కవర్ స్టోరీ : అడవి బిడ్డల జాతర

  • యుద్ధం గెలిచిన రాజుల కోటలు శిథిలమయ్యాయి. కొన్ని చరిత్రలో కలిసిపోయాయి. 
  • కానీ ఏ కోటా లేని గుట్ట... తిరుగులేని త్యాగానికి పెట్టని కోటయ్యింది. 
  • ఏ విగ్రహం లేని అమ్మల గద్దె... అంతులేని విశ్వాసానికి వేదికైంది.

పుష్కరాలు పన్నెండేళ్లకోసారి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఏడాదికోసారి నిర్వహిస్తారు. మేడారం మహా జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు జరుగుతుంది. ఆ తర్వాత మండమెలిగె పండుగ పేరుతో ‘మినీ మేడారం జాతర’ మిగిలిన ఏడాదిలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడిక మేడారం 365 రోజులూ జాతరగా రూపాంతరం చెందింది. తిరుమల తిరుపతి, వేములవాడ వంటి దేవస్థానాల మాదిరిగానే మేడారం కూడా ఆధ్యాత్మిక తీర్థంగా అవతరించింది.

ఇక్కడ కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి ప్రతీ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి మేడారం బాట పడుతున్నారు. తలనీలాలు సమర్పించి పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లంతో అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ప్రతీ రోజు వస్తున్న భక్తుల కోసం సర్కారు సైతం సకల సౌలతులు కల్పిస్తున్నది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ఏర్పాటు చేసింది.  భక్తుల సేవ కోసం 24 గంటల పాటు ఇక్కడ ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఏడాది పొడవునా గద్దెల దగ్గరికి భక్తులను అనుమతిస్తున్నారు.

 మేడారం వనదేవతల చరిత్ర

పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. సమ్మక్క -సారక్కలను భక్తుల కష్టాలను కడతేర్చే వనదేవతలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనే ఆపద్బాంధవులుగా గుర్తించి వనదేవతలుగా పూజిస్తున్నారు. కోయ గిరిజనుల ఉనికికోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క, -సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెప్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.1996లోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. మేడారం జాతర గురించి రెండు చారిత్రక ఆధారాలున్నట్లుగా రాష్ట్ర సర్కారు చెప్తోంది. ఈ ఆధారాల ప్రకారం రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. 

మొదటి కథ

13వ శతాబ్దంలో మేడారం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది. అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళ్లగా అక్కడ సింహాలు కాపలాగా ఉన్న పసిపాపను గమనించారు. ఆ పాపను వారు దైవ స్వరూపంగా భావించారు. ఆమెకు ‘సమ్మక్క’ అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన తర్వాత గిరిజన రాజైన పగిడిద్ద రాజుతో పెండ్లి చేశారు. వారికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు కలిగారు.

ఓసారి మేడారంలో కరువు కాటకాలు వచ్చినయ్. ఆ పరిస్థితుల్లో కప్పం కట్టమని మేడారాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజుకు ఆదేశం పంపాడు. తమకు పంటలు లేవని, కప్పం చెల్లించలేమని పగిడిద్ద రాజు వేడుకున్నాడు. అయినా పట్టించుకోని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు. ‘‘సంపంగి వాగు” అనే ప్రాంతం దగ్గర భీకర యుద్ధం ప్రారంభం అయ్యింది. శత్రుసైన్యం పగిడిద్ద రాజును వెనకనుండి పొడిచి చంపారు. 

ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు, కూతురు సారలమ్మ యుద్ధంలో ప్రవేశించారు. సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిభకు కాకతీయ సైన్యం కనుమరుగు కాసాగింది. దీంతో భ్రాంతి చెందిన శత్రుసైన్యం సమ్మక్క, సారలమ్మలను కూడా వెనుకనుండి పొడిచారు. జంపన్నను చంపి, వాగులో పడేశారు. అప్పటినుంచి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది. ఆమెను వెతుక్కుంటూ గిరిజనులు వెళ్లారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ వారికి చిలకలగుట్ట ప్రాంతం వద్ద ఉన్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించింది. సమ్మక్క తల్లి.. కుంకుమ భరిణెగా మారిందని, సారలమ్మ మేడారంలోని కన్నెపల్లిలో వెలిసిందని నమ్ముతారు.

రెండో కథ

13వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా ఇప్పటి జగిత్యాల జిల్లాలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు. తన ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘‘పగిడిద్దరాజు’’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు.

కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు ఆగ్రహంతో ఉంటాడు. అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికిబ తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. 

పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు... జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది.

సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 
మారిన మేడారం జాతర తీరుసుమారు 900 ఏండ్ల చరిత్ర కలిగిన మేడారం జాతరను1940 వ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. 

ఆ తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ప్రతీ జాతరకు భక్తులు పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మల చిహ్నంగా మేడారంలో గద్దెలు ఏర్పాటు చేశారు. రాను రాను మేడారం జాతర తీరు మారిపోయింది. మొదట్లో రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు మహా జాతర నిర్వహించేవాళ్లు. మేడారంలోని గద్దెలపైకి జాతర రోజు అమ్మల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుంచి  సుమారు కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. 

ఆ తర్వాత మినీ మేడారం’ జాతర పేరుతో మధ్య ఏడాది వేడుకలు జరపడం మొదలుపెట్టారు. గత ఇరవై ఏళ్లుగా ఈ జాతర నిర్వహిస్తున్నారు. అప్పుడు కూడా నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో లక్షలాది మంది భక్తులు హాజరై అమ్మలను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ‘మేడారం’ ఓ పుణ్యక్షేత్రంగా మారింది. గతంలో మహా జాతర, మినీ మేడారం జాతర సమయాల్లోనే వచ్చే భక్తులు ఇప్పుడు ప్రతీ రోజు ఇక్కడికి రావడం పరిపాటిగా మారింది. 1996లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత మేడారంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ఏర్పాటు చేశారు.

భక్తుల సేవ కోసం పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించారు. మేడారంలోని అమ్మవారి గద్దెల చుట్టూరా గ్రిల్స్‌‌‌‌ ఏర్పాటు చేశారు. స్వాగత తోరణం, టెంపుల్‌‌‌‌ మాదిరిగా కనిపించే నిర్మాణాలు చేశారు. శాశ్వత మరుగుదొడ్లు, మూత్రశాలలను కట్టించారు. భక్తులు విడిది చేయడానికి సమ్మక్క, సారక్కల పేర్లతో భవనా‌‌లు నిర్మించారు. భక్తులు తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ కట్టలు ఏర్పాటు చేశారు. ఇవే కాక హరిత కాకతీయ హోటల్‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ వెలిశాయి. మేడారం, ఊరట్టం, కొండాయి, నార్లాపూర్‌‌‌‌, రెడ్డి గూడెం తదితర ప్రాంతాలలో కుటుంబంతో సహా భక్తులు విడిది చేయడానికి ప్రైవేట్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. 

 ప్రతీ రోజు దర్శనభాగ్యమే

తాడ్వాయి మండలంలోని ఓ మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య సమ్మక్క సారలమ్మలు గద్దెల రూపంలో కొలువై ఉన్నారు. మేడారంలో ఇప్పుడు ప్రతీ రోజు వనదేవతల గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం భక్తులు గద్దెల దగ్గరకు వెళ్లి అమ్మలను దర్శించుకునే వీలును కల్పించారు. దీంతో ముఖ్యంగా సెలవు రోజులు, ఆది, బుధవారాల్లో10 వేల నుంచి లక్ష మందికి పైగా భక్తులు మేడారం వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా, మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు పెద్ద ఎత్తున మేడారం వస్తున్నారు. మహా జాతర సమయంలోనే వచ్చి మొక్కులు సమర్పించాలనే పద్ధతి మారిపోతూ వస్తోంది. భక్తులకు వీలైనప్పుడు సమయం, సందర్భం చూసుకొని సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుంటున్నారు. ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమ, సారె, చీరెలు సమర్పిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా తలనీలాలు  సమర్పిస్తున్నారు.

ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌, ఆర్టీసీ బస్సుల్లో కుటుంబసభ్యులు, బంధువులతో సహా వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు. కోళ్లు, మేకలు కోసుకొని... ఆ తర్వాత అటవీ ప్రాంతంలోనే విడిది చేస్తున్నారు. మహా జాతర, మినీ మేడారం జాతర కాక ఏడాదిలో సుమారు15 నుంచి 25 లక్షల మంది భక్తులు మేడారం వచ్చి మొక్కులు చెల్లిస్తున్నట్లుగా ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. 

కాలినడక నుంచి సొంత కార్ల వరకు..

సమ్మక్క సారలమ్మ మహా జాతరలో పాల్గొనడానికి పూర్వం భక్తులు కాలినడకన మేడారం చేరుకునేవారు. ఎడ్లబండ్లతో పాటు గుంపులు, గుంపులుగా నడుచుకుంటూ వచ్చేవాళ్లు.  చిన్నతనంలో ఎడ్లబండ్లలో జాతరకు వెళ్లిన తీపి గుర్తులు చాలా మందికి తెలుసు. సమ్మక్క గద్దెకు రావడానికి వారం రోజుల ముందు నుంచే గ్రామాలలో ఇంటి వద్ద ఎడ్ల బండ్లు బయలుదేరేవి. సుమారు 10 రోజులకు సరిపడా వంట సామాగ్రి, దుస్తులు తీసుకొని జాతరకు బయలుదేరేవాళ్లు. ఆ తర్వాత జీపులు, ఆటోలు, డీసీఎం వ్యాన్లు, లారీలలో మేడారం రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా సొంతకార్లలో, ఆర్టీసీ బస్సుల్లో   భక్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించి వెళ్లిపోతున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మేడారంలో నిత్యం ఆటోలు, కార్ల చప్పుడు వినిపిస్తుంది.

పెరిగిన సౌకర్యాలు

గతంలో మేడారం మహా జాతరకు వెళ్లాలంటే కష్టంగా ఉండేది. అన్నీ మట్టి రోడ్లే. గుంతలు పడి ఎడ్లబండ్ల ప్రయాణం కూడా సరిగా ఉండేది కాదు. జీపులు, ట్రాక్టర్లు  బురదలో దిగపడిపోయేవి. ఇప్పుడు అలా కాదు. మేడారం చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎక్కడ చూసినా బీటీ రోడ్లే. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడా సౌకర్యాలను పెంచాయి. 

మేడారం వచ్చే దారుల్లో ముందుగా సింగిల్ బీటీ రోడ్లు వేశారు. ఆ తర్వాత వాటినే డబుల్‌‌ ‌‌రోడ్లుగా మార్చారు. మేడారం ఉండేది ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో. అయినా జాతర సమయంలో ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేషనల్‌‌‌‌ హైవే రోడ్లు, ఇతర లింకు రోడ్లన్నీ బాగు చేశారు. ‘‘మేడారం పుణ్యమా.. అని మా రోడ్లు బాగుపడ్డాయ’’ని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు సంతోషంగా చెప్తున్నారు.  

 పోలీసుల నిఘా 

గతంలో మేడారం మహా జాతర, మినీ జాతర సమయంలోనే పోలీసులు డ్యూటీ చేసేవాళ్లు. ఇప్పుడది మారింది. మేడారానికి నిత్యం భక్తులు రాకపోకలు ఉండటంతో పోలీసుల పహారా ఎక్కువైంది. తాడ్వాయి‒మేడారం, పస్రా‒మేడారం, చిన్నబోయినపల్లి‒మేడారం, భూపాలపల్లి‒మేడారం, కాటారం‒మేడారం రూట్లలో నిత్యం ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసులు డ్యూటీ చేస్తున్నారు.

ఈ రూట్లలో పదుల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. దొంగతనాలను అరికట్టడంతో పాటు ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణకోసం వీటిని ఎక్కువగా వాడుతున్నారు. 2018 నుంచి డ్రోన్‌‌ ‌‌కెమెరాల వాడకం కూడా పెరిగింది. ఆకాశం నుంచే పోలీస్‌‌‌‌ పహరా కాస్తున్నారు. భక్తులకు సేవలందించే విషయంలో సీసీ, డ్రోన్‌‌ ‌‌కెమెరాలు పోలీసులకు చాలా ఉపయోగపడుతున్నాయి.

మహా జాతర సమయంలో వారం రోజుల పాటు 10 వేల మందికి పైగా పోలీసులు డ్యూటీ చేస్తే... మినీ మేడారం జాతరలో రెండు వేల మంది వరకు డ్యూటీలు చేసేవాళ్లు. ఇప్పుడు మహా జాతరకు నెల, రెండు నెలల ముందు నుంచే వెయ్యి మందికి పైగా పోలీసులు విధి నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. నిత్యం రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తుండటంతో వారి నియంత్రణ కోసం ఒక ఐపీఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పర్యవేక్షణలో పోలీసులు నిఘా పెడుతున్నారు. 

రోడ్ల మరమ్మతులు

 రోడ్లు బాగుంటేనే భక్తులు టైంకు మేడారం చేరుకోగలరు. లేకపోతే ట్రాఫిక్‌‌‌‌ జాం సమస్యలు ఎదురవుతాయి. రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్‌‌, దేవాదాయ ధర్మాదాయ, ఐటీడీఏ ఇంజినీరింగ్‌‌‌‌ ‌‌శాఖల ద్వారా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు వేశారు. గతంలో ఉన్న ఎడ్లబండ్ల దారులను బీటీ రోడ్లు చేశారు. సింగిల్‌‌‌‌ బీటీ రోడ్లను డబుల్‌‌‌‌ బీటీ రోడ్లు చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల మీదుగా మేడారానికి వచ్చే అన్ని రహదారులను మరమ్మతులు చేయడంతో పాటు మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో ఉన్న అంతర్గత రహదారులను సైతం మరమ్మతులు చేశారు. ఇరుకుగా ఉన్న మోరీలను వెడల్పు చేశారు. ఇవేకాకుండా నేషనల్‌‌‌‌హైవే పనులు కూడా చేపట్టారు.

ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణకు వన్‌‌‌‌వే

గతంలో మేడారం మహా జాతర సమయంలోనే పోలీసులు వన్‌‌‌‌ వే అమలు చేసేవాళ్లు. ఇప్పుడది మహా జాతరకు నెల, రెండు నెలల ముందునుంచే అమలుచేయాల్సి వస్తోంది.  ముఖ్యంగా సెలవు రోజుల్లో మేడారం వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరిగిపోతుంది. వాహనాల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. దీంతో గత కొన్ని వారాంతపు సెలవు రోజుల్లో మేడారం దగ్గర ట్రాఫిక్‌‌‌‌ జాం అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రోడ్లపైనే గంటల పాటు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వేలాదిగా వస్తున్న వాహనాలను నియంత్రించడంలో భాగంగా పోలీసులు అప్పుడప్పుడు మేడారంలో వన్‌‌‌‌వే అమలు చేస్తున్నారు. మేడారం వెళ్లే వాహనాలు.. తిరిగి వెళ్లే వాహనాలు వేర్వేరు వైపుల నుంచి పంపిస్తున్నారు. కేవలం ఆర్టీసీ, వీఐపీ, వీవీఐపీ వాహనాలకు మాత్రమే మినహాయింపునిస్తున్నారు. మిగతా ప్రైవేట్‌‌‌‌, సొంత వెహికల్స్‌‌‌‌ అన్నీ కూడా వన్‌‌‌‌వే రూల్స్‌‌‌‌ పాటించాల్సిందే. లేకపోతే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మహా జాతర సమయంలో వారం రోజుల పాటు వన్‌‌‌‌ వే అమలు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. 

పర్మినెంట్‌‌‌‌ పార్కింగ్‌‌ ‌‌స్థలాలు

ప్రతి రోజు మేడారం వస్తోన్న భక్తుల కోసం పర్మినెంట్‌‌‌‌ వెహికల్‌‌ పార్కింగ్‌‌‌‌ ఏర్పాటు చేశారు. మహా జాతర సమయంలో 33 పార్కింగ్‌‌‌‌ ప్లేసులుంటే మినీ జాతరలో అవి 10 వరకు ఉండేవి. ఇప్పుడు ప్రతీ రోజు వస్తున్న భక్తుల కోసం పస్రా‒మేడారం రూట్‌‌‌‌లో జంపన్నవాగు దగ్గర, తాడ్వాయి‒మేడారం రూట్‌‌‌‌లో ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ పార్క్‌‌‌‌ చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులను అయితే గద్దెల దగ్గరికి అనుమతిస్తున్నారు.

వీఐపీ, వీవీఐపీలకు మహా జాతరలో కేటాయించిన పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లనే కేటాయించారు. నిత్యం వచ్చే ఐదారు వేలకుపైగా వెహికల్స్‌‌ అన్నీ పార్కింగ్‌‌‌‌ చేసుకునే విధంగా వంద ఎకరాల స్థలాన్ని  కేటాయించారు. దీంతో పాటు రాబోయే మేడారం మహా జాతర కోసం 33 చోట్ల పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం 1,400  ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్‌‌‌‌ స్థలంలోనే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. తాగునీటి వసతి కూడా ఉంటుంది. ఇన్‌‌‌‌, ఔట్‌‌‌‌లెట్లు ఉంటాయి. వెలుతురు కోసం లైట్లు పెట్టారు. ఆర్టీసీ బస్సులకు, వీఐపీ, వీవీఐపీలకు వేర్వేరు చోట్ల పార్కింగ్‌‌ ‌‌ప్లేస్‌‌‌‌లు ఏర్పాటు చేశారు. 

105 కోట్లతో సర్కారు ఏర్పాట్లు

మేడారం మహా జాతర‒2024 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లతో ఏర్పాట్లు చేస్తోంది. ఇంజినీరింగ్‌‌‌‌ వర్క్‌‌‌‌ల కోసం రూ.70 కోట్లు ఉపయోగించగా నాన్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ శాఖలకు రూ.35 కోట్లు కేటాయించారు. ఈ సారి కోటి యాభై లక్షల మందికి పైగా భక్తులు మేడారం వస్తారని అంచనా వేసి పనులు చేపట్టారు. 

 స్వచ్ఛమైన తాగునీరు‌‌ 

మేడారం జాతరలో ఈ సారి భక్తులకు రక్షిత మంచినీరు  అందించాలనే ఉద్దేశంతో రూ.4.21 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటికే నిర్మించిన మూడు వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లను వాడుకలోకి తీసుకొచ్చారు. ఊరట్టం దగ్గర రెండు లక్షలు, జంపన్నవాగు సమీపంలో నాలుగు లక్షలు, జంపన్నవాగు ఇవతల రెండు లక్షల లీటర్ల నీటిని నిల్వచేసే వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లున్నాయి.

వీటితో పాటు జాతర చుట్టు ప్రక్కల ప్రాంతాలలో 50కి పైగా మినీ వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లు ఉన్నాయి. భక్తులు నివాసం ఉండే ప్రతి చోట శుద్ది చేసిన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జాతర కోర్‌‌‌‌ ఏరియాలోని 10 ప్రాంతాలలో ఐదు వేల వరకు బ్యాటరీ ఆఫ్‌‌‌‌ ట్యాప్స్‌‌‌‌(బీవోటీ)లను ఏర్పాటు చేశారు. భక్తులు నీరు పట్టుకునేలా వీటిని నిర్మించారు.

 24 గంటలు వైద్య సేవలు

మహా జాతర జరిగే నాలుగు రోజులతో పాటు జాతరకు వారం ముందు నుంచే మేడారంలో భక్తులకు 24 గంటల పాటు వైద్య సౌకర్యాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కల్పిస్తోంది. జాతరకొచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం తరపున 30 చోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

అత్యవసరంగా రోగులను తరలించేందుకు108 వెహికల్స్‌‌‌‌15, తాత్కాలిక బ్లడ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా కలిపి150 మంది స్పెషలిస్టు డాక్టర్లు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అలాగే జాతర పరిసర ప్రాంతాల్లో నాలుగు పడకల వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు, ఏఎన్‌‌‌‌ఎంలు, పారామెడికల్‌‌‌‌ సిబ్బంది కలిపి రెండు వేల మందికి పైగా ఉద్యోగులు జాతరలో విధులు నిర్వహిస్తారని డీఎంఅండ్‌‌‌‌హెచ్‌‌‌‌వో అప్పయ్య చెప్పారు.

మహాలక్ష్మీ స్కీం అమలు

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ స్కీం పేరిట పల్లెవెలుగు, ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. మేడారం మహా జాతరకు కూడా ఈ స్కీంను అమలు చేస్తున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ ప్రకటించారు. బస్సు ఛార్జీల రూపేణా ఒక్కో పేద కుటుంబానికి రెండు వేల రూపాయల వరకు లబ్ది చేకూరుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల బస్సులను ఏర్పాటు చేసి, సుమారు 40 లక్షల మంది భక్తులను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌‌‌ నేతృత్వంలో ఇప్పటికే మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ ఏర్పాటు చేశారు. 47 క్యూలైన్లు కట్టారు.70 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ద్వారా ఆర్టీసీ ప్రయాణీకుల పర్యవేక్షణ చేస్తామని వరంగల్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎం శ్రీలత చెప్పారు. ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు గద్దెల దగ్గరి వరకు వచ్చే ఏర్పాట్లు చేశారు. కేవలం అర కిలోమీటర్‌‌‌‌ దూరంలోనే గద్దెలు ఉంటాయి. ఫిబ్రవరి18 నుంచి 25వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్‌‌‌‌.ఎం. చెప్పారు.

ప్లాస్టిక్‌‌‌‌ కోసం చెక్​ పోస్ట్​లు 

మేడారం మహా జాతరను ఈసారి ప్లాస్టిక్‌‌‌‌ ఫ్రీ జాతరగా నిర్వహించడానికి సర్కారు నిర్ణయించింది. దీనికోసం శబరిమలలో పాటించే విధానం అమలు చేస్తున్నారు.  మహా జాతర స్టార్ట్‌‌‌‌ కావడానికి రెండు నెలల ముందు నుంచే భక్తులు అధిక సంఖ్యలో మేడారం వస్తున్నారు. ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌, ఆర్టీసీ బస్సుల్లో వస్తున్న భక్తులు ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు ఉపయోగించవద్దని తెలియచేయడానికి తాడ్వాయి, పస్రా రూట్‌‌‌‌లో ఆఫీసర్లు రెండు చెక్‌‌‌‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ డ్యూటీలో ఉండే ఆఫీసర్లు భక్తులతో మాట్లాడి ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు తీసుకుని, జ్యూట్‌‌‌‌ బ్యాగులు ఇస్తున్నారు. మీడియా ఛానెళ్లు, దినపత్రికల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్‌‌‌‌ ఫ్రీ జాతర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గోడలపై, ఆర్టీసీ బస్సుల వెనుక పెయింట్స్‌‌‌‌తో రాయించారు. జనం రద్దీగా ఉండే ప్లేసుల్లో బ్యానర్లు కడుతున్నారు.

30 వేల మందికి పైగా...

మేడారం జాతరలో 30 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందించేందుకు రెడీగా ఉన్నారు. ఒక్క పోలీస్‌‌‌‌ శాఖ తరపునే10 వేల మందికి పైగా డ్యూటీలు వేశారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్‌‌‌‌, ఇంజినీరింగ్‌‌ ‌‌శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలందిస్తారు. రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర, జిల్లాస్థాయి ఆఫీసర్లతో పాటు ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌, ఎస్పీ తదితర ఉన్నతస్థాయి ఉద్యోగులంతా వారం రోజుల పాటు మేడారం జాతరలోనే  ఉంటారు.

జల్లు స్నానాలు

మేడారం వచ్చే భక్తులందరూ జంపన్నవాగులో స్నానం చేస్తారు. జాతర సమయంలో వారం రోజుల పాటు అధికారులు లక్నవరం నుంచి నీళ్లు వదిలిపెడతారు. నీళ్లల్లోకి దిగి స్నానాలు చేయలేని వారి కోసం జంపన్నవాగుకు రెండు వైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవునా రూ.1.5 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్‌‌‌‌ ట్యాప్స్‌‌ ‌‌ఏర్పాటు చేసింది. రూ.50 లక్షలతో జంపన్నవాగులో నిర్మించిన బావుల పూడికతీత పనులు చేశారు. మోటార్లు పనిచేయడానికి కరెంట్‌‌‌‌ కనెక్షన్లతో పాటు జనరేటర్లను కూడా ఉంచారు.

బట్టలు మార్చుకునే గదులు

జంపన్నవాగు వద్ద స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా తాత్కాలిక గదులు కట్టించారు. ఇందుకోసం రూ.25 లక్షలు కేటాయించారు. ఇదివరకు మేడారం జాతరలో బట్టలు మార్చుకునే గదులు సరిపోను లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సారి జంపన్నవాగు పొడవునా నాలుగు కిలోమీటర్ల దూరం రెండు వైపులా ప్రతి 20 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటుచేశారు. ఇప్పటికే జాతర కోసం వస్తున్న మహిళా భక్తులు వీటిని వాడుకుంటున్నారు.

20 వేల మందికి సరిపడే షెడ్లు

మేడారం మహా జాతరకొచ్చే భక్తులు ఉండటానికి గదులు లేక ఇబ్బందులు పడేవారు. ఎవరికి వారే కవర్లతో షెడ్లు నిర్మించుకొని ఒకటి, రెండు రోజులు ఉండి అమ్మలకు మొక్కులు చెల్లించి వెళ్లిపోయేవారు. ఈ సారి జాతరకొచ్చే భక్తుల్లో సుమారు 20 వేల మంది ఉండటానికి, రాత్రివేళల్లో నిద్రించడానికి వీలుగా ఐదు షెడ్లను ఇది వరకే కట్టారు. వీటితో పాటు కొత్తగా మరో రెండు కడుతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ షెడ్ల వద్ద ఉచిత మూత్రశాల, మరుగుదొడ్ల వసతి సౌకర్యం కూడా ఉంది. ఒక్కో షెడ్డు దగ్గర నలుగురు చొప్పున సిబ్బందిని ఉంచుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జాతరలు జరుగుతుంటాయి. కానీ ఏ జాతరకూ లేని ప్రత్యేకతలు.. అన్ని జాతర్లలో కనిపించే విశిష్టతలు మేడారంలో చూడొచ్చు. గలగల పారే జంపన్నవాగులో భక్తుల పుణ్యస్నానాలు.. కుంభమేళాను తలపిస్తాయి. గణగణమోగే గంటలు హిందూ దేవాలయాలు, క్రైస్తవ చర్చిల వద్ద గల ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండ కోనల మధ్య జనసందోహం శబరిమలను మరిపిస్తుంది. తలనీలాల మొక్కులు చెల్లించే తీరుతో మరో తిరుమలను చూడవచ్చు.

కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే మేడారం జాతర పరిమితం కాలేదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా దాగుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులు అయితే పోరాటం చేసిన కోయ ఆదివాసీ వీర వనితలు మాత్రం దేవతలయ్యారని నమ్మిన భక్తులు వందల ఏండ్లుగా పూజిస్తున్న తీరు అద్భుతం. 

కోయగిరిజన పద్ధతిలోనే పూజలు

మేడారం 365 రోజుల జాతరగా మారినప్పటికీ కోయ గిరిజన పద్ధతిలోనే భక్తులు పూజలు చేయాల్సి ఉంటుంది. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఇక్కడ  ప్రత్యేకత. ఏ మంత్రోచ్ఛారణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారుల(వడ్డెలు) ఆధ్వర్యంలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. భక్తులంతా సమ్మక్క, సారలమ్మల ప్రతిరూపాలైన గద్దెలను తాకి తన్మయత్వం పొందుతారు.

శివసత్తుల పూనకాలు, వడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, కోయదొరల భవిష్యవాణి, జంపన్న వాగులో స్నానాలు, తలనీలాల సమర్పణ, ఎదురు కోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మి దేవర వేషాలు, మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆట పాట వంటి దృశ్యాలు మేడారంలో కనిపిస్తుంటాయి. ఆఫీసర్లు ఏర్పాట్లు చేయడమే తప్ప పూజలో నేరుగా పాలుపంచుకోరు. మేడారం మహాజాతర, మినీ మేడారం జాతర సమయంలోనే కాకుండా ప్రతీ రోజు గద్దెల వద్ద కోయ పూజారులే ఉంటారు. జాతర ఆదాయంలో కూడా కోయ పూజారులకే మూడో వంతు వాటా ఇస్తారు.

రెండు మూడు నెలల ముందే...

మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ మధ్య జరుగుతుంది. ముందస్తు మొక్కుల కోసం రెండు, మూడు నెలల ముందు నుంచే భక్తులు అధిక సంఖ్యలో మేడారం వస్తున్నారు. ముఖ్యంగా పండుగ సెలవు రోజులు, ఆదివారం అయితే లక్ష నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మలను దర్శించుకుంటున్నారు. భక్తుల రాకను ఉద్దేశించి ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు అమ్మల గద్దెలను దర్శించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నం. ఏడాది పొడవునా రక్షిత మంచినీరు అందిస్తున్నం. శాశ్వత మూత్రశాలలు, మరుగుదొడ్లు కట్టించినం.

ఇలా త్రిపాఠి, ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌ 

అలర్ట్‌‌‌‌గా ఉంటున్నరు

గతంలో మహాజాతర సమయంలోనే పోలీస్‌‌‌‌ ఎస్కార్ట్‌‌‌‌ పెద్దగా ఉండేది. వారం రోజుల పాటు విధులు నిర్వహిస్తే జాతర కంప్లీట్‌‌‌‌ అయ్యేది. కానీ ఇప్పుడు నిత్యం మేడారంలో పోలీసుల పహారా ఉంటుంది. ముందస్తు మొక్కుల కోసం భక్తులు అధిక సంఖ్యలో మేడారం వస్తున్నారు. దీంతో పస్రా‒మేడారం, తాడ్వాయి‒మేడారం, చిన్నబోయినపల్లి‒మేడారం రూట్లలో పోలీసుల గస్తీ పెరిగింది. ట్రాఫిక్‌‌‌‌ జాం, పార్కింగ్‌‌‌‌ సమస్యలు తలెత్తకుండా గత నెల రోజులుగా ప్రతీ రోజు సుమారు 500 నుంచి వెయ్యి మంది పోలీసులు మేడారం డ్యూటీ చేస్తున్నారు. మహాజాతర సమయంలో అయితే 10 వేల మందికి పైగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది.

డాక్టర్‌‌‌‌ శబరీశ్‌‌‌‌, ములుగు జిల్లా ఎస్పీ 

మహిళలు, బాలికలకు ఫ్రీ బస్‌‌‌‌ జర్నీ

మహాలక్ష్మి స్కీం కింద మహిళలు, బాలికలు పల్లెవెలుగు, ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బస్సుల్లో ఫ్రీగానే మేడారం రావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఆర్టీసీ బస్సుల ద్వారా సుమారు 40 లక్షల మంది భక్తులను మేడారం తీసుకురావడానికి ఏర్పాట్లు చేశాం. మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ నిర్మించాం. 45 క్యూలైన్లు ఏర్పాటు చేశాం. మేడారం మహాజాతరలో పాల్గొన్న భక్తుల ఇళ్లకి అమ్మల పసుపు, కుంకుమతో పాటు బంగారం(ఎత్తు బెల్లం) పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటాం. 

పొన్నం ప్రభాకర్‌‌‌‌, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

ఆన్​లైన్​ మొక్కులు

మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే సదుపాయాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. మీసేవ, పోస్టాఫీసు, టీయాప్​ ఫోలియో ద్వారా బుక్​ చేసుకోవచ్చు. ఆన్​లైన్​లో మొక్కులు చెల్లించుకోవాలనుకున్న వాళ్ల బరువు ప్రకారం ఒక కేజీకి అరవై రూపాయల చొప్పున నిలువెత్తు బంగారం సమర్పించే సేవను బుక్​ చేసుకోవచ్చు. ఇదేకాకుండా పోస్టాఫీసు ద్వారా మేడారం ప్రసాదం కూడా తెప్పించుకోవచ్చు.

పర్యావరణ పన్ను రద్దు

వివిధ ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌లో మేడారం వచ్చే భక్తులకు పర్యావరణ పన్ను రద్దు చేస్తున్నాం. సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.  పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం రూట్ల నుంచి కారు, ఆటోలు, డీసీఎం వ్యాన్లు, ట్రాక్టర్లు, లారీలకు ఎలాంటి ఫీజు తీసుకోరు. ఫిబ్రవరి 2 నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుము (ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలు నిలిపివేస్తున్నాం. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. 

 కొండా సురేఖరాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి 

మహాజాతర ఇలా..

ఈ సారి మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.  బుధవారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు సారలమ్మ గద్దెపైకి రావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. 24న అమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. 
 ఫిబ్రవరి 21న(బుధవారం) సమ్మక్క బిడ్డ వరాల తల్లి సారలమ్మను కన్నెపల్లి నుంచి పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకొచ్చి మేడారంలోని గద్దెపైకి చేర్చుతారు. నాలుగు రోజుల మహాజాతరలో తొలిఘట్టమిది. పిల్లల కోసం తపించే మహిళలు వరం పడతారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా రోడ్డుపై పడుకుంటారు. పూజారులు వారిపై నుంచే నడుచుకుంటూ వస్తారు. మహబూబాద్‌‌‌‌ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో కొలువైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉన్న గోవిందరాజులను సైతం ఇదే రోజు గద్దెలపైకి చేర్చుతారు. గిరిజన పూజారులు వీళ్లిద్దరిని కూడా బుధవారమే గద్దెకు తీసుకొస్తారు. మేడారం నుంచి పూనుగొండ్ల గ్రామం 60 కి.మీ దూరం ఉంటుంది. అయినా గిరిజన పూజారులు ఎంతో నియమనిష్టలతో అటవీ మార్గాన నడుచుకుంటూ వచ్చి గద్దెలపైకి పగిడిద్దరాజును చేర్చుతారు.
 ఫిబ్రవరి 22న (గురువారం) మేడారం మహాజాతరలో అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకలగుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లుగా సంకేతాలు పంపిస్తారు. దీంతో మేడారం ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోతుంది. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. రాత్రి వేళల్లో అమ్మవారిని గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. 
 ఫిబ్రవరి 23న (శుక్రవారం) మహాజాతరలో మూడవ రోజున 
అమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డి, రాష్ట్ర గవర్నర్‌‌‌‌ 
తమిళి సై వనదేవతలను దర్శించుకుంటారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అమ్మలను దర్శించుకోవడానికి వస్తుంటారు. భక్తులు అమ్మలకు పసుపు, కుంకుమ, నూనె కలిపిన ఒడి బియ్యం, బంగారంగా పిలిచే బెల్లం సమర్పిస్తారు. 
 ఫిబ్రవరి 24న (శనివారం) నాలుగవ రోజు సాయంత్రం గిరిజన పూజారులు గద్దెలపై ఉన్న వనదేవతలకు ఆవాహన పలికి అందరిని తిరిగి యథా స్థానానికి తరలిస్తారు. లక్షలాది మంది భక్తులను అనుగ్రహించిన సమ్మక్క సారలమ్మలు తిరిగి వనాల్లోకి వెళ్లిపోతారు.  దీంతో మహాజాతర ముగుస్తుంది.కానీ జన జాతర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 

ప్లాస్టిక్​ ఫ్రీ జాతర

మేడారం అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి 105 కోట్లు కేటాయించారు. పనులను నేను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నా. గడిచిన 20 రోజుల్లో మూడు సార్లు మేడారం వచ్చి ఆఫీసర్లతో సమీక్ష జరిపా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మలను దర్శించుకొని వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాం. మహాజాతర టైంలో వారం రోజుల పాటు ఇక్కడే ఉంటాను. మేడారం మహాజాతరను ఈ సారి ప్లాస్టిక్‌‌‌‌ ఫ్రీ జాతరగా నిర్వహిస్తున్నాం. జాతరకొచ్చే భక్తులు ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు తీసుకురావద్దు.

 ధనసరి అనసూయ (సీతక్క) 

 గద్దెలను తాకడం మా అదృష్టం

సమ్మక్క సారలమ్మ గద్దెలను తాకడం మా అదృష్టం. ప్రతి రెండేళ్లకోసారి మహాజాతర టైంలో కుటుంబంతో కలిసి మేడారం వచ్చేటోళ్లం. అప్పుడు గద్దెల చుట్టూరా ఉన్న గ్రిల్స్ కి‌‌ తాళాలు వేసి ఉంచుతరు. దూరం నుంచే తల్లులను దర్శించుకుంటం. గత పదేళ్లుగా తల్లుల దర్శనానికి క్రమం తప్పకుండా వస్తున్నం. కానీ గద్దెలను తాకే అదృష్టం కలగలేదు. ఈ సారి మహాజాతరకోసం గవర్నమెంట్‌‌‌‌ భారీగా ఏర్పాట్లు చేస్తుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అప్పుడు వస్తే రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి జాతరకు 20 రోజుల ముందే వచ్చినం. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో మేమంతా ఈ సారి తల్లుల గద్దెలను తాకినం. దీంతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నం.

నల్ల పురుషోత్తం రెడ్డి ఫ్యామిలీ, హైదరాబాద్

ముందస్తు మొక్కుల కోసం...

మా ఫ్యామిలీతో మేడారంకు రావడం ఇది ఎనిమిదోసారి. గతంలో మహాజాతర టైంలోనే వచ్చేటోళ్లం. అప్పుడు బాగా రద్దీగా ఉండటం వల్ల తల్లుల దర్శనానికి చాలా లేట్‌‌‌‌ అయ్యేది. క్యూలైన్లలో పిల్లలు తెగ ఇబ్బందిపడేవారు. ఈ సారి మహాజాతర కంటే మూడు వారాల ముందుగానే వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించినం. ముందస్తు మొక్కుల కోసం పిల్లాపాపలతో కలిసి 20 మందిదాకా వచ్చినం. అయినా చాలా ఫ్రీగా అమ్మల దర్శన భాగ్యం మాకు కలిగింది. పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నరు. మేడారంలో గతంలో కంటే ఇప్పుడు ఏర్పాట్లు మస్తున్నయ్‌‌‌‌. కాకపోతే భక్తులు రెండురోజులు ఉండే విధంగా సర్కారు తరపున సత్రాలు నిర్మిస్తే బాగుంటుంది అనిపిస్తోంది.

పస్తం మంజయ్య ఫ్యామిలీపటాన్‌‌‌‌చెరు, హైదరాబాద్‌‌‌‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

వెహికల్స్‌‌‌‌ రూట్

  •  ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మహాజాతర సమయంలో వన్‌‌‌‌వే రూల్స్‌‌‌‌ అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌‌‌‌, నల్గొండ, కరీంనగర్‌‌‌‌, వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ ములుగు దాటాక పస్రా దగ్గర క్రాస్‌‌‌‌ తీసుకోవాలి. ఇక్కడి నుంచి  నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. జాతర ముగించుకొని తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా భూపాల పల్లి, రేగొండ, పరకాల నుంచి హన్మకొండకు వెళ్లాలి.
  •  గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వెహికల్స్‌‌‌‌ కాటారం నుంచి క్రాస్‌‌‌‌ చేసుకొని కాల్వపల్లి, సింగారం, బోర్లగూడెం, పెగడ పల్లి, చింతకాని మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా వెళ్లొచ్చు. 
  •  ఛత్తీస్ గఢ్​, భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వెహికల్స్‌‌‌‌ ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి దగ్గర క్రాస్‌‌‌‌ చేసుకొని కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి.  తిరుగు ప్రయాణంలో ఇదే దారిలో వెళ్ళిపోతారు. 
  •   ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికల్స్‌‌‌‌ నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి, ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా మళ్ళీ మల్లంపల్లికి వచ్చి ఇక్కడ క్రాస్‌‌‌‌ తీసుకొని తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. 
  •     ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వెహికల్స్‌‌‌‌ అన్నీ కూడా తాడ్వాయి దగ్గర క్రాస్‌‌‌‌ తీసుకొని మేడారం చేరుకోవాలి. తిరిగి ఇదే రూట్‌‌‌‌లో ఈ వెహికల్స్‌‌ వెనక్కి వెళ్తాయి.

అప్పుడు రాలేక...

ఎత్తు బెల్లం(బంగారం) బుట్టలు నెత్తిన పెట్టుకొని మహాజాతర టైంలో రాలేం. భారీ క్యూలైన్లలో నిలబడి గద్దెల దగ్గరికి వెళ్లి వీటిని సమర్పించలేం. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాలి. అందుకే మహాజాతరకు నెలరోజుల ముందే వచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నం.

మా ఫ్యామిలీ ఇక్కడికి రాబట్టి ఇది మూడోసారే. ఈ జాతర గురించి పేపర్ల లోనూ, టీవీల్లోనూ వచ్చే వార్తలు చూసి ఇక్కడికి వచ్చినం. అప్పటినుంచి మా ఫ్యామిలీకి కూడా  మంచి జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఎత్తు బెల్లం సమర్పించడానికి ముందస్తు మొక్కుల కోసం వచ్చినం.
 గోపాల్‌‌‌‌ ఫ్యామిలీ సికింద్రాబాద్​

అల్లం హరి వెంకటరమణజయశంకర్ భూపాలపల్లి, వెలుగు