పెరగని రిజిస్ట్రేషన్లు.. ఎన్నికలు, పెళ్లిళ్లతో ఏప్రిల్​ నెలలో ఆదాయం అంతంతే

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం అనుకున్నంత స్థాయిలో పెరగలేదు. గత ఏడాదితో పోల్చుకుంటే రూ.5.56 కోట్లు మాత్రమే పెరిగింది. నిరుడు పంటలు సక్రమంగా పండక పోవడంతో భూములు, ఇతర స్థిరాస్తి క్రయవిక్రయాలు మందగించాయి.   ఉమ్మడి జిల్లాలోని 12 సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో గత ఏడాది ఏప్రిల్​లో 1,02,688 డాక్యుమెంట్​ రిజిస్ట్రేషన్లు జరగగా, ఈ ఏప్రిల్​లో 98,900 రిజిస్ట్రేషన్లు మాత్రమే​అయ్యాయి.

గత ఏడాది సెప్టెంబర్​ నుంచి అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో భూముల క్రయవిక్రయాలపై ప్రభావం చూపింది. యాసంగిలో సాగునీటి కొరతతో రైతులు అల్లాడిపోయారు. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్లమెంట్​ ఎన్నికల కోడ్​ అమలులోకి వచ్చింది. దీంతో భూములు, ఇతర స్థిరాస్తులను కొనుగోలు కోసం డబ్బు తీసుకెళ్లేందుకు కోడ్  అడ్డంకిగా మారిందని అంటున్నారు. 

జడ్చర్లలో కొంత మెరుగు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్లలో ఈ ఏప్రిల్​లో 500 రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం మెరుగ్గానే ఉంది. ఇక్కడ 16,598 రిజిస్ట్రేషన్లకు గాను, రూ.61.98 కోట్ల ఆదాయం సమకూరింది. నిరుడు 17,055కు రూ.54.26 కోట్లు వచ్చాయి. అలంపూరులో అతి తక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అక్కడ1,999 రిజిస్ట్రేషన్లు జరగగా, ఆదాయం రూ.2.70 కోట్లు మాత్రమే వచ్చాయి. నాలుగేండ్ల వరకు డీటీసీపీ అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్​ చేస్తూ వచ్చారు. ఆ తరువాత డీటీసీపీ లేని వాటి రిజిస్ట్రేషన్లను నిలిపేశారు.

అనుమతుల్లేని వెంచర్లలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్లు చేసుకోని వారు, ఆ తరువాత రిజిస్ట్రేషన్​ చేసుకుందామన్న కుదరలేదు. ఎల్ఆర్ఎస్​ చేసుకోడానికి అనుమతివ్వడంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దానిపై స్పష్టత రాకపోవడంతో అక్కడితోనే ఆగిపోయింది. రెండేండ్ల కింద ప్రభుత్వం భూముల మార్కెట్​ విలువను పెంచడంతో  రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం సమకూర్చడంలో జడ్చర్ల, మహబూబ్​నగర్​ తరువాత వనపర్తి నిలుస్తోంది. ఇక్కడ రియల్​వ్యాపారం ఊపందుకుంది. అయితే ఏడాదిగా క్రయవిక్రయాలు కొంత మందగించాయి.