Diwali Special 2023: దీపావళి డెకరేషన్ ఐడియాలు ఇవే...

చీకట్లను తరుముకుంటూ దీపావళి వచ్చేస్తోంది. పిల్లకైనా, పెద్దలకైనా ఈ పండుగంటే ఎంతో ఇష్టం. దీపాలు, టపాకాయలు, విద్యుద్దీపాల అలంకరణలు.. ఇవన్నీ మనకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని తెచ్చి పెడతాయి. ఇంత ప్రత్యేకమైన పండుగకు మీ ఇంటినీ అంతే అందంగా తీర్చిదిద్దుకోండి. కొన్ని దీపావళి అలంకరణ ఐడియాలు టిప్స్ తెలుసుకోండి.

 

  • మనం ఎక్కువగా పిట్ట గోడలు, గోడలపై దీపాలు పెట్టుకుంటూ ఉంటాం. అలా పెట్టుకున్నప్పుడు దీపాల నుంచి నూనె కారి గోడలపై పడి ఇబ్బందిగా తయారవుతూ ఉంటుంది. అందుకోసం దీపాల కింద ఆకు వేసి అందులో కాస్త ఇసుకను పోసి దీపాలు పెట్టండి. అప్పుడు నూనెతో ఇబ్బంది ఉండదు. ఒక వేళ కారినా దాన్ని ఇసుక పీల్చేసుకుంటుంది.
     
  • దీపావళి పండుగ అంటేనే మనం దీపాలతో ఇంటిని అలంకరించుకుంటాం. అందుకు తగినట్లుగా ముందు ఇంటిని సర్దుకోవాలి. మొదట ఇంటిని శుభ్రం చేసుకోవడంతోనే మన ఇంటి వాతావరణం పాజిటివ్‌గా మారుతుంది.
     
  • దీపాలు పెట్టుకుంటాం కాబట్టి ముందుగా ఇంటి పరదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీపాలకు తగులుతాయి అనుకున్న కర్టెన్లను వీలైతే కొన్ని రోజుల పాటు తీసి పక్కన పెట్టేయండి. ప్రమాదాలు లేకుండా ఆనందంగా పండుగ జరుపుకోవచ్చు.
     
  • దీపాలు పెట్టేందుకు వీలుగా రకరకాల రంగులతో, పూలతో ముగ్గులు వేయండి. వాటిలో దీపాలు పెడితే లుక్‌ అదిరిపోతుంది.
     
  • ఈ పండుగ కోసం ప్రత్యేకంగా ఫ్లోటింగ్‌ క్యాండిల్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. ఇత్తడి ఉర్లీలో అందంగా పూలను పేర్చి ఆ మధ్యలో ఇలా ఫ్లోటింగ్‌ క్యాండిల్స్‌ని వెలిగించి పెట్టండి. హాల్‌లో దీన్ని పెట్టుకుంటే దీపపు కాంతులతో ఇల్లు వెలిగి పోతుంది. మన మనసుకూ ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.
     
  • మార్కెట్లో రకరకాల విద్యుత్‌ దీపాలు, సీరియల్‌ లైట్లు, దీపపు కందెనలాంటి దీపాలు.. అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల రంగుల్లో ఉండే ఆ లైట్లను కొని తెచ్చుకుని నచ్చినట్లుగా అలంకరించుకోండి. స్విచ్‌ ఆన్‌ చేసుకుంటే మనింట్లో ముందుగానే పండుగ వెలుగులు వచ్చేస్తాయి.
     
  • పండుగకు ముందు రోజే గుమ్మాలు, తలుపుల్ని పూలతో అలంకరించుకోండి. పండగకు పూలకు మించిన అలంకరణ దేనితో వస్తుంది చెప్పండి. మామూలుగా కాకుండా మామిడాకులతో చిలకలు, రకరకాలుగా ఆకారాలు చేసి మధ్య మధ్యలో పెడితే కొత్త లుక్ వస్తుంది.
     
  • ఇంట్లో ఖాళీ గ్లాస్‌ జార్లలాంటివి ఉంటే వాటిలో సీరియల్‌ లైట్ల కట్టను వేయండి. ప్లగాన్‌ చేసి చూడండి. మీ ఖాళీ సీసాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేంత అందంగా మారిపోతాయి.
     
  • రంగు కాగితాల్ని తెచ్చి పేపర్‌ పువ్వులు, దీపాలు కత్తిరించండి. వాటిని తోరణాల మాదిరిగా దారానికి అంటించి వేలాడదీయండి. లేదంటే గోడకు ఒక ఆకారంలో అలంకరించి పైన కొన్ని సీరియల్‌ లైట్లను ఏర్పాటు చేయండి. లేదంటే ఈ పేపర్లతో రకరకాల లాంతర్లనూ తయారు చేసి లోపల లైట్లు అమర్చుకుని చూడండి. మీ ఇంటి లుక్కే మారిపోతుంది