ఓబీసీల పుట్టినరోజు

  నేడు మండల్​ కమిషన్ సిఫారసు అమలుకు ఆమోదం తెలిపినరోజు దేశ చరిత్రలో ఆగస్టు 7, 1990 ఒక అత్యంత కీలక పరిణామం. ఆరోజు కేంద్ర ప్రభుత్వం మండల్​ కమిషన్ సిఫారసును అమలుకు ఆమోదం తెలిపినరోజు. ప్రొఫెసర్  కేసీ యాదవ్ మాట్లాడుతూ..‘ఇది ఒక కొత్త శకానికి ఊపిరిపోసే పరిణామం. ఆగస్టు 15, 1947, అదేవిధంగా జనవరి 26, 1950 వంటి రెండు గొప్ప సంఘటనల తర్వాత,  దేశ చరిత్రలో చోటుచేసుకున్న మూడో అతి గొప్ప సంఘటన’ అని వర్ణించారు. డిసెంబర్ 13, 1946 నాడు రాజ్యాంగ సభలో  జవహర్ లాల్ నెహ్రూ 'ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్'లో  ఓబీసీలకు సరి అయిన రక్షణలు కల్పిస్తామని ప్రకటించారు.

 అవే రాజ్యాంగంలో ప్రియాంబుల్​గా పొందుపరచడమైనది.  రాజ్యాంగసభ ఆర్టికల్ 340 ద్వారా వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసి ఓబీసీలను గుర్తిస్తూ వారి ఉన్నతికి చర్యలు తీసుకోవాలని సూచించింది. 1953-–55, కాకా కాలేల్కర్/ మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 2399 కులాలను వెనుకబడిన వర్గాలుగా గుర్తించింది.  కానీ, కమిషన్.. సిఫార్సులకు ఎలాంటి హేతుబద్ధ ప్రామాణికాలు పాటించలేదని, అందువలన కేంద్రస్థాయిలో అమలు కుదరదని భావిస్తూ ఆ విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని అభిప్రాయపడింది.

 1977లో జనతాపార్టీ తన మేనిఫెస్టోలో కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ రెండో వెనుకబడిన తరగతుల కమిషన్ 1979లో ఏర్పాటు చేసింది.1979–-80 లలో  బీపీ మండల్ నాయకత్వంలో అధ్యయనం చేసి కమిషన్ తమ రిపోర్ట్ ను  ప్రభుత్వానికి  సమర్పించింది. ఆగస్టు 1, 1983 నాడు అప్పటి కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ ఈ అంశం పట్ల మాకు సానుభూతి ఉందని, మేం దీనిని అమలుచేయదలచుకున్నామని అన్నారు. జ్ఞాని జైల్ సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. 'కమిషన్ చేసిన సూచనలు చాలా ముఖ్యమైనవి.  సంక్లిష్టమైన అంశాలను లేవనెత్తాయి. ఇవి లోతైన పరిణామాలకు దారితీస్తాయి’ అని అన్నారు.

ఓబీసీలుగా 3,743 కులాలు

ఆగస్టు 7, 1990 రోజున అప్పటి ప్రధాని వీపీ సింగ్ పార్లమెంటులో  ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. మండల్ కమిషన్ సూచించిన 3,743 కులాలను ఓబీసీలుగా గుర్తించడమైనది.  ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. మండల్ కమిషన్​ నివేదికను అమలుచేయడం అనేది ఒక 'నిశ్శబ్ద విప్లవం' అని వీపీ సింగ్ అన్నారు. అయితే ప్రభుత్వంలో తాను భాగస్వామ్య పక్షం అన్న విషయం కూడా మరిచిపోయి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. సమర్థత, అభివృద్ధి, ఐక్యత అనేవి జాతికి చాలా అవసరం.

 రిజర్వేషన్లు సమాజాన్ని నిట్ట నిలువుగా చీలుస్తాయి.  జాతీయ ఐక్యతకు అవి ప్రమాదకరం అని బీజేపీ వాదించింది.  అదే క్రమంలో అయోధ్యలో రామ జన్మభూమి అంటూ దేశవ్యాప్త రథయాత్ర మొదలుపెట్టారు. చివరకు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ తమ మద్దతును నవంబర్ 7, 1990 నాడు ఉపసంహరించుకోవడంతో  వీపీ సింగ్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది.  

పార్లమెంటు చర్చలో పాల్గొంటూ రాజీవ్ గాంధీ తన వ్యతిరేకతను తెలిపారు. చివరకు రిజర్వేషన్లను తిరస్కరిస్తున్నట్లు ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.  నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు అందరూ రిజర్వేషన్లకు  ఆర్థిక వెనుకబాటుతనమే ప్రాతిపదికగా ఉండాలని వాదించడం జరిగింది. కానీ,  పీ శివశంకర్, చంద్రజిత్ యాదవ్ లాంటి నాయకులు  ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో రాజీవ్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చేశారు.

రిజర్వేషన్లకు అనుకూలంగా రాజకీయ ఉద్యమం

మండల్​ కమిషన్ ముందు హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు మాట్లాడుతూ.. 'కులం అనేది ఫ్యూడల్ వ్యవస్థ వారసత్వం అని, సామాజిక చిత్రపటాన్ని కులం కోణంలో చూడటం అనేది పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏమాత్రం పనికిరాదు' అని అన్నారు. అయితే సీపీఎం మాత్రం తాము వెనుకబడిన వర్గాల (ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లకు ఎప్పుడూ మద్దతు పలికామని చెబుతున్నది. 

ఓబీసీల రిజర్వేషన్ల విషయంలో ఆర్థిక ప్రామాణికాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వాదించింది.  సీపీఐకి చెందిన ఇంద్రజిత్ గుప్త మాట్లాడుతూ, 'ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి వ్యక్తికి,  ప్రతి సామాజిక వర్గానికి పరిపాలనలో భాగస్వామ్యం అయ్యే చట్టబద్ధహక్కు, ఆకాంక్ష ఉంటుంది. ఇయ్యాల  మనం మాట్లాడుతున్న ఈ 52 శాతం ప్రజల వాటా దేశంలోని ఉన్నతస్థాయి ఉద్యోగాలలో కేవలం 4.5% మాత్రమే ఉందంటే అది ఘోరమైన అన్యాయం కాకుండా మరి ఏమవుతుంది?'  అని ప్రశ్నించారు.

  సోషలిస్టులు/ లోహియా సమాజ్​వాదులు నిరంతరం రిజర్వేషన్లకు అనుకూలంగా సిద్ధాంతీకరిస్తూ రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు.  1950 లో 'పిచ్దేపావే సౌమే సాట్' (వెనుకబడిన కులాలకు వందలో అరవై) అనే నినాదం బీసీలను ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున ఆకర్షించింది.  జనతాదళ్,  బీజేపీ, -కాంగ్రెస్ వాదనలను  తిప్పికొడుతూ సామాజిక న్యాయం ఏంటో నిర్వచించారు.

మండల్ కమిషన్ సిఫార్సులను..సమర్థించిన సుప్రీంకోర్టు

రిజర్వేషన్లను కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తింపజేసి విద్యాసంస్థలలో అడ్మిషన్లు, ఉద్యోగాలలో ప్రమోషన్ల విషయంలో వాటిని వర్తింప చేయకపోవడం పట్ల ప్రధాని వీపీ సింగ్ పై ములాయం సింగ్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 1987లో  మండల్​ కమిషన్ సిఫారసుల అమలుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రాంతి రథయాత్రలు ములాయం సింగ్ యాదవ్ నిర్వహించారు.

 బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడైన కాన్షీరాం స్పందిస్తూ ‘రిజర్వేషన్లను అమలైనా చేయండి లేదా అధికార కుర్చీలు ఖాళీ చేయండి’ అనే నినాదంతో భారీ స్థాయిలో ప్రజలను సమీకరించారు. అదేవిధంగా 'ఆరక్షణ్ సే లెంగే డీఎం,  జీఎం,  ఓట్సేలేంగే  సీఎం పీఎం' అని కాన్షీరాం ఇచ్చిన నినాదం కూడా అప్పట్లో ప్రజల్లోకి చొచ్చుకుపోయింది.  శరద్​యాదవ్,  రామ్ విలాస్ పాశ్వాన్​లు  మండల్​ యాత్రను నిర్వహించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగిస్తూ  దేశాన్ని చైతన్యపరిచారు. అద్వానీని  లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్లో అడ్డుకోవడంతో రామ జన్మభూమి రథయాత్ర ముగిసింది. 

1992 నవంబర్ 16న సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల ధర్మాసనం మండల్ కమిషన్ సిఫార్సుల అమలు సరైనదేనని తీర్పునిచ్చింది.  దాంతో 1993లో ఓబీసీల రిజర్వేషన్లు  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అమలుచేయడం మొదలయ్యింది.  కానీ,  కేంద్ర విద్యా సంస్థలలో రిజర్వేషన్ల అమలు 2008 వరకు జరగలేదు. ఇంకా 38 సిఫారసులు అమలుకు నోచుకోక మిగిలిపోయాయి.

(రీసెర్చ్​లో భాగంగా నేను రాసిన‘మండల్ ఉద్యమం’ పుస్తకం ఆధారంగా)

తరతరాలుగా వివక్ష, అవమానాలు

తరతరాలుగా వివక్ష, అవమానాలకు గురవుతున్న వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాన గౌరవం, హోదా అనే అంశానికి ఒక ప్రజాస్వామిక విశిష్టత ఉంది.  ప్రజాస్వామిక మూల సిద్ధాంతాలైన ప్రజల భాగస్వామ్యం, రాజకీయ సమానత అనేవి సామాజిక న్యాయం అనే భావనలో అంతర్గతంగా నిర్మితమైన అంశాలు. అణచివేయబడిన వర్గాల చేతికి అధికార పగ్గాలు అందించడం అనేది సామాజిక మార్పులకు ఇంజిన్ లాంటిది.  సమానత్వ సిద్ధాంత ప్రాతిపదిక మీద సమాజాన్ని నిర్మించడానికి అదొక అర్థవంతమైన సాధనం.  

సామాజిక న్యాయం సాధించాలంటే రాజకీయ సంస్థలు/ వ్యవస్థల ప్రజాస్వామికీకరణ కూడా చాలా అవసరం. నాటి  ప్రధాని వీపీ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు సమస్య ఆర్థిక అంశాలకు సంబంధించినది కాదు.  ఇది అధికార వ్యవస్థకు సంబంధించినది.  సామాజిక నిర్మాణంలో అంతర్గతంగా భాగమైన అధికార వ్యవస్థకు సంబంధించిన సమస్య ఇది. ఈ మొత్తం అధికార వ్యవస్థలో బ్యూరోక్రసీ అనేది చాలా కీలకమైన విభాగంగా ఉంది.  మేం చాలా స్పష్టమైన అవగాహనతోనే  ఈ  దేశ పరిపాలన యంత్రాంగంలో  ఓబీసీలకు భాగస్వామ్యం ఇవ్వదల్చాం.  ఆ క్రమంలో అధికార వ్యవస్థలో భాగస్వాములను చేయదలిచాం’ అని అన్నారు.

- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన,అధ్యక్షుడు,సమాజ్ వాది పార్టీ తెలంగాణ