చైనా యుద్ధ వార్నింగ్ : మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ తైవాన్ పై చెలరేగిన చైనా ప్రెసిడెంట్

2025 జనవరి ఒకటో తేదీన ప్రపంచం అంతా సంబరాల్లో ఉంటే.. చైనా మాత్రం యుద్ధం వార్నింగ్ ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. న్యూ ఇయర్ సందర్భంగా చైనా మీడియాతో మాట్లాడుతూ.. తైవాన్ విషయంలో తన వైఖరి వెల్లడించారు. 

తైవాన్ దేశం అనేది చైనాలో అంతర్భాగం.. వన్ చైనాలో తైవాన్ ఉంటుంది అంటూ తన ఏకపక్ష ధోరణిని వెల్లడించారు. తైవాన్ జలసంధికి రెండు వైపులా ఉన్నది చైనీయులే.. మేం అంతా ఒకే కుటుంబానికి చెందిన వారం.. మా మధ్య బంధుత్వాలు ఉన్నాయి.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తైవాన్ దేశాన్ని.. చైనా భూభాగంలో అంతర్భాగంగా గుర్తించాం.. చైనా నుంచి తైవాన్ దేశాన్ని ఎవరూ విడదీయలేరు అంటూ డైరెక్ట్ గా చెప్పేశారు చైనా ప్రెసిడెంట్. తైవాన్ దేశాన్ని చైనాలో విలీనం చేసి తీరతాం అంటూ చైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన కామెంట్లపై తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ స్పందించారు. స్వయంపాలిత ప్రజాస్వామ్య దేశం అయిన తైవాన్ ను బలవంతంగా లొంగదీసుకోవటానికి చైనా కుట్రలు పన్నుతోంది.. ప్రాణాలకు తెగించి అయినా తైవాన్ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటాం అని ప్రతిజ్ణ చేశారు లై చింగ్. చైనా ప్రకటన వల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో అశాంతిని సృష్టించాలని చైనా పన్నాగం అని ప్రకటించారు. తీర ప్రాంతంలో రక్షణ, భద్రతను పెంచుతామని వెల్లడించారు తైవాన్ అధ్యక్షుడు. 

చైనా దూకుడుకు కారణం లేకపోలేదు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావటంతో.. 20వ తేదీన అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తుండటంతో.. చైనా అప్రమత్తం అయ్యింది. చైనా నుంచి వచ్చే వస్తువులపై అధికంగా పన్నులు వేస్తామని.. స్పెషల్ టారిఫ్ లు విధిస్తామని ప్రకటించారు ట్రంప్. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంది.. చైనా దేశంలో పెరుగుతున్న ఆందోళనల క్రమంలో.. చైనా దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించే మార్గంగానే.. తైవాన్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

ఏది ఏమైనా చైనా వార్నింగ్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో తైవాన్ పై భీకరంగా విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి.