ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం

  • పల్లెల్లో బెటర్.. పట్టణ ఓటర్లను కదిలిస్తేనే పోలింగ్​ 
  • పర్సెంటేజీలో పెరుగుదల  

నిజామాబాద్​, వెలుగు: ఇందూర్​ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఏటా ఓటర్లు పెరుగుతున్నా ఓటింగ్​ శాతం మెరుగు పడటం లేదు.   పైగా ప్రతిసారి అర్బన్​లో మరీ తక్కువ ఓటింగ్​ నమోదు కావడం ఆఫీసర్లను కలవరపెడుతోంది.  గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి లోకల్​ బాడీ ఎన్నికల్లో  ఎక్కువగా ఉంటున్న ఓటింగ్​ పర్సెంటేజీ అసెంబ్లీ ఎలక్షన్​వచ్చేసరిగా డల్​గా  మారి పార్లమెంట్​ ఎన్నికల్లో మరింత నిరాశపరుస్తోంది. ఓటు నమోదు విషయంలో చూపుతున్న శ్రద్ధను ఓటు వేయడంలో పట్టణ ఓటర్లు​ చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది.  గెలుపోటములను నిర్ణయించాల్సిన పట్టణ ఓట్లు పూర్తి స్థాయిలో పోల్ కావడం లేదు. దీంతో ఈ సారి పోలింగ్ పర్సేంటేజీ పెంచడం పై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. 

 విలేజ్​ ఎన్నికల్లో 84%, లోక్​సభలో 68% 

నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానానికి 2019 ఎలక్షన్​లో 68.58 శాతం పోలింగ్​ మాత్రమే నమోదైంది.  మొత్తం 14,95,957 ఓటర్లలో 10,25,871 మంది మాత్రమే ఓటు వేశారు. 4,70,086 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.  2019 పార్లమెంట్​ ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్​లో యావరేజ్​గా 76.27 శాతం పోలింగ్​ నమోదైంది. అదే జనవరి 2019 గ్రామ పంచాయతీ ఎలక్షన్​లో 84 శాతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అంతే ఓటింగ్​ రికార్డయింది. 2023 నవంబర్​ అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్​లలో యావరేజ్​ పోలింగ్​ పర్సెంటేజీ 74.71 శాతంగా ఉంది. ఇట్ల ఒక్కో ఎలక్షన్​లో ఒక్కో విధమైన పోలింగ్​ నమోదు అవుతోంది.

 చదువుకున్న సెక్షనే దూరం 

పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో బోధన్​, నిజామాబాద్​ అర్బన్​, రూరల్​, ఆర్మూర్​, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాలున్నాయి.   వీటిలో  3,04,317 ఓట్లు అర్బన్​ సెగ్మెంట్​లో ఉన్నాయి. ఇక్కడ పోలింగ్​ శాతం ఎప్పుడూ చాలా డల్​గా ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎలక్షన్​లో 62.64 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. 2018లో 62 శాతం, 2014లో 51.86 శాతం, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39.68 శాతమే రికార్డయింది.  గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ముందుకొస్తున్న మున్సిపాలిటీల్లో మాత్రం తక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

బోధన్​, ఆర్మూర్​, జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీ  పౌరులు ఓటు వేయడంలో నిరాసక్తత చూపుతున్నారు.  వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న చదువుకున్న వారే  ఓటింగ్​కు దూరంగా ఉంటున్నారు.  అదే పల్లెల్లో 100 ఏండ్లు ఉన్న వృద్ధులు కూడా ఓట్లు వేస్తున్నారు. వాతావరణం ఎలా ఉన్నా కష్టంగా పోలింగ్​ సెంటర్​ దాకా వచ్చి ఓటేస్తున్నారు.  బస్తీ ఓటర్లు ఓటు వేయడానికి బద్ధ కిస్తుంటే అనే నిర్లక్ష్య దృష్టితో ఉంటే.. ఓటు వేయడం తమ బాధ్యతగా అనుకుని మరీ పల్లెల్లో పోలింగ్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు.  

అవగాహన కల్పించాలి 

ఆఫీసర్లదే..  ఓట్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది.  మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్​లో ఉన్న 16,72,118 సంఖ్య పార్లమెంట్​ ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు 17,04,867కు పెరిగింది. పోలింగ్​ పర్సెంటేజీని పెంచే బాధ్యత  ఆఫీసర్లపై ఉంది. ముఖ్యంగా అర్బన్​ ఏరియాల్లో ఎవేర్​నెస్​ ప్రొగ్రాం ఎక్కువగా నిర్వహించాలి. వాలంటరీ ఆర్గనైజేషన్స్​, యువజన సంఘాలను ఇన్వాల్వ్​ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.