సమ సమాజ మార్గదర్శి గురునానక్

  •  నవంబర్​ 15  గురు నానక్ జయంతి

ప్రపంచవ్యాప్తంగా సిక్కు మతాన్ని ఆచరించే వారు 2.6 కోట్ల  నుంచి 3 కోట్లు ఉంటారు.  సిక్కు మతస్థాపకుడు,  ప్రథమ గురువు గురునానక్ దేవ్ 1469లో  పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున  ప్రస్తుత పాకిస్తాన్ నాటి అఖండ భారత్ లో  నాన్ ఖానా సాహిబ్ తల్వండి గ్రామంలో  జన్మించాడు.  ఈ ప్రదేశాన్ని ఇప్పుడు గురుద్వారా జనం స్థాన్​గా పిలుస్తున్నారు.    24-9-1487న  మాత సులక్నితో  నానక్  వివాహం జరిగింది. వీరికి శ్రీ చంద్, లక్ష్మిదాస్​లు కుమారులు.  చిన్ననాటి నుంచి దైవచింతన కలిగిన నానక్.. భక్త కబీర్​దాస్​లాంటి సాధుసంతుల ప్రసంగాలకు ఆకర్షితుడయ్యేవాడు.  పూర్తిగా దైవ చింతనలో లీనమై కర్తార్ పూర్ లో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నివసించడం చేత మొదట్లో గురునానక్​ను నమ్మే వారిని కర్తారీస్ అనేవారు.  

గురు నానక్ మాత్రం పీడిత ప్రజల గురించి ఆలోచిస్తూ వారిని సమ సమాజంలో నడిపించడానికి ప్రయత్నించాడు.  సిక్కులు వారి  విశ్వాసాన్ని గుర్మాత్  ద్వారా అవలంబిస్తారు. సిక్కు మతం గురునానక్  చేత స్థాపించబడి ఆ తరువాత వచ్చిన 9 మంది గురువుల  పరంపర ద్వారా నిక్షిప్తమైంది.  ఈ 10 మంది గురువులు  ఒకే ఆత్మతో నివసించారని సిక్కుల నమ్మకం. 10వ గురువు  గురు గోవింద్ సింగ్ మరణం తర్వాత గురు గ్రంథ సాహిబ్ (గురువుగా గ్రంథం/ ఆది గ్రంథ్) నే  శాశ్వత గురువుగా భావించుకున్నారు. ఈ గ్రంథంలో గురునానక్ స్వతహాగా చెప్పినట్లు భావించే 974 పద్యాలు/ సుభాషితాలు/ సంకీర్తనలు  పొందుపరిచారు. 

గురునానక్ దేవ్ సందేశం

గురునానక్ దేవ్ జీ  అంతర్గత భక్తి  ప్రాముఖ్యతను,  నిజాయితీగా జీవించడం, నిస్వార్థ సేవ ద్వారా భగవంతుని సాక్షాత్కారాన్ని నొక్కి చెప్పాడు.  ఏక్ ఓంకార్- సకల సృష్టిలో ఉన్న శాశ్వత సత్యమైన దేవుడు ఒక్కడే.   కులం, మతం, లింగం లేదా మతంతో సంబంధం లేకుండా మానవులందరూ సమానమే అన్నాడు.  సిక్కు మతంలోని అన్ని శాఖలు విగ్రహారాధన,  కుల వ్యవస్థలను తిరస్కరిస్తూ సృష్టికర్త  ఒక్కడేనని విశ్వసిస్తారు. గురునానక్ జయంతి (గురు పురబ్/ ప్రకాష్ పర్వ్) మూడు రోజుల  పండుగను ఆనందంగా జరుపుకుంటారు.  

గురుద్వారాలలో అఖండ మార్గం నిర్వహిస్తారు.  అఖండ్ మార్గం అనేది సిక్కు సమాజం ఆధ్యాత్మిక పుస్తకాన్ని 48 గంటలపాటు నిరంతరం చదివే ఒక అభ్యాసం. ఈ  పండుగ సందర్భంగా, ప్రజలు పంజ్ ప్యారస్ నేతృత్వంలో ఊరేగింపును నిర్వహిస్తారు.  సిక్కులు  ఐదు నియమాలను పాటించాలని నిర్ణయించుకున్నారు. అవి ఐదు ‘కే’లు అని పిలిచే  ఖల్సా చిహ్నాలు,  కేశ్​ లేదా కేష్ (కట్ చేయని జుట్టు),  కంఘా (ఒక దువ్వెన),  కచ్చా (పొడవైన షార్ట్),  కిర్పాన్ (ఒక ఉత్సవ ఖడ్గం), కారా (ఉక్కు బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్).

నిస్వార్థ సేవయే గురుసేవ

గురునానక్ హిందూ, ఇస్లాం మతాల గురించి లోతైన జ్ఞానాన్ని పొందాడు. ఈ జ్ఞానంతోనే 15వ శతాబ్దంలో  సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ దేవ్ బోధనలు సిక్కు ప్రజల పవిత్ర గ్రంథమై గురు గ్రంథ్ సాహిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత,  నిస్వార్థ సేవ,  ధర్మం ఆధారంగా వివిధ సూత్రాలు ఉన్నాయి. వ్యత్యాసాలు లేకుండా మానవత్వం, సామాజిక న్యాయం కోసం  నిస్వార్థ  సేవను ప్రచారం చేస్తాయి.  ఈ పవిత్రమైన రోజున పేదలకు దానధర్మాలు చేస్తారు. గురునానక్ 555వ జయంతి సందర్భంగా నిస్వార్థంగా  సమాజ  శ్రేయస్సును  కోరుకుందాం. 

- డా. కావలి చెన్నయ్య ముదిరాజ్-