- మాకు విధులు, నిధులు లేకుండా చేసిన్రు
- కనీసం ఒక్క తీర్మానం కూడా చేయలేకపోయినం
- జడ్పీటీసీ పదవి ఆరో వేలులా మారింది
- యాదాద్రి జడ్పీ సమావేశంలో సభ్యుల ఆవేదన
యాదాద్రి, వెలుగు : ‘ప్రజాప్రతినిధులుగా గెలిచినా ఈ ఐదేండ్లలో ప్రజలకు ఏమీ చేయలేకపోయాం. జిల్లాకు ఏదైనా సాధించడానికి జడ్పీలో కనీసం ఒక్క తీర్మానం కూడా చేయలే. ఈ పదవి ఎందుకో కూడా అర్థం కావట్లే’ అని యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా మంగళవారం యాదాద్రి జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆవేదనతో మాట్లాడారు. ఎన్నో ఆశలతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తమకు అభివృద్ధి చేసే అవకాశమే లభించలేదన్నారు. ఐదేండ్లలో నిధులు సరిగ్గా రాకపోవడంతో ఏం చేయలేకపోయామన్నారు. ఒకపక్క నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే.. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడం తమను మరింత బాధించిందని చెప్పుకొచ్చారు.
చివరకు గౌరవం కూడా లేకుండా పోయిందన్నారు. ప్రొటోకాల్ కూడా లేదని, అభివృద్ధి పనుల శంకుస్థాపన టైంలో శిలాఫలకాలపై తమ పేర్లు కూడా లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. నిధులు లేవు, విధులేంటో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కొందరు ఆఫీసర్లయితే.. ఎమ్మెల్యేలు చెబితేనే పనులు చేశారని..తాము ప్రజల కోసం పనులు చేయాలని కోరినా వినలేదన్నారు. ఈ పదవి ఎందుకూ పనికి రాని ఆరో వేలుగా అభివర్ణించారు. కనీనం కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పించలేకపోయామన్నారు.
జిల్లా కోసం ఏదైనా సాధించడానికి తీర్మానం చేయడానికి కూడా ఈ సభ ఉపయోగపడలేదన్నారు. మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ కోసం రూ.17 కోట్లు మంజూరు చేసినా ఏర్పాటు చేయలేకపోయామని, దీంతో ఆ డబ్బులు ల్యాప్స్అయ్యాయన్నారు. పేరుకు జిల్లాలో అడ్డగూడూరు, మోటకొండూరు మండలాలు కొత్తగా ఏర్పాటు చేశారే తప్ప.. ఆయా మండలాల్లో కనీన వసతులు కూడా కల్పించలేదన్నారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కలెక్టర్ హనుమంతు జెండగే, అడిషనల్కలెక్టర్ కే గంగాధర్, జడ్పీ సీఈవో శోభారాణి ఉన్నారు.