కరీంనగర్లోని 37వ డివిజన్లోని రాంనగర్ వెజిటేబుల్ మార్కెట్ రెనోవేషన్ పనులకు 2021 జూన్లో పీపీ గ్రాంట్స్ కింద రూ.34 లక్షలతో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పనులను అప్పట్లో ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. మూడేండ్లు తిరగకముందే తాజాగా ఇదే వెజిటేబుల్ మార్కెట్ రెనోవేషన్ పనులకు రూ.39.50 లక్షలతో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. మూడేండ్ల కింద జరిగిన పనులకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయమై బల్దియా డీఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. గతంలో రూ.34 లక్షల పనులకు ఓ కాంట్రాక్ట్ సంస్థ టెండర్ దక్కించుకున్నప్పటికీ ఆ నిధులతో పని చేయలేమని చెప్పడంతో అంచనా మొత్తం పెంచి మళ్లీ టెండర్ ఇచ్చినట్లు తెలిపారు.
కరీంనగర్, వెలుగు: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పనుల జాతర నడుస్తోంది. ఒకేసారి కోట్లాది రూపాయల విలువైన వందలాది పనులకు టెండర్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకేసారి రూ.23 కోట్ల విలువైన 171 పనులకు టెండర్ నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో రీకాల్ చేసిన పాత టెండర్లే 40 వరకు ఉన్నాయి. ఇందులో డ్రెయినేజీల నిర్మాణం, సీసీ రోడ్లు, మురికికాల్వల్లో సిల్ట్ తీయడం, మట్టి పనుల వంటివే ఎక్కువగా ఉన్నాయి. మరో రెండు నెలల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు నాలుగు పైసలు మిగిలేలా ఈ పనులకు పచ్చ జెండా ఊపారనే ఆరోపణలున్నాయి. అయితే పాత బిల్లులు రాకపోవడంతో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కార్పొరేటర్లు తమ దగ్గరి కాంట్రాక్టర్ల ద్వారా పనులు దక్కించుకుంటున్నారు.
ఒక్కో డివిజన్ లో రూ.40 లక్షలకుపైగా పనులు..
తమ పదవీకాలం దగ్గర పడడంతో గతంలో ప్రజలకు హామీ ఇచ్చి చేయలేకపోయిన పనులు, పైసలు ఎక్కువగా మిగిలే పనులను ఎక్కువగా ఇందులో చేర్చించారు. జనరల్ ఫండ్స్ తో చేపట్టే పనులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో డివిజన్ లో రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు కేటాయించి పనులు సిద్ధం చేశారు. అయితే గతంలో సీఎం అస్యూరెన్స్ ఫండ్స్ తో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం కొత్త పనులు చేపట్టేందుకు వారు ముందుకు రావడం లేదు. దీంతో చాలా మంది కార్పొరేటర్లు తామే పనులు చేసుకుంటామని, కేవలం టెండర్ వేసి తమకు ఇస్తే సరిపోతుందని తమకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లతో టెండర్లు వేయించడం కనిపించింది.
రెండు, మూడు రోజులే లైవ్ లో టెండర్లు ..
రూ.2 కోట్లలోపు ఏ పని అయినా.. జీవో నం.247 ప్రకారం టెండర్ నోటిఫికేషన్ 14 రోజులు లైవ్ లో ఉండాలి. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. దీంతో ఎక్కువ మంది కాంట్రాక్టర్లు బిడ్ వేసేందుకు అవకాశం ఉంటుంది. పోటీ ఎక్కువైతే తక్కువ ధర కోట్ చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తారు. కానీ, టెండర్లు కొందరికి దక్కేలా రెండు, మూడు రోజులు మాత్రమే లైవ్ లో ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరు కారణంగా గురువారం వరకు ఇంకా 70 పనులకు కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేయలేదు. 171 పనులకుగాను 101 పనులకు టెండర్లు దాఖలయ్యాయని, మిగిలిన 70 పనులకు టెండర్లు దాఖలు కాలేదని డీఈ లచ్చిరెడ్డి తెలిపారు. వీటిని త్వరలో రీకాల్ చేస్తామని వెల్లడించారు.
కరీంనగర్ సిటీ శివారు రేకుర్తి పరిధిలో ఎస్సారెస్పీ కెనాల్ ఉంది. 18, 19వ డివిజన్ల పరిధిలోని డీ94 కెనాల్ లో సిల్ట్ తొలగించేందుకు రెండు పనులుగా విభజించి మున్సిపల్ జనరల్ ఫండ్స్ ఖర్చు చేసేలా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఒక పనికి రూ.2.80 లక్షలు, మరో పనికి రూ.3 లక్షలుగా అంచనా వేశారు. ఇరిగేషన్ శాఖ పరిధిలోని కెనాల్ లో ఆ శాఖ నిధులతో పనులు చేయాల్సి ఉండగా.. మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పనులు చేయడమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.