కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్.. తన పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈమేరకు అతనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. అధికార దుర్వినియోగంతో పాటు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపించారు. పలువురు వ్యాపారులపై కూడా కేసు నమోదు చేసినట్లు కలకత్తా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఒకరు తెలిపారు.
స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ దేవల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సందీప్ ఘోష్ అవినీతికి సంబంధించిన కేసును ముందుగా సిట్ బృందం దర్యాప్తు చేసింది. తర్వాత కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ వేసిన పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. సందీప్ ఘోష్ అవినీతిపై ఈడీ అధికారులతో దర్యాప్తు చేయించాలని పిటిషన్లో అలీ కోరారు.
ఘోష్‌కు రెండోసారి పాలిగ్రాఫ్ టెస్ట్
మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ఐదుగురికి సీబీఐ అధికారులు సోమవారం రెండో రౌండ్ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. పది రోజులుగా సీబీఐ అడిగిన ప్రశ్నలకు ఘోష్ పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అందుకే రెండో రౌండ్ పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించాల్సి వచ్చిందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. మెడికల్ కాలేజ్ మాజీ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్ సంజయ్ వశీష్ట్ను కూడా విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ తో పాటు వశిష్ట్ ను నిజాం ప్యాలెస్‌లో విచారిస్తున్నారు. ఇప్పటికే కోల్‌కతాలో ఘోష్‌కు సంబంధించిన 13 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.