స్కానింగ్ పేరుతో మహిళల న్యూడ్​ వీడియోలు

  •  బట్టలు తీయించి యవతులు, మహిళల ఫొటోలు, వీడియోలు
  • నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్​సెంటర్​లో ఆపరేటర్​ వికృత చేష్టలు
  • వాట్సాప్​లో వారికి పంపి బ్లాక్​మెయిల్,  లైంగిక వేధింపులు
  • నిందితుడు ప్రశాంత్​ అరెస్ట్.. సెల్​ఫోన్​ స్వాధీనం 

నిజామాబాద్, వెలుగు: స్కానింగ్​సెంటర్​కు వచ్చిన యువతులు, మహిళల పట్ల ఓ ఆపరేటర్​ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. స్కానింగ్ పేరుతో వారి బట్టలు విప్పించి సీక్రెట్​గా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్​కు పంపి బ్లాక్​ చేయడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్​లో కలకలం రేపింది. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు విచారణకు ఆదేశించారు. 

వివరాల్లోకెళితే, నగరంలోని అయ్యప్ప స్కానింగ్​ సెంటర్​లో ఆపరేటర్​గా పని చేస్తున్న ప్రశాంత్..​ స్కానింగ్​ కోసం వచ్చే యువతులు, మహిళలను ఒంటిపై బట్టలు తీసేస్తేనే స్కానింగ్​ పక్కాగా వస్తుందని నమ్మించి ఒప్పించేవాడు. అనంతరం పరదా చాటునుంచి సీక్రెట్​గా సెల్​ఫోన్​ను రికార్డింగ్​ మోడ్​లో పెట్టి వీడియో షూట్ చేసేవాడు. దొంగచాటుగా ఫొటోలు తీసేవాడు. రిసెప్షన్​ కౌంటర్​లో వారి ఫోన్​ నంబర్లు తీసుకొని, న్యూడ్​ ఫొటోలు, వీడియోలు పంపేవాడు. సోషల్​ మీడియాలో పోస్టు చేస్తానని డబ్బులు డిమాండ్​ చేయడంతో పాటు లైంగికంగా వేధించేవాడు. 

లింగ నిర్ధారణ టెస్ట్​లు చేస్తానని యువతులను ట్రాప్​ చేసేవాడు.  పరువు పోతుందనే భయంతో బాధితులు సైలెంట్​గా ఉన్నారు. అయితే, ఈ నెల 5న ఒక మహిళ స్కానింగ్​ సెంటర్​కు వెళ్లగా, ప్రశాంత్​​ ఆమె ఫోన్​కు న్యూడ్​ ఫొటోలు పంపించాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ప్రశాంత్​ను చితకబాదారు. కాగా, స్కానింగ్​ సెంటర్​మేనేజ్​మెంట్​ వారిని బుజ్జగించి పంపించింది. ఈ విషయం ప్రజాసంఘాల ప్రతినిధులకు తెలియంతో వారు కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకొచ్చారు.

 సీపీ కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలతతో విచారణ చేయించి, నిజాలు తెలుసుకున్నారు. దాదాపు వంద మంది బాధిత మహిళలు ఆపరేటర్​ ప్రశాంత్​ వేధింపులు ఎదుర్కొన్నట్టు గుర్తించారు. 33 మందితో ప్రశాంత్​ చేసిన చాటింగ్​ను సేకరించారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతుకు ఈ విషయం తెలియడంతో యాక్షన్​ తీసుకోవాలని డీఎంహెచ్​వో తుకారాం రాథోడ్​ను ఆదేశించారు. 

దీంతో ఆయన సోమవారం రాత్రి 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని స్కానింగ్​ సెంటర్​ మేనేజ్​మెంట్​కు నోటీసు పంపారు. పరారీలో ఉన్న ప్రశాంత్​ను పోలీసులు గాలించి పట్టుకొని, అరెస్ట్​ చేశారు. డేటా డిలీట్​ చేసిన ఫోన్​ను ప్రశాంత్​ పోలీసులకు అప్పగించాడు. నిపుణుల సాయంతో ఫోన్​ డేటా రికవరీ చేస్తున్న పోలీసులు, స్కానింగ్​ సెంటర్​లోని హార్డ్​ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు.

స్కానింగ్​ సెంటర్​పై విచారణకు కమిటీ: డీఎంహెచ్​వో  

అయ్యప్ప స్కానింగ్ ​సెంటర్​ మేనేజ్​మెంట్‌‌కు నోటీసులు జారీ చేశామని డీఎంహెచ్​వో డాక్టర్​ తుకారాం రాథోడ్​ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.  డాక్టర్లు​ అనుపమ, శ్రావణి, అంజన, లావణ్యతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తుందని చెప్పారు. ఏడు రోజుల్లో కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. స్కానింగ్​ సెంటర్​ సంజాయిషీ, కమిటీ రిపోర్టు రెండింటినీ బేస్​ చేసుకొని యాక్షన్​ తీసుకుంటామని చెప్పారు.