వ్యాక్సిన్ తీసుకున్నవారికి కంగారు పడొద్దు

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అతి తక్కువ మందిలో టీటీఎస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల.. ప్లేట్​లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. దాంతో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లక్ష మంది పేషెంట్లను తీసుకుంటే వాళ్లలో ఇద్దరికి మాత్రమే టీటీఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. అది చాలా అరుదుగా వచ్చే సమస్య. నిజానికి వ్యాక్సిన్ రాకముందు కొవిడ్​ మరణాలే ఎక్కువ. వ్యాక్సిన్ వల్ల వచ్చిన నష్టం కంటే కొవిడ్ కారణంగా జరిగిన నష్టమే ఎక్కువ. అరుదుగా వచ్చే ఈ రిస్క్​లకంటే అప్పట్లో మన ముందున్న పెద్ద సమస్య కొవిడ్​.

ఆ వైరస్​తో ఫైట్ చేసి, ప్రజల్ని కాపాడేందుకే వ్యాక్సిన్​లు తీసుకొచ్చారు. పైగా అప్పుడున్న వ్యాక్సిన్​ల సంఖ్య కూడా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు వ్యాక్సిన్​లు సరిపడా ఉండాలి. అవి అందరికీ అందాలనే ఉద్దేశంతో వేరు వేరు పేర్లతో వ్యాక్సిన్​లు తయారుచేశారు. వ్యాక్సిన్ లేకపోతే కొవిడ్ వల్ల జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేరు. అప్పటికే డెల్టా వేరియంట్ వల్ల వయసు, ఫిట్​నెస్​తో సంబంధం లేకుండా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. 

వేయించుకున్న వ్యాక్సిన్​ గురించి ఇప్పుడు కోర్టులో కేసులు, దానికి సంబంధించిన వార్తలు, వాటిమీద జరుగుతున్న చర్చలు చూసి ప్రజలు భయపడిపోతున్నారు. కానీ, అంతగా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల టీటీఎస్​ బారిన పడే ఛాన్స్ ఉన్నప్పటికీ అది చాలా అరుదు. పైగా అలాంటి సైడ్​ ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాలుగు నుంచి 42 రోజుల్లోగా ఆ లక్షణాలు బయటపడతాయి.

ఒకవేళ చనిపోయాక తెలుసుకోవాలంటే... బాడీలో ఎక్కడైనా రక్తం గడ్డకట్టిందా? ప్లేట్​లెట్ కౌంట్1‌‌.5 లక్షల కంటే తక్కువ ఉందా? పీఎఫ్​ – 4 (ప్లేట్​లెట్ ఫ్యాక్టర్ – 4) అనే యాంటీబాడీస్ పాజిటివ్​గా ఉన్నాయా? డీడైమర్ లెవల్స్ నార్మల్ వ్యాల్యూ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నాయా? అనేది తేలాలి. అప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ వల్లనే చనిపోయారని చెప్పొచ్చు. అలాగే ఈ కండిషన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లే వస్తుందని చెప్పలేం. ఎడినో వైరస్ అనే వెక్టార్​ని ఆధారం చేసుకుని తయారుచేసిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇలాంటి  సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ కనిపించింది. 

అలాగే mRNA వ్యాక్సిన్స్​లో కూడా కనిపించాయి. కానీ, కోవిషీల్డ్​కి ఉన్నంత ఎక్కువగా కనపడలేదు. దానికితోడు దాన్ని సపోర్ట్ చేసే ఆధారాలు కూడా లేవు. దీనిపై కేసులు రావడంతో ఇప్పుడు హైలైట్ అవుతోంది.

వ్యాక్సిన్ ఏదైనా సైడ్​ ఎఫెక్ట్స్ కామన్

వ్యాక్సిన్ తీసుకుని దాదాపు రెండేండ్లు దాటింది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలియో, ఇన్​ఫ్లుయెంజా వంటివాటికి వ్యాక్సిన్​లు తీసుకుంటున్నారు. వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పోలియో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల జీబిఎస్ సిండ్రోమ్ వస్తుంది. దాని వల్ల నరాలు ఎఫెక్ట్ అయ్యి నరాల బలహీనత వస్తుంది.

కానీ అది చాలా అరుదు. అందుకని అసలు వ్యాక్సినే తీసుకోకపోతే ఆ వ్యాధి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి పోలియో వ్యాక్సిన్ వల్ల ఎంతోమందికి మేలు జరిగింది. కాబట్టి ఎప్పుడో జరిగిన కేసుల్ని చూసి ఇప్పుడు భయపడక్కర్లేదు. ఏదైనా నష్టం జరిగితే దాని ప్రభావం రెండు నెలల్లోపే కనిపిస్తుంది. ఇప్పుడు దాని గురించి అనవసరంగా ఆందోళన చెందడం మానేయాలి. ఇంతకుముందు హార్ట్​ ఎటాక్​ కేసులు వరుసగా వస్తుండడంతో అది కూడా వ్యాక్సిన్​ వల్లే అని వార్తలొచ్చాయి. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నెలలోపు హార్ట్ ఎటాక్ వస్తే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. అంతేకానీ... వ్యాక్సిన్ వేయించుకుని ఏడాది దాటాక ఎలాంటి చెడు ప్రభావం చూపించదు అనేది గుర్తుంచుకోవాలి.