ఇవి పిల్లల కథలే... అయితేనేం వాతావరణ సంక్షోభం గురించి ఆ చిన్ని మెదళ్లలో ఆలోచన పుట్టించేందుకు ఒక టూల్‌గా పనిచేస్తాయి. అదెలానో అర్థం కావాలంటే ‘నో వైట్... ఆమె ఏడుగురు స్నేహితులు’ కథలోకి వెళ్లాల్సిందే.
ఒకానొకప్పుడు ఒక రాణి బట్టలు కుడుతుంటే... సూది వేలికి గుచ్చుకుంటుంది. వేలినుంచి మూడు రక్తపు చుక్కలు మంచు మీద పడతాయి. అప్పుడామె ‘నాకో బిడ్డ కావాలి. ఆమెను స్నో వైట్’ అని పిలవాలి అని కోరుకుంటుంది. తరువాత చాలా ఏండ్లకు ఆమె బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ పుట్టేటప్పటికి ఫెయిరీల్యాండ్‌లో వాళ్లు ఉంటున్న ప్రాంతంలో మంచు ఉండకుండా పోతుంది.
దాంతో ఆ బిడ్డను ‘నో వైట్’ అని పిలుస్తారు. నో వైట్‌కి జుట్టు చాలా బాగుండేది. వెంట్రుకలు కారు నలుపులో ఉండేవి. చర్మం మంచు అంత తెల్లగా మెరిసిపోయేది. పెదవులు ఎర్రగా రక్తం రంగులో ఉండేవి. కానీ ఆమె ముఖం బయటకు కనపడకుండా ముసుగు వేసుకోవాల్సి వచ్చేది. దానికి కారణం సవతి తల్లి బెదిరింపు.
నో వైట్ తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. వాళ్లందరికీ అసలు పేర్లు ఉంటాయి. కానీ బొగ్గు గనుల్లో పని చేసేందుకు వెళ్లినప్పటి నుంచి కార్బన్, మీథేన్, నైట్రస్, ఆక్సైడ్, నీరు, ఆవిరి, వాయువుగా కొత్త పేర్లు వస్తాయి.
కార్బన్ ఏమాత్రం సంతోషంగా ఉండదు.
కాలుష్యం కారణంగా మీథేన్ ఆగకుండా తుమ్ముతూనే ఉంటుంది.
ఫ్యాక్టరీలో చాలామంది విచిత్రమైన ఫ్లూ జబ్బు బారిన పడతారు. దాంతో డాక్టర్ నైట్రస్కి వాళ్లని ట్రీట్మెంట్ ఇవ్వడంతోనే సరిపోతుంది.
ఆక్సైడ్ ఏమో ముడుచుకుని నిద్రపోతుంటుంది.
ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రపు అలల్లా నీళ్లు సలసల మరుగుతూ విపరీతమైన చిరాకుతో ఉంటారు.
ఆవిరి, వాయువులు ఏ ఆందోళన లేకుండా హాయిగా ల–ల–లా అనుకుంటూ పాడుతూ తిరుగుతుంటాయి. పొగమంచు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, పాడటం కాసేపు ఆపేస్తాయి. కానీ ఏ ఇబ్బందిలేనట్లు నటిస్తాయి. ‘పొగమంచు, ఏమి పొగమంచు’ అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటాయి.
‘‘ఏం కాలేదు”అంటూ వాయువు కష్టంగా శ్వాస తీసుకుంటుంది.
ఎర్రగా అయిన కళ్ల నుంచి నీళ్లు కారుతుంటే ‘‘అంతా బాగానే ఉంది” అంటుంది ఆవిరి.
నో వైట్ ఏమీ చేయకుండానే దాని సమస్య ప్రకృతి పరిష్కరించింది. సవతి తల్లి ‘నో వైట్’కు యాపిల్స్‌లో విషం నింపి ఇవ్వాలి అనుకుంటుంది. కానీ.. ఫెయిరీల్యాండ్‌లో యాపిల్స్ జాడే ఉండదు. సీజన్కంటే ముందుగానే వర్షాలు పడడంతో... యాపిల్ పంట కోతకు రాకముందే నాశనమైపోతుంది. మిగిలిన పంట చీడ పట్టి పాడైపోతుంది.
ఇదిలా ఉంటే... ‘జామూన్ పండులోకి విషం ఎక్కించే ప్రయత్నం చేసిన ప్రతి సారి నో వైట్ సవతి తల్లి చేతులు ఊదా రంగులోకి మారిపోయేవి. గోడమీద ఉండే అద్దంలో కూడా ఊదారంగు అంటుకున్న చేతివేళ్లు ఆమెని భయపెట్టాయ’ని కొందరు చెప్పుకుంటుంటే తెలుస్తుంది నో వైట్‌కి. ఆ విషయం తెలుసుకున్న నో వైట్ ముఖం మీద సన్నటి నవ్వు చేరుతుంది. తెల్లటి ఆ నవ్వు చుట్టుపక్కల ఉన్న పక్షులు, సీతాకోక చిలుకలను ఆకర్షిస్తుంది. అక్కడ యువరాజేమో... ‘నో వైట్ ఒక పండు తింటే బాగుండ’ని ఎదురుచూస్తుంటాడు. కానీ ఆ దరిదాపుల్లో యాపిల్, జామూన్ పండ్లే ఉండవు.