సౌత్​ కొరియాపై నాయిస్​ బాంబు.. లౌడ్ స్పీకర్లతో పిచ్చెకిస్తున్న కిమ్

సియోల్: లౌడ్ స్పీకర్లతో దక్షిణ కొరియన్లకు నార్త్  కొరియా ప్రెసిడెంట్  కిమ్  జోంగ్  ఉన్  నరకం చూపుతున్నారు. దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలో  మెటాలిక్  గ్రైండింగ్  చేయిస్తూ లౌడ్ స్పీకర్లు పెట్టి ఆ శబ్దాలను అక్కడి దక్షిణ కొరియన్లకు వినిపిస్తున్నారు. దీంతో సౌత్  కొరియా డీమిలిటరైజ్డ్  జోన్  వద్ద  డాంగ్  సన్  గ్రామస్తులు నరకం అనుభవిస్తున్నారు. లౌడ్ స్పీకర్ల ద్వారా వస్తున్న ఆ శబ్దాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని డాంగ్ సన్  వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భీకర శబ్దాలను భరించలేకపోతున్నామని, శబ్దాలు వినివిని తమకు పిచ్చెక్కిపోతున్నదని తెలిపారు.

‘‘ఆ శబ్దాలతో రాత్రిపూట మాకు నిద్రరావడం లేదు. రోజంతా నరకంగా ఉంది. తోడేళ్లు ఊల వేస్తున్నట్లు, ఫిరంగులు పేల్చినట్లు ఉంది. దీంతో నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి” డాంగ్ సన్  వాసులు పేర్కొన్నారు.

ఈ చర్యలతో నార్త్  కొరియా, సౌత్  కొరియా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాగా.. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా చేపడుతున్న సైనిక విన్యాసాలకు స్పందనగా కిమ్.. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సౌత్  కొరియా ఆరోపిస్తున్నది.