ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటి పోయింది. బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది. ఇళ్లలో ఏసీలు, కూలర్లు జోరుగా తిరుగుతున్నాయ్. దాహం వేస్తే ఫ్రిజ్లో నీళ్లు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. బయటకు పోవాలంటే గొడుగులు పట్టుకెళ్తున్నారు. పసి పిల్లలనైతే అతి భద్రంగా చూసుకుంటున్నారు. ఇప్పుడు సరే... మరి ఒకప్పుడు.. అంటే నాలుగు తరాల కిందట ఎండను తట్టుకోడానికి ఏం చేసేవాళ్లు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్లు?
అరిటాకుల్లో పిల్లలు
ఎండాకాలంలో పిల్లలు వేడిని తట్టుకోలేదు. వాళ్ల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. శరీరంపై దద్దుర్లు లాంటివి రావచ్చు. అందుకని పిల్లలను అరిటాకుల్లో పడుకోబెట్టేవాళ్లు. అరిటాకుకు వేడిని గ్రహించే శక్తి ఎక్కువ. ఉదయం పడుకోబెట్టిన అరిటాకు వేడిని గ్రహించడం వల్ల సాయంత్రానికల్లా మాడి పోయేది. అందువల్ల రాత్రికి మరో అరిటాకులోకి పసిపాపను మార్చేవాళ్లు. అరిటాకు వల్ల పిల్లలకు చలువ చేస్తుంది. అంతేకాదు అరిటాకు మెత్తగా ఉండటం వల్ల పిల్లల శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. కొందరు ఎండాకాలంలో తామరాకుల్లో కూడా పసిపిల్లలను పడుకోబెట్టేవాళ్లు.
తాటిమట్టలతో చెప్పులు
పొలాల్లో తిరగాలంటే ఎండాకాలంలో కాళ్లు వేడిని తట్టుకోలేవు. అందుకే చాలామంది సొంతంగా చెప్పులు తయారుచేసుకునే వాళ్లు. ఎలా అనుకుంటున్నారా? తాటి చెట్టు మట్టలు కిందపడితే వాటిని ఏరుకునే వాళ్లు. పాదానికి సరిపోయేలా రెండు మూడు మడతలు వేసి తాటాకులను చీల్చి కుట్టుకునేవాళ్లు. అవి పొలాల్లో తిరగడానికి ఉపయోగపడేవి.
గోలీసోడా
ఇప్పటికీ నగరాల్లో గోలీసోడా దొరుకుతుంది. కానీ, ఆ రోజుల్లో ఊళ్లలో ఉన్న గోలీసోడా లాంటివి కాదు. ఎండలు మొదలవగానే ఊళ్లలో గోలీసోడా బండ్లు వీధుల్లో తిరిగేవి. బడిగంట మోగగానే పెద్దవాళ్లతో సహా సోడా తాగేవాళ్లు. మాములు సోడా, నిమ్మకాయ సోడా, కలర్ సోడా అని రకరకాలు దొరికేవి. పేదవాళ్ల వేసవి పానీయం ఆ రోజుల్లో గోలీసోడానే.
ఆకులే గొడుగులు
వేసవికాలంలో పొలాల్లో తిరగాలన్నా, పొలం నుంచి తొందరగా ఇంటికి రావాలన్నా ఎండను తట్టుకోవడం కష్టం. ఆ రోజుల్లో ఆకులనే గొడుగులుగా తల మీద వేసుకునే వాళ్లు. అరిటాకులు, తాటి మట్టలను నెత్తిన పెట్టుకుని ఎండల్లో తిరిగేవాళ్లు. పచ్చటి ఆకులు వేడి తలకు తగలకుండా అడ్డుకునేవి.
విసన కర్ర
ఆ రోజుల్లో విసనకర్రలే ఎండాకాలంలో చల్లటి గాలి ఇచ్చేవి. గాలి ఆడకపోయినా, ఉక్కపోతగా అనిపించినా వెంటనే చేతిలోకి విసనకర్ర వచ్చేది. దీంతో విసురుకుంటే చల్లటిగాలి తగిలేది. వేడిని తట్టుకోలేక కొందరు వీటిని నీళ్లతో తడిపి విసురుకునేవాళ్లు, తాటాకులతో వీటిని అల్లేవాళ్లు. కొన్నిరకాల విసనకర్రలను వెదురు బద్దలతో కూడా తయారు చేసేవాళ్లు. ఒకవైపు చేత్తో పట్టుకోవడానికి వీలుగా చిన్నకర్రలను అమర్చేవాళ్లు. వేసవికాలం వచ్చిందంటే కొందరికి జీవనోపాధి ఈ విసనకర్రలే..
పుల్ల ఐస్
ఎండాకాలం వచ్చిందంటే ఒకప్పుడు గ్రామాల్లో పుల్ల ఐస్లకు చాలా డిమాండ్ ఉండేది. చిన్నా పెద్ద తేడా లేకుండా తినేవాళ్లు. పసుపు, ఎరుపు రంగుల్లో దొరికేవి. పాలు, సేమ్యాలతో ప్రత్యేకంగా తయారు చేసేవాళ్లు. పుల్ల ఐస్లను డబ్బాలలో సైకిళ్ల మీద పెట్టుకుని ఊళ్లలో తిరుగుతూ అమ్మేవాళ్లు, పిల్లలందరూ బండి చుట్టూ చేరి సంతోషంగా కొనుక్కుని ఇష్టంగా తినేవాళ్లు.