Nothing: మీది నథింగ్ స్మార్ట్ఫోన్ అయితే ఈ వార్త మీకోసమే..!

ఒక స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెజారిటీ స్మార్ట్ ఫోన్స్ గూగుల్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసేవి కాగా, యాపిల్ ఐఫోన్ మోడల్స్ ఐఓఎస్పై పనిచేస్తున్నాయి. నథింగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. అయితే.. లండన్కు చెందిన ఈ నథింగ్ కంపెనీ సొంత మొబైల్ ఓఎస్ డెవలప్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఆండ్రాయిడ్ కంటే మెరుగ్గా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కు ధీటుగా, ప్రత్యామ్నయంగా తమ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలని చూస్తున్నట్లు నథింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ తెలిపారు. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కు ప్రత్యామ్నయంగా సొంత ఓఎస్ తీసుకురావాలని పావులు కదుపుతున్న రెండో కంపెనీగా నథింగ్ నిలిచింది. ఇప్పటికే చైనాకు చెందిన హువాయి కంపెనీ సొంత సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇప్పుడు నథింగ్ కంపెనీ కూడా ఈ బాటలోనే నడుస్తుండటం విశేషం. కంపెనీకి ఒక కొత్త ఆదాయ మార్గంగా ఈ ఓఎస్ డెవలప్ చేయాలని నథింగ్ డిసైడ్ అయింది.

ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిన ఏఐ ఫీచర్ కూడా సపోర్ట్ చేసేలా ఓఎస్ డెవలప్ చేయాలని నథింగ్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. హువాయి కంపెనీ ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్స్లో సొంత ఓఎస్ను అందుబాటులోకి తెచ్చింది. HarmonyOS పేరుతో హువాయి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతోంది. HarmonyOS స్మార్ట్ ఫోన్ యూజర్లు Huawei AppGallery నుంచి పాపులర్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉంది. నథింగ్ కూడా గూగుల్ ప్లే స్టోర్ మాదిరిగా ఒక సొంత యాప్ను డెవలప్ చేసుకుని పాపులర్ యాప్స్ను దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తేనే సొంత ఓఎస్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది చాతకాకపోవడం వల్లే విండోస్ ఫోన్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్లకు పోటీగా నిలబడలేక చతికిలబడ్డాయి.