ప్లాట్లు అమ్మేశారు.. సౌలతులు మరిచారు

  • నుస్తులాపూర్ అంగారిక టౌన్ షిప్ లో వసతులు కల్పించని గత పాలకవర్గం
  • రోడ్లు, డ్రైనేజీ, పార్క్, విద్యుత్ సౌకర్యం కల్పించడంలో విఫలం
  •  ప్లాట్లలో ఇండ్ల నిర్మాణానికి ముందుకు రాని కొనుగోలుదారులు

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ సిటీని ఆనుకొని తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం నుస్తులాపూర్ అంగారిక టౌన్ షిప్ లో వేలం ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసిన ఓనర్లకు ఇల్లు కట్టుకుందామంటే  ఇబ్బందులు తప్పడం లేదు. ప్లాట్లు అమ్మి ఏడాది దాటినా రోడ్లు, డ్రైనేజీ, పార్క్, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

ప్లాట్లు అమ్మేటప్పుడు అన్ని సౌలతులు కల్పిస్తామని అప్పటి ఆఫీసర్లు, సుడా పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారని, వారిని నమ్మి ప్లాట్లు కొని అవస్థలు పడుతున్నామని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ వెంచర్ అనే నమ్మకంతో లక్షలాది రూపాయలు పెట్టి ప్లాట్లు కొంటే.. వసతులు కల్పించడం మరిచిందని మండిపడుతున్నారు. సుడా కొత్త పాలకవర్గమైనా సౌలతులు కల్పించాలని 
కోరుతున్నారు.

ప్లాట్ల అమ్మకంతో రూ.180 కోట్ల ఆదాయం

గత సర్కార్ హయాంలో సర్కార్ భూములను వెంచర్లుగా చేసి.. ప్లాట్లుగా వేలం వేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గతంలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన స్థలాన్ని 816 ప్లాట్లుగా మార్చి విడతలవారీగా అమ్మకానికి పెట్టింది. ఇందులో 784 ప్లాట్లు అమ్ముడుపోగా.. 32 మాత్రమే మిగిలాయి. వేలంలో రెసిడెన్షియల్ ప్లాట్ గజానికి కనీస ధర రూ.6 వేలు, కమర్షియల్ ప్లాట్ గజం ధర రూ.8 వేలుగా నిర్ణయించగా.. ఒక్కో ప్లాటు డబుల్, ట్రిపుల్ రేట్లలో అమ్ముడయ్యాయి. ఈ ప్లాట్ల అమ్మకాల ద్వారా సుమారు రూ.180 కోట్ల మేర ఆదాయం సమకూరింది.      

సౌలతులు కల్పించలే..

ప్రైవేట్ వ్యక్తులు అధికారిక లేఔట్ వేయాలంటే.. అన్ని వసతులు కల్పిస్తేగానీ అప్రూవల్ ఇవ్వని ఆఫీసర్లు.. సుడా లేఅవుట్‌‌‌‌‌‌‌‌ విషయంలో మాత్రం నిబంధనలు మరిచారు.

తొలిసారి 2022 జూన్ లో మొదటి విడత వేలం నిర్వహించినప్పుడే త్వరలోనే రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు నిర్మిస్తామని, కరెంట్, తాగునీటి కనెక్షన్ ఇస్తామని, సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని నమ్మించి కొన్ని ప్లాట్లు అమ్మేశారు. అదే ఏడాది అక్టోబర్ లో రెండో విడత వేలం నిర్వహించినప్పుడు సౌకర్యాలు కల్పించకుండా ఎలా ప్లాట్లు అమ్ముతారని పలువురు కొనుగోలుదారులు ప్రశ్నించారు. ఇవేమీ పట్టంచుకోకుండానే మూడు విడతల్లో వేలం నిర్వహించి ప్లాట్లు అమ్మేశారు. కేవలం మట్టి లెవలింగ్, మట్టి రోడ్లు, వెంచర్ లో కొంత మేర విద్యుద్దీకరణ పనులు 
మాత్రమే చేపట్టారు.

సౌకర్యాలు కల్పించాలి.. 

చాలామంది పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు సర్కార్ వెంచర్ అని నమ్మి అంగారక టౌన్ షిప్ లో ప్లాట్లు కొనుక్కున్నారు. పైసాపైసా కూడబెట్టి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కట్టారు. వేలం వేసేటప్పుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అప్పటి ఆఫీసర్లు, సుడా చైర్మన్ ఇప్పుడు లేరు. ప్రస్తుత కలెక్టర్, సుడా చైర్మన్ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి. _ఎం.రఘుశంకర్ రెడ్డి, అధ్యక్షుడు, అంగారిక ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్   

రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపాం..

అంగారిక టౌన్ షిప్ లో సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ప్లాట్లు అమ్మినప్పుడే సౌకర్యాలు కల్పించాల్సి ఉండే. నేను చైర్మన్​గా బాధ్యతలు చేపట్టాక వెంటనే రూ.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించాను. కలెక్టర్ తో చర్చించి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తా. ప్లాట్ల ఓనర్లు ఆందోళనకు గురికావొద్దు. 
_కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్