యా ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్​ ఆపమన్నాం.

- పద్మావతి, ఆర్డీవో, వనపర్తి