ఫేమస్‌ టూరిస్ట్‌ స్పాట్‌ : ఔషధాల ఖిల్లా

ఒకప్పుడు శత్రు దుర్భేద్యమైన ఈ కోట.. ఇప్పుడు ఒక ఫేమస్‌ టూరిస్ట్‌ స్పాట్‌. ఇది  అరుదైన శిల్పకళ, ప్రకృతి సోయగాలకు నెలవు. రామగిరి ఎక్కుతుంటే అరుదైన వృక్షాలు, ముచ్చటగొలిపే తీగలు, వాటికి రంగురంగుల పూలు.. అవి వెదజల్లే పరిమళాలు.. టూరిస్ట్​లకు మధురానుభూతిని అందిస్తాయి.

పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలంలోని బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల నడుమ విస్తరించిన రామగిరిఖిల్లా సుప్రసిద్ధ గిరిదుర్గం. ఇక్కడికి నిత్యం టూరిస్ట్‌‌లు వస్తుంటారు. ప్రత్యేకించి ప్రతి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కాలేజీ, యూని వర్సిటీ స్టూడెంట్స్‌‌, ఆయుర్వేద వైద్యులు, వృక్ష శాస్త్రవేత్తలు బొటానికల్ టూర్‌‌‌‌ కోసం ఇక్కడికి వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వనమూలికలు పట్టుకెళ్తుంటారు. చెట్టు, పుట్ట, -గుట్టలతో ఉన్న క్లిష్టమైన మార్గంలో పది కిలోమీటర్ల మేర సాగే ‘రామ గిరి’ ఎక్కడం ఓ సాహసం.

శ్రావణ మాసంలో ఇక్కడికి రావడం అనుకూలంగా ఉంటుంది. ఎత్తయిన కొండల మీదుగా, పచ్చని చెట్ల మధ్యలో నుంచి రాళ్లు, రప్పలను, పొదలను దాటుకుంటూ రామగిరి ఎక్కడం అడ్వెంచర్​ ఎక్స్​పీరియెన్స్​ ఇస్తుంది. ఒక వైపు గోదావరి, మరో వైపు మానేరు నదుల సందడి కనిపిస్తుంది. 

చెక్కు చెదరని ఖిల్లా..

ఈ ఖిల్లా ఒక పటిష్టమైన రాతి కట్టడం. కోటగోడలు, బురుజులు, భవనాలు, సమాధులు, మసీదులు, బావులు, కొలనులు నేటికీ చెక్కు చెదరలేదు.  శ్రీరాముడు వనవాసంలో భాగంగా ఇక్కడ బస చేశాడని స్థానికుల నమ్మకం. సీతారాముల ఆలయం, రామ ప్రతిష్ఠాపిత లింగం, శ్రీరామ పాదాలు, సీతమ్మ పాదాలు, సీతమ్మ కొలను ఉన్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రామగిరి ఖిల్లాపై అశ్వశాల, దర్బారు, చెరసాల, గజశాల, భోజనశాలలు, రహస్యమార్గాలు, సొరంగాలు, తోపులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇవేకాకుండా చిత్రకోట, తాటికోట, నిమ్మకోట, నగారా ఖానా, మందుగదులు, తోపుబావి, నల్లకయ్యబావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మ బావి, అమ్మగారి బావి, దేవ స్థలాలు, సప్తద్వారాలు, చౌకీలు.. చూసి తీరాల్సిందే. ఈ ఖిల్లాపై కాకతీయుల కాలంలో ఈ నిర్మాణాలు జరిగాయి. 

వందల్లో మూలికలు  

ఆధ్యాత్మిక, చారిత్రక కేంద్రంగా ఉన్న ఈ ఖిల్లా గుట్టలపై 200 రకాల వన మూలికలు ఉండడంతో ఆయుర్వేద వైద్యానికి మూలకేంద్రంగా ఉండేదని చెప్తుంటారు. రామగిరి ఖిల్లాపైకి వెళ్లడానికి శ్రావణమాసంలోనే పర్మిషన్​ ఉంటుంది. ఖిల్లా మీద దాదాపు16 కిలోమీటర్లు కాలినడక ఉంటుంది.
కరీంనగర్ నుంచి మంథని వెళ్లే మార్గంలో బేగం పేట క్రాస్​రోడ్స్(నాగవెల్లి) వద్ద దిగి, ఆటోలో బేగంపేట గ్రామం చేరుకోవాలి. అక్కడి నుంచి సుమారు10 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే గుట్టపైకి చేరుకోవచ్చు. సరిపడా మంచినీరు, పండ్లు, ఫ్రూట్​ జ్యూస్​లు, బిస్కెట్ల లాంటివి వెంటపెట్టుకుని ఉదయం బయల్దేరితే... సాయంత్రం కల్లా తిరిగి క్రాస్​రోడ్స్​కు చేరుకోవచ్చు. 

వడ్డేపల్లి రవీందర్‌‌, పెద్దపల్లి