శబరిమలకు ఎప్పుడూ లేనంతగా అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు రోజుకూ రద్దీ పెరుగుతోంది.లక్షల్లో భక్తులు తరలివస్తుండడంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10నుంచి స్పాట్ బుకింగ్ సదుపాయాన్ని రద్దు చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా.. కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ బోర్డు సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులందరికీ స్వామివారి దర్శనం కలిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు భద్రతా సిబ్బంది. మణికంఠుడి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10 నుంచి స్పాట్ బుకింగ్ రద్దు చేసింది. అలాగే మకరజ్యోతి దర్శనానికి మహిళలు, చిన్నపిల్లలు రావద్దని సూచించింది. ఇంకోవైపు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్నవారికే దర్శనం కల్పించనున్నట్టు తెలిపింది. అంతేకాదు, జనవరి 14న 40 వేలమందికి, జనవరి 15వ తేదీన 50 వేలమందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్టు తెలిపింది. భక్తులు సహకరించాలని అధికారులు సూచించారు.
శబరిమలకు ప్రతిరోజూ లక్షల్లో భక్తులు వస్తున్నారు. సన్నిధానానికి వెళ్లే మార్గాల్లో కాలు తీసి కాలు కదపలేదని పరిస్థితి నెలకొంది. గంటలు గడుస్తున్నా.. క్యూ లైన్ ముందుకు కదలకపోవడంతో అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొండ కింద పంబా నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నీలక్కల్‌లో వేల సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్‌కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ.. అది ఏ మాత్రం సరిపోవడం లేదు. స్వామి దర్శనం కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే పంబా నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు.కేరళ సర్కార్ వైఫల్యం వల్లే శబరిలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. సీపీఎం సర్కారుకు వ్యతిరేకంగా కేరళలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అయ్యప్ప భక్తులను ఇబ్బంది పెట్టవద్దని..దర్శనం సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.