ఎన్నికల్లో పొలిటికల్‌‌ పార్టీల పాటల సందడి

ఇప్పుడు మన రాష్ట్రంలో రెండు పొలిటికల్‌‌ పాటలు బాగా ట్రెండింగ్‌‌లో ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ తమ గొప్పలను పాటగా పాడిస్తే.. మరో పార్టీ వాళ్ల లోపాలను చెప్తూ.. పాట పాడించింది. ఈ రెండు పాటలు రాష్ట్రం, దేశం దాటి విదేశాల్లోని తెలుగువాళ్లకు కూడా చేరాయి. అక్కడ వాళ్లు కూడా ఈ పాటల మీద డాన్స్‌‌లు చేస్తున్నారు. ఇది కూడా ప్రచారంలో భాగమే. ఇలా పాటలు పాడించడానికి నాయకులు, పార్టీలు బాగానే ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు పాటల రచయితలను పిలిపించుకుని వాళ్ల పేరుతో పాటలు రాయించుకుంటున్నారు. ఆ పాటలను ఫేమస్‌‌ ఫోక్‌‌ సింగర్లతో పాడిస్తున్నారు. వీళ్లతోపాటు మ్యూజిక్‌‌ డైరెక్టర్లకు.. రికార్డింగ్‌‌, ఎడిటింగ్‌‌ చేసేవాళ్లకు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు. 

కళాకారులకు 

ఎన్నికల రోజుల్లో పల్లె ప్రజలకు గుర్తొచ్చేది ఆట, పాట. ఎన్నికల నెల రోజుల ముందు నుంచే ఊరూరా ప్రచార రథాలు తిరుగుతాయి. వాటిపై కళాకారులు డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ.. వాటి ద్వారా క్యాండిడేట్ల గొప్పతనాన్ని వివరిస్తుంటారు. రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడడంలేదు. ఇలా అందరూ కళాకారుల కోసం చూడడం వల్ల ఆ బృందాలకు ఫుల్‌‌ డిమాండ్‌‌ ఉంటోంది. ముందుగానే అడ్వాన్స్‌‌లు ఇచ్చి మరీ కళాకారులను రిజర్వ్​ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా జానపద గాయకులు, డాన్సర్లు, ఆర్కెస్ట్రా, డప్పు కళాకారులు, కోలాటాలు ఆడే మహిళలు, ఒగ్గుడోలు కళాకారులకు డిమాండ్ ఎక్కువ కనిపిస్తోంది. కొన్ని టీంలలో సభ్యులు ఒక్కొక్కరు రోజుకు ఐదు నుంచి10 వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. వీళ్లలో రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు తీసుకునే జూనియర్‌‌‌‌ కళాకారులు కూడా ఉన్నారు. డబ్బుతోపాటు వీళ్లందరి భోజనం, వసతి బాధ్యత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులదే.