నడిగడ్డకు దక్కని నామినేటెడ్ పోస్టులు!

  • బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను ఢీకొట్టేందుకు పదవులు ఇస్తారని అప్పట్లో చర్చ 
  • భవిష్యత్తులో వస్తాయనే ఆశలో ముఖ్య లీడర్లు

గద్వాల, వెలుగు: కాంగ్రెస్  ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్  పోస్టుల్లో జోగులాంబ గద్వాల జిల్లాకు ఒక్క పోస్టు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​తో హోరాహోరీగా తలపడినా  పార్టీని ఢీకొన్న కాంగ్రెస్  పార్టీ క్యాండిడేట్లు ఓటమిని చవిచూశారు. దీంతో క్యాడర్  చెదిరిపోకుండా ఉండేందుకు, జిల్లాలోని బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను ఢీకొట్టేందుకు నామినేట్ పదవులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ మొన్న ప్రకటించిన 37 నామినేటెడ్  పోస్టుల్లో నడిగడ్డ లీడర్లకు చాన్స్​ రాలేదు.

పక్కనే ఉన్న వనపర్తి జిల్లాకు రెండు పోస్టులు ఇచ్చి, జిల్లాకు మొండిచేయి చూపడంతో క్యాడర్  అయోమయానికి గురవుతోంది. భవిష్యత్తులో తప్పకుండా నామినేటెడ్  పోస్టులు వస్తాయని, వాటిపై ఆశలు పెట్టుకున్న వారు కార్యకర్తలకు సర్ది చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ అధికారంలో ఉన్నా, జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్​  ఎమ్మెల్యేలు ఉండడంతో కార్యకర్తలు, ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారని పార్టీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్పీ చైర్ పర్సన్  పదవీకాలం ముగిశాక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నామినేటెడ్  పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

డిఫరెంట్  రాజకీయాలు..

నడిగడ్డలో గతం నుంచి డిఫరెంట్  రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీలు కాకుండా వ్యక్తులపై ఇక్కడ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  గాలి బలంగా వీచింది. అయినప్పటికీ అలంపూర్  నియోజకవర్గంలో బీఆర్ఎస్  తరపున రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గెలవడాన్ని బట్టి చూస్తే ఇక్కడ పార్టీల ప్రభావం ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు.

గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్  పార్టీ పాగా వేయాలని కసరత్తు చేసింది. అప్పటి అధికార బీఆర్ఎస్  పార్టీకి గట్టి పోటీ ఇచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్  కాండిడేట్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక్కడ అధికారిక హోదా ఉండే చైర్మన్​ పదవులు ఇస్తే పార్టీ క్యాడర్​లో ఉత్సాహం ఉంటుందని భావించారు. కానీ ఇటీవల ప్రకటించిన లిస్టులో ఒక్కరి పేరు కూడా లేకపోవడంతో జిల్లా పార్టీలో దీనిపై చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్​ నేతల్లో పోటాపోటీ..

నడిగడ్డ కాంగ్రెస్  పార్టీలో నామినేటెడ్  పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. తమకు నామినేటెడ్  పోస్టు కావాలంటే, తమకు కావాలంటూ పోటీపడ్డ నేతలు హైకమాండ్​కు దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని ఇద్దరు లీడర్లు నామినేటెడ్  పోస్టుల కోసం అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. ఇద్దరిలో ఎవరికి పోస్ట్  ఇచ్చినా మరొకరితో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ముందుగా వారిద్దరిని రాజీ చేసి ఒకరికి నామినేటెడ్  పోస్ట్  అప్పజెప్పాలని హైకమాండ్​ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే జిల్లా స్థాయి పోస్టుల కోసం నియోజకవర్గ లీడర్ల చుట్టూ మండల లీడర్లు తిరుగుతున్నారు. ఇదిలాఉంటే పార్లమెంట్​ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పోస్టుల భర్తీ ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.